పెను సంచలనం.. ఆసీస్‌ను చిత్తుగా ఓడించిన విండీస్‌ | West Indies Stuns Australia In Second Test At Brisbane | Sakshi
Sakshi News home page

పెను సంచలనం.. ఆసీస్‌ను చిత్తుగా ఓడించిన విండీస్‌

Published Sun, Jan 28 2024 1:59 PM | Last Updated on Sun, Jan 28 2024 2:48 PM

West Indies Stuns Australia In Second Test At Brisbane - Sakshi

టెస్ట్‌ క్రికెట్‌లో పెను సంచలనం నమోదైంది. వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాను శోభ తగ్గిన విండీస్‌ వారి సొంత దేశంలోనే చిత్తుగా ఓడించింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బిస్బేన్‌ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో విండీస్‌ 8 పరుగుల తేడాతో విజయం సాధించి, 1-1తో సిరీస్‌ను సమం చేసుకుంది.

రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ను గెలిపించేందుకు ఓపెనర్‌ స్టీవ్‌ స్మిత్‌ (91 నాటౌట్‌) ఆఖరి వరకు ప్రయత్నించాడు. అయితే షమార్‌ జోసఫ్‌ (7/68) విజృంభించడంతో ఆసీస్‌కు పరాభవం​ తప్పలేదు. 1997 తర్వాత ఆసీస్‌ను వారి సొంత దేశంలో ఓడించడం విండీస్‌కు ఇది మొదటిసారి. ఈ మ్యాచ్‌లో షమార్‌ జోసఫ్‌ బొటనవేలి ఫ్రాక్చర్‌తో బాధపడుతూనే అద్భుతం చేశాడు.

ఇదే సిరీస్‌లోని తొలి మ్యాచ్‌తో టెస్ట్‌ క్రికెట్‌ అరంగేట్రం చేసిన షమార్‌ సంచలన ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నాడు. తొలి మ్యాచ్‌లో కూడా షమార్‌ బంతితో, బ్యాట్‌తో రాణించాడు. పదకొండో నంబర్‌ ఆటగాడిగా వచ్చి అతి మూల్యమైన పరుగులు చేయడంతో పాటు ఐదు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టాడు. అత్యంత పటిష్టమైన ఆసీస్‌ను వారి సొంత దేశంలో ఓడించడంతో విండీస్‌ ఆటగాళ్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

విండీస్‌ జనం ఈ గెలుపుతో పండుగ చేసుకుంటున్నారు. ఇటీవలికాలంలో చిన్న జట్ల చేతుల్లో కూడా పరాజయాలు ఎదుర్కొని, కనీసం వన్డే వరల్డ్‌కప్‌కు (2023) అర్హత సాధించలేకపోయిన విండీస్‌... ఈ గెలుపుతో పూర్వవైభవం సాధించేలా కనిపిస్తుంది. 

మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన చేసిన విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగులకు ఆలౌటైంది. కవెమ్‌ హాడ్జ్‌ (71), జాషువ డసిల్వ (79), కెవిన్‌ సింక్లెయిర్‌ (50) అర్ధసెంచరీలతో సత్తా చాటారు. స్టార్క్‌ నాలుగు, హాజిల్‌వుడ్‌, కమిన్స్‌ తలో రెండు, నాథన్‌ లయోన్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. 

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ 9 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది.ఉస్మాన్‌ ఖ్వాజా (75), అలెక్స్‌ క్యారీ (65), కమిన్స్‌ (64 నాటౌట్‌) అర్ధసెంచరీలతో రాణించారు. విండీస్‌ బౌలర్లలో అల్జరీ జోసఫ్‌ 4, కీమర్‌ రోచ్‌ 3, షమార్‌ జోసఫ్‌, కెవిన్‌ సింక్లెయిర్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

విండీస్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 193 పరుగులకు ఆలౌటైంది. విండీస్‌ ఇన్నింగ్స్‌లో కిర్క్‌ మెక్‌కెంజీ (41) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. హాజిల్‌వుడ్‌, లయోన్‌ తలో మూడు వికెట్లు, గ్రీన్‌, స్టార్క్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

216 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్‌ను షమార్‌ మ్యాజిక్‌ స్పెల్‌తో ఇబ్బంది పెట్టాడు. షమార్‌ ధాటికి ఆసీస్‌ 193 పరుగులకే ఆలౌటై, ఓటమిపాలైంది. షమార్‌తో పాటు అల్జరీ జోసఫ్‌ (2/62), జస్టిన్‌ గ్రీవ్స్‌ (1/46) వికెట్లు పడగొట్టారు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement