ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తొలి టెస్ట్ మ్యాచ్ హైదరాబాద్ వేదికగా రేపటి నుంచి (జనవరి 25) ప్రారంభంకానుంది. సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌లకు భారత్ జట్టును ఇదివరకే ప్రకటించారు. అయితే తొలి టెస్ట్ ప్రారంభానికి ముందు భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి అభిమానులకు ఊహించని షాకిచ్చాడు.
వ్యక్తిగత కారణాల చేత తొలి రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉండనున్నట్లు ప్రకటించాడు. ఈ విషయాన్ని అతను నేరుగా చెప్పనప్పటికీ బీసీసీఐచే అధికారికంగా ప్రకటన విడుదల చేయించాడు. కోహ్లి అకస్మిక ప్రకటనతో అభిమానులతో పాటు సహచరులు కూడా అవాక్కయ్యారు. ఉన్నట్లుండి కోహ్లికి ఏమంత సమస్య వచ్చి పడిందని అనుకున్నారు. అయితే ఈ లోపే బీసీసీఐ మరో ప్రకటన విడుదల చేసింది.
కోహ్లి ప్రైవసీని సహచర ఆటగాళ్లతో పాటు అభిమానులంతా గౌరవించాలని కోరింది. కోహ్లి అందుబాటులో ఉండకపోవడంపై ఆరా తీయడం మానుకోవాలని సూచించింది. ఈ విషయంలో భారత క్రికెట్ అభిమానులు ఎలాంటి ఊహాగానాలను నమ్మవద్దని పిలుపునిచ్చింది. బీసీసీఐ ఈ ప్రకటన చేయగానే పలువురు మాజీ క్రికెటర్లు సైతం కోహ్లి ప్రైవసీని గౌరవించాలని పిలుపునిచ్చారు.
కోహ్లి విషయంలో బీసీసీఐ, మాజీ క్రికెటర్లు ఈ స్థాయిలో ఏక కంఠంతో స్పందించడంతో ఏదో జరుగుతుందని అభిమానులు అనుమానించడం మొదలుపెట్టారు. కోహ్లి ఏ కారణం లేకుండానే జట్టు నుంచి తప్పుకున్నాడా లేక నిజంగానే ఏదైనా కారణముందా అని ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో పలు పుకార్లు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి.
కోహ్లికి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో అలాగే బీసీసీఐతో విభేదాలు తారా స్థాయికి చేరాయని, అందుకే అతను ఈ మధ్యకాలంలో తరుచూ జట్టుకు దూరంగా ఉంటున్నాడని కామెంట్లు చేస్తున్నారు. కొందరేమో కోహ్లి భార్య అనుష్క శర్మ ఆనారోగ్యంతో బాధపడుతుందంటూ నిరాధారమైన పోస్ట్‌లు పెడుతున్నారు. కోహ్లిపై ఈ విష ప్రచారాన్ని పక్కన పెడితే, అతను లేని లోటు మాత్రం టీమిండియాకు భారీ నష్టాన్ని కల్గిసున్నది కాదనలేని సత్యం.
కెరీర్‌లో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న సమయంలో కోహ్లి జట్టుకు దూరం కావడాన్ని సగటు భారత క్రికెట్ అభిమాని జీర్ణించుకోలేకపోతున్నాడు. కోహ్లి జట్టుకు దూరం కావడం కచ్చితంగా టీమిండియా విజయావకాశాలను దెబ్బతీస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నిజమైన కోహ్లి అభిమానులు తమ ఆరాధ్య ఆటగాడి వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలంటూ పిలుపునిస్తున్నారు.
తండ్రి మరణవార్త తెలిసి కూడా బరిలోకి దిగి సెంచరీ బాదిన నిజమైన హీరో తమ కోహ్లి అంటూ కొనియాడుతున్నారు. మొత్తానికి తొలి టెస్ట్‌కు ముందు కోహ్లికి సంబంధించిన చర్చతో సోషల్‌మీడియా మొత్తంగా బిజీగా ఉంది. కాగా, భారత సెలెక్టర్లు ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్ట్‌లకు కోహ్లికి ప్రత్యామ్నాయంగా రజత్ పాటిదార్‌ను ఎంపిక చేశారు.
Comments
Please login to add a commentAdd a comment