WI vs ENG 2nd T20: స్పిన్నర్‌ యార్కర్‌ వేస్తే ఎలా ఉంటుందో తెలుసా..? | WI vs ENG 2nd T20: Dan Mousley Bamboozled Rovman Powell With An Off Spin Yorker | Sakshi
Sakshi News home page

WI vs ENG 2nd T20: స్పిన్నర్‌ యార్కర్‌ వేస్తే ఎలా ఉంటుందో తెలుసా..?

Published Mon, Nov 11 2024 2:58 PM | Last Updated on Mon, Nov 11 2024 3:12 PM

WI vs ENG 2nd T20: Dan Mousley Bamboozled Rovman Powell With An Off Spin Yorker

క్రికెట్‌లో సాధారణంగా ఫాస్ట్‌ బౌలర్లు యార్కర్లు వేయడం మనం చూస్తుంటాం. అదే ఓ స్పిన్నర్‌ యార్కర్‌ వేస్తే ఎలా ఉంటుందో తెలియాలంటే ఈ వీడియో చూడండి. వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌ మధ్య తాజాగా జరిగిన టీ20 మ్యాచ్‌లో ఓ రైట్‌ ఆర్మ్‌ ఆఫ్‌ స్పిన్‌ బౌలర్‌ అద్భుతమైన యార్కర్‌ను సంధించాడు. స్పిన్నర్‌ నుంచి అనూహ్యంగా యార్కర్‌ లెంగ్త్‌ బాల్‌ రావడంతో బ్యాటర్‌ చేసేదేమీ లేక నిశ్చేష్టుడిగా మిగిలిపోయాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఆ జట్టు బ్యాటర్‌ రోవ్‌మన్‌ పావెల్‌ 40 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 43 పరుగులు చేసి జోరు మీదున్నాడు. ఈ దశలో ఇంగ్లండ్‌ రైట్‌ ఆర్మ్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ డాన్‌ మౌస్లీ కళ్లు చెదిరే యార్కర్‌తో రోవ్‌మన్‌ పావెల్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. మౌస్లీ సంధించిన యార్కర్‌ లెంగ్త్‌ బంతికి రోవ్‌మన్‌ దగ్గర సమాధానం లేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.

కాగా, వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌ మధ్య నిన్న (నవంబర్‌ 10) జరిగిన రెండో టీ20లో ఇంగ్లండ్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. రోవ్‌మన్‌ పావెల్‌ (43) ఓ మోస్తరు స్కోర్‌ చేయగా.. రొమారియో షెపర్డ్‌ (22), నికోలస్‌ పూరన్‌ (14), రోస్టన్‌ ఛేజ్‌ (13), మాథ్యూ ఫోర్డ్‌ (13 నాటౌట్‌) రెండంకెల స్కోర్లు చేశారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో మౌస్లీ, లివింగ్‌స్టోన్‌, సకీబ్‌ మహమూద్‌ తలో 2 వికెట్లు పడగొట్టగా.. జోఫ్రా ఆర్చర్‌, ఆదిల్‌ రషీద్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌.. జోస్‌ బట్లర్‌ (45 బంతుల్లో 83; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) వీరవిహారం చేయడంతో 14.5 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. బట్లర్‌కు జతగా విల్‌ జాక్స్‌ (29 బంతుల్లో 38), లివింగ్‌స్టోన్‌ (11 బంతుల్లో 23 నాటౌట్‌) రాణించారు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో ఫిల్‌ సాల్ట్‌ డకౌట్‌ కాగా.. జేకబ్‌ బేతెల్‌ 3 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ గెలుపుతో ఇంగ్లండ్‌ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో వెళ్లింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement