క్రికెట్‌లో ఒక్కోసారి చిన్న చిన్న తప్పిదాలు మ్యాచ్ ఫలితాలను మార్చేస్తాయి. తాజాగా టీ20 వరల్డ్‌కప్-2024లో అలాంటి ఓ తప్పిదమే భారత్-అమెరికా మ్యాచ్ స్వరూపాన్నే మార్చివేసింది.
ఐసీసీ నిబంధనల పట్ల అవగాహన లేక ఈ మ్యాచ్‌లో అమెరికా జట్టు.. టీమిండియాకు 5 పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది. దీంతో మ్యాచ్ ఒక్కసారిగా భారత్‌వైపు మలుపు తిరిగిపోయింది.
అసలేం జరిగిందంటే?
ఈ మ్యాచ్‌లో అమెరికా నిర్ధేశించిన 111 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు టీమిండియా కొంచెం కష్టపడింది. లక్ష్య చేధనలో భారత్ 16 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 87 పరుగులు చేసింది. ఈ క్రమంలో 17 ఓవర్ వేసేందుకు అమెరికా బౌలర్ షాడ్లీ వాన్ షాల్క్‌విక్ సిద్దమయ్యాడు.
అయితే ఒక్కసారిగా ఫీల్డ్ అంపైర్ అమెరికాకు ఐదు పరుగులు పెనాల్టీ విధిస్తూ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో ఏమి జరుగుతుందో తెలియక అమెరికా ఆటగాళ్లు తెల్లముఖం వేశారు. వెంటనే అంపైర్‌లు ‘స్టాప్ క్లాక్’ రూల్ ప్రకారం ఐదు పరుగులు పెనాల్టీ విధించమంటూ చెప్పుకొచ్చారు. దీంతో భారత్‌కు టార్గెట్ చేధన మరింత సులభమైంది.
ఏంటి స్టాప్ క్లాక్ రూల్?
వన్డేలు, టీ20లలో రెండు ఓవర్ల మధ్య గ్యాప్‌ను తగ్గించేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ గతేడాది డిసెంబర్‌లో ఈ స్టాప్ క్లాక్‌ను తీసుకొచ్చింది. ఈ రూల్ ప్రకారం.. బౌలింగ్ చేసే జట్టు ఒక ఓవర్ పూర్తి చేశాక 60 సెకన్ల (ఒక నిమిషం)లో మరో ఓవర్‌ను ప్రారంబించాలి.
ఒకవేళ అలాకాని పక్షంలో మ్యాచ్‌లో బౌలింగ్ జట్టు ఈ నిబంధనను మూడు సార్లు గనక ఉల్లంఘిస్తే అప్పుడు ప్రత్యర్థి జట్టుకు పెనాల్టీ రూపంలో లభిస్తాయి. ఇప్పుడు ప్రస్తుత మ్యాచ్‌లో అమెరికా మూడు సార్లు ఈ రూల్‌ను ఉల్లఘించడంతో అంపైర్లు పెనాల్టీ విధించారు.
ఇక ఈ మ్యాచ్‌లో యూఎస్‌పై 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో సూపర్-8కు టీమిండియా క్వాలిఫై అయింది.
Comments
Please login to add a commentAdd a comment