Hanuma Vihari About His Love Story: ప్రేమ ఎవరినైనా మార్చేస్తుంది.. ప్రొఫెషన్‌తోతో సంబంధం లేకుండా.. కోతి పనులైనా సరే చేయించే శక్తి ప్రేమకు మాత్రమే ఉంది.. టీమిండియా క్రికెటర్ హనుమ విహారి విషయంలో ఇదే జరిగింది.. కులాంతర ప్రేమ వివాహం కోసం విహారి పడిన పాట్లు వింటే ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న వాళ్లకు గత జ్ఞాపకాలు గుర్తుకురావాల్సిందే.
తన నెచ్చెలి ప్రీతి ప్రేమ కోసం ఎదురుచూపులు.. ఆ తరువాత ఆమె తల్లిదండ్రులను ఒప్పించేక్రమంలో రెండేళ్ల ఎడబాటు.. ఆపై పెళ్లితో శుభం కార్డు.. విహారి వీర ప్రేమగాథను తెలుసుకోవాలంటే ఇటు వైపు ఓ లుక్ వెయ్యండి! ఘ
ఐపీఎల్‌లో..
టీమిండియా టెస్టు క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న బ్యాటర్ హనుమ విహారి. ఐపీఎల్‌లో.. 2019లో ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఆడిన ఈ అతడు.. ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో ఇప్పటివరకు మొత్తంగా 23 ఇన్నింగ్స్ ఆడిన హనుమ విహారి.. 14.2 సగటు, 88.47 స్ట్రైక్ రేట్‌తో 284 పరుగులు చేశాడు.
టీమిండియా తరఫున టెస్టుల్లో
ఇక టీమిండియా తరఫున 16 టెస్టుల్లో 839 పరుగులు సాధించడంతో పాటు 5 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడీ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్. అత్యధిక స్కోరు 111. ఇదిలా ఉంటే.. టెస్టుల్లో కీలక ఆటగాడైన విహారి అనేక మ్యాచ్‌లను ఒంటిచేత్తో గెలిపించిన సందర్భాలున్నాయి.
జాతీయ జట్టుకు ఆడే అవకాశం వచ్చినపుడల్లా తనను తాను నిరూపించుకుంటున్న విహారి.. విమర్శకుల ప్రశంసలతో పాటు క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ మెప్పు కూడా పొందాడు. ఇలా ఓవైపు క్రికెటర్‌గా కెరీర్ కొనసాగిస్తూనే.. మరోవైపు ప్రేమాయణాన్ని కూడా సాగించాడీ బ్యాటింగ్ ఆల్‌రౌండర్.
తల్లే మొదటి గురువు
కాకినాడలోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన విహారి.. చిన్నతనంలోనే తన తండ్రిని కోల్పోయాడు. తల్లి ఇచ్చిన మనోధైర్యంతో ప్రోత్సాహంతో క్రికెటర్‌గా ఎదిగాడు. ఇప్పటికీ తన మొదటి గురువు తన తల్లి అని గర్వంగా విహారి చెబుతున్నాడు.
ప్రీతి అంటే మహాప్రీతి..
ఇక విహారి ప్రేమ విషయానికొస్తే.. తన స్నేహితురాలు ద్వారా ప్రీతి అతడికి పరిచయమైంది. స్నేహం పెరిగి కాస్త ప్రేమగా మారింది.. ఎలాంటి లవ్ స్టోరీలో అయినా కొన్ని కష్టాలు తప్పవు.. విహారికి కూడా అలాంటి అనుభవమే ఎదురైంది.
ప్రేమ కోసం మినీ యుద్ధమే
విహారి, ప్రీతి సామాజిక వర్గాలు వేరు కావడంతో అమ్మాయి ఇంట్లో పెళ్ళికి నిరాకరించారు. దీంతో.. రెండేళ్ల పాటు కష్టపడి.. వారిని ఒప్పించి చివరికి 2019లో ఇద్దరూ ఒకటయ్యారు. అయితే.. ఈ రెండేళ్ల పాటు ఓ మినీ యుద్ధమే చేశానని ‘సాక్షి’తో చెప్పుకొచ్చాడు విహారి.
ఎప్పుడైనా ప్రీతిని చూడాలనిపిస్తే గోడ దూకి మరి వెళ్లి చూసేవాడిని సిగ్గుపడుతూ అప్పటి జ్ఞాపకాల్ని గుర్తు తెచ్చుకున్నాడు. కాగా హనుమ విహారి- ప్రీతి ప్రేమకు గుర్తుగా వారికి కొడుకు జన్మించాడు. కాగా విహారి భార్య ప్రీతికి క్రికెట్ అంటే పెద్దగా ఆసక్తి లేనప్పటికీ భర్త కోపసం మ్యాచ్‌లు చూస్తుందట.
ఏపీ ప్రభుత్వం సూపర్
ఇదిలా ఉంటే.. ఇటీవల విహారి ఆంధ్రప్రీమియర్ లీగ్‌లో ఆడిన విషయం తెలిసిందే. ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ.. హైదరాబాద్ నుంచి తిరిగి మళ్ళీ సొంతరాష్ట్రంలో ఏపీఎల్ సీజన్-2లో ఆడటం ఎంతో ఆనందంగా ఉందని విహారి పేర్కొన్నాడు.
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇప్పుడున్న కొత్త క్రీడాకారులకు ఎంతగానో సహాయపడుతోందని.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్థాయిలో పోటీ పడేవిధంగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ రెండు సీజన్లను పూర్తి చేశారని ప్రశంసించాడు. మొదటి సీజన్లో తాను ఆడకపోయినా టీవీలో చూసి ఎంతో గర్వపడ్డానని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రీడాకారులను ఎంతో గానో ప్రోత్సహిస్తున్నది అని హనుమ విహారి హర్షం వ్యక్తం చేశాడు. కాగా ఏపీఎల్ సీజన్-2లో రాయలసీమ కింగ్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన హనుమ విహారి జట్టుకు టైటిల్ అందించిన విషయం తెలిసిందే.
నరేష్, కరస్పాండెంట్, సాక్షి టీవీ, విశాఖపట్నం
Comments
Please login to add a commentAdd a comment