రోసీయూ (డొమినికా): వెస్టిండీస్‌తో ప్రారంభమైన తొలి టెస్టులో మొదటి రోజే భారత్ పైచేయి సాధించింది. తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో ప్రత్యర్థిని కుప్పకూల్చింది. భారత బౌలర్ల ధాటికి విండీస్ బ్యాటర్లు చేతులెత్తేశారు. తొలి రోజు టీ విరామ సమయానికి వెస్టిండీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. కెరీర్‌లో మొదటి టెస్టు ఆడుతున్న అలిక్ అతనజ్ (99 బంతుల్లో 47; 6 ఫోర్లు, 1 సిక్స్) మినహా అంతా విఫలమయ్యారు. అశ్విన్ 4 వికెట్లు పడగొట్టగా, జడేజాకు 2 వికెట్లు దక్కాయి.
టాస్ గెలిచి విండీస్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి వికెట్‌కు 31 పరుగులు జత చేసి ఓపెనర్లు క్రెయిగ్ బ్రాత్‌వైట్ (20), తేజ్‌నారాయణ్ చందర్‌పాల్ (12) కుదురుకున్నట్లుగా అనిపించారు. అయితే 7 పరుగుల వ్యవధిలో వీరిద్దరిని అశ్విన్ అవుట్ చేసి దెబ్బ కొట్టాడు. శార్దుల్ తన తొలి ఓవర్లోనే రీఫర్ (2)ను వెనక్కి పంపగా, సిరాజ్ చక్కటి క్యాచ్‌కు బ్లాక్‌వుడ్ (14) అవుట్ కావడంతో లంచ్ సమయానికే స్కోరు 68/4కు చేరింది. మరో ఎండ్‌లో అలిక్ మాత్రమే ఆత్మవిశ్వాసంతో కనిపించాడు.
సొంత మైదానంలో అతను కొన్ని చక్కటి షాట్లతో జట్టును ఆదుకున్నాడు. రెండో సెషన్‌లో భారత్ మరో 3 వికెట్లు తీయడంలో సఫలమైంది. డి సిల్వ (2) ప్రభావం చూపలేకపోగా, హోల్డర్ (18) వికెట్ సిరాజ్ ఖాతాలో చేరింది. ఐదు పరుగుల వ్యవధిలో జోసెఫ్ (4), అలిక్‌లను అశ్విన్ అవుట్ చేశాడు. జోసెఫ్ వికెట్‌తో అశ్విన్ అంతర్జాతీయ వికెట్ల సంఖ్య 700కు చేరడం విశేషం.
యశస్వి, ఇషాన్ అరంగేట్రం
తొలి టెస్టులో భారత జట్టు ఇద్దరు కొత్త ఆటగాళ్లకు అవకాశం క ల్పించింది. ఊహించిన విధంగానే యశస్వి జైస్వాల్‌కు తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడే అవకాశం లభించగా... వికెట్ కీపర్‌గా ఇప్పటికే 14 వన్డేలు, 27 టి20లు ఆడిన ఇషాన్ కిషన్ తొలిసారి టెస్టు క్రికెట్ బరిలోకి దిగాడు. భారత్ తరఫున టెస్టులు ఆడిన 306వ, 307వ ఆటగాళ్లుగా వీరిద్దరు నిలిచారు.
భారత్ ఆడిన గత ఐదు టెస్టుల్లో కీపర్‌గా ఉన్న ఆంధ్ర ఆటగాడు కేఎస్ భరత్ స్థానంలో ఈసారి టీమ్ మేనేజ్‌మెంట్ ఇషాన్‌కు తుది జట్టులో చోటు ఇచ్చింది. జార్ఖండ్‌కు చెందిన ఇషాన్ 48 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 38.76 సగటుతో 2985 పరుగులు చేశాడు.
ముంబై ఆటగాడు యశస్వి గత రెండేళ్లుగా అన్ని ఫార్మాట్‌లలో సత్తా చాటుతూ సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఐపీఎల్‌లో మెరుపులు, దేశవాళీ వన్డేల్లో మెరుపు బ్యాటింగ్ మాత్రమే కాకుండా 15 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలోనే 9 సెంచరీలతో 80.21 సగటుతో 1845 పరుగులు సాధించడం అతనికి అవకాశం క ల్పించింది.
Comments
Please login to add a commentAdd a comment