ఇంగ్లండ్‌ పైచేయి... | West Indies 137 for 6 and trai England by 232 runs | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌ పైచేయి...

Published Sun, Jul 26 2020 5:58 AM | Last Updated on Sun, Jul 26 2020 6:02 AM

West Indies 137 for 6 and trai England by 232 runs - Sakshi

మాంచెస్టర్‌: సాధారణంగా చప్పగా సాగిపోయే టెస్టు మ్యాచ్‌ ఇక్కడ రెండోరోజు మాత్రం వేగంగా మారిపోయింది. కష్టాలు సెషన్ల వారీగా జట్టు నుంచి జట్టుకు బదిలీ అయ్యాయి. అయితే ఓవరాల్‌గా నిర్ణాయక మూడో టెస్టులో రెండో రోజు ఆటను ఆతిథ్య ఇంగ్లండ్‌ జట్టు శాసించింది. తొలి సెషన్‌లో తమ పేస్‌ పదునుతో దడదడలాడించిన వెస్టిండీస్‌ తర్వాత సెషన్‌ నుంచి కష్టాల్లో పడింది.

ఆట ముగిసే సమయానికి పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోయింది. వెలుతురులేమితో ఆటను ముగించే సమయానికి వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 47.1 ఓవర్లలో 6 వికెట్లకు 137 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు విండీస్‌ మరో 232 పరుగుల దూరంలో ఉంది. అంతకుముందు ఇంగ్లండ్‌ టెయిలెండర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ (45 బంతుల్లో 62; 9 ఫోర్లు, 1 సిక్స్‌) ఇన్నింగ్స్‌ హైలైట్‌గా నిలిచింది.  

ఇంగ్లండ్‌ కష్టాలతో...
ఓవర్‌నైట్‌ స్కోరు 258/4తో శనివారం ఆట కొనసాగించిన ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో పోప్‌ (150 బంతుల్లో 91; 11 ఫోర్లు), సెంచరీ చేస్తాడనుకుంటే ఒక్క పరుగైనా చేయకుండానే పాత స్కోరుకే ఔటయ్యాడు. బట్లర్‌ (142 బంతుల్లో 67; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా క్రితంరోజు స్కోరుకు 11 మాత్రమే జత చేశాడు. ఇద్దరినీ గాబ్రియెల్‌ పెవిలియన్‌ పంపాడు. తర్వాత కీమర్‌ రోచ్‌... వోక్స్‌ (1), ఆర్చర్‌ (3)లను ఔట్‌ చేశాడు. వరుస నాలుగు ఓవర్లలోనూ 4 వికెట్లు పడిపోవడంతో  ఇంగ్లండ్‌ 280/8 స్కోరుతో కష్టాల్లో పడింది. ఒకదశలో 300 పరుగుల్లోపే తొలి ఇన్నింగ్స్‌ ముగిసేలా కనిపించింది.

కానీ బ్రాడ్‌ మెరిపించడంతో టెస్టు కాసేపు వన్డేలా మారింది. ఈ టెయిలెండర్‌ దూకుడు పెరగడంతో జట్టు స్కోరు కూడా పెరిగింది. బ్రాడ్‌ 33 బంతుల్లో అర్ధసెంచరీ (8 ఫోర్లు, 1 సిక్స్‌) ఇంగ్లండ్‌ టెస్టు చరిత్రలో వేగవంతమై మూడో అర్ధసెంచరీగా నిలిచింది. డామ్‌ బెస్‌ (18 నాటౌట్‌; 1 ఫోర్‌)తో తొమ్మిదో వికెట్‌కు జతచేసిన 76 పరుగుల భాగస్వామ్యం ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ను పటిష్టం చేసింది. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 111.5 ఓవర్లలో 369 పరుగుల వద్ద ఆలౌటైంది. రోచ్‌ 4, గాబ్రియెల్, చేజ్‌ చెరో 2 వికెట్లు తీశారు. వోక్స్‌ను ఔట్‌ చేయడంతో కీమర్‌ రోచ్‌ 200 వికెట్ల క్లబ్‌లోకి చేరాడు.   

విండీస్‌ విలవిల...
తొలి ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన విండీస్‌ను బ్రాడ్‌ బంతితోనూ దెబ్బ తీశాడు. తన మొదటి ఓవర్లోనే క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ (1)ను పడేశాడు. కాసేపయ్యాక మరో ఓపెనర్‌ జాన్‌ క్యాంప్‌బెల్‌ (32)ను ఆర్చర్‌ ఔట్‌ చేయగా... షై హోప్‌ (17) అండర్సన్‌ స్వింగ్‌కు కంగుతిన్నాడు. టీ విరామంలోపే ఈ మూడు వికెట్లు పడటం కరీబియన్‌ ఇన్నింగ్స్‌ను దారుణంగా దెబ్బతీసింది. అప్పుడు విండీస్‌ స్కోరు 58/3. ఆఖరి సెషన్‌లోనూ ఇంగ్లండ్‌ బౌలర్ల హవానే కొనసాగడంతో వెస్టిండీస్‌ విలవిలలాడింది.

బ్రూక్స్‌ (4)ను అనుభవజ్ఞుడైన అండర్సన్‌ బుట్టలో పడేయగా... చేజ్‌ (9)ను బ్రాడ్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. 73 పరుగులకే 5 వికెట్లను కోల్పోయింది. కాసేపు పోరాడిన బ్లాక్‌వుడ్‌ (26; 3 ఫోర్లు)... విండీస్‌ స్కోరు కష్టంగా 100 పరుగులు దాటాక వోక్స్‌ బౌలింగ్‌లో నిష్క్రమించాడు. ఆట నిలిచే సమయానికి కెప్టెన్‌ హోల్డర్‌ (24 బ్యాటింగ్‌; 4 ఫోర్లు), డౌరిచ్‌ (10 బ్యాటింగ్‌; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. విండీస్‌ ఫాలోఆన్‌ తప్పించుకోవాలంటే మరో 33 పరుగులు చేయాలి.

టెస్టు క్రికెట్‌లో 200 వికెట్లు పూర్తి చేసుకున్న తొమ్మిదో వెస్టిండీస్‌ బౌలర్‌గా కీమర్‌ రోచ్‌ గుర్తింపు పొందాడు. గతంలో విండీస్‌ తరఫున కొట్నీ వాల్‌‡్ష, ఆంబ్రోస్, మార్షల్, లాన్స్‌ గిబ్స్, గార్నర్, హోల్డింగ్, గ్యారీ సోబర్స్, ఆండీ రాబర్ట్స్‌ ఈ ఘనత సాధించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement