ఎనిమిదేళ్ల కెరీర్‌లో తొలి సెంచరీ.. దీని వల్ల సంజూ: గావస్కర్‌ | Gavaskar Prediction After Sanju Samson 1st International Ton, This Century Will Change His Career- Sakshi
Sakshi News home page

Ind vs SA: ఎనిమిదేళ్ల కెరీర్‌లో తొలి సెంచరీ.. దీని వల్ల సంజూ: గావస్కర్‌

Published Fri, Dec 22 2023 4:08 PM | Last Updated on Fri, Dec 22 2023 5:11 PM

This Will Change His: Gavaskar Prediction After Sanju Samson 1st International Ton - Sakshi

సంజూ శాంసన్‌

టీమిండియా బ్యాటర్‌ సంజూ శాంసన్‌పై క్రికెట్‌ దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ ప్రశంసలు కురిపించాడు. సౌతాఫ్రికాతో వన్డేలో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడని.. ఇకపై అతడి కెరీర్‌ ఊపందుకుంటుందని పేర్కొన్నాడు. కాగా 2015లో జింబాబ్వేతో మ్యాచ్‌ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన కేరళ బ్యాటర్‌ సంజూ శాంసన్‌కు టీమిండియాలో తగినన్ని అవకాశాలు రాలేదనే చెప్పాలి.

అడపాదడపా ఛాన్స్‌లు వచ్చినా వాటిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోయాడన్న అపవాదూ అతడిపై ఉంది. ఈ నేపథ్యంలో సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్‌-2023 జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన ఈ వికెట్‌ కీపర్‌కు సౌతాఫ్రికా పర్యటన రూపంలో సువర్ణావకాశం దక్కింది.

ప్రొటిస్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికైన సంజూ శాంసన్‌కు తొలి వన్డేలో బ్యాటింగ్‌ చేసే అవకాశం రాకపోగా.. రెండో మ్యాచ్‌లో 12 పరుగులకే పెవిలియన్‌ చేరాడు. అయితే, ట్రోఫీ కైవసం చేసుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఏకంగా సెంచరీతో కదం తొక్కాడు.

పర్ల్‌ వేదికగా గురువారం నాటి మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు అనుకూలంగా లేని పిచ్‌పై.. సహచర ఆటగాళ్లు విఫలమైన వేళ సంజూ శతక్కొట్టాడు. మొత్తంగా 114 బంతులు ఎదుర్కొని ఆరు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 108 పరుగులు సాధించాడు. 

ఇక సంజూ ఇన్నింగ్స్‌ కారణంగా టీమిండియా 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 296 పరుగుల మెరుగైన స్కోరు సాధించింది. లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా బ్యాటర్లను భారత బౌలర్లు ఓ ఆట ఆడుకున్నారు. దీంతో 218 పరుగులకే ఆలౌట్‌ అయిన ప్రొటిస్‌ జట్టు వన్డే సిరీస్‌ను 1-2తో టీమిండియాకు సమర్పించుకుంది. 

ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన సంజూను ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు వరించింది. కాగా సంజూ ఎనిమిదేళ్ల కెరీర్‌లో తొలి అంతర్జాతీయ సెంచరీ.. అది కూడా సఫారీ గడ్డపై నమోదు చేయడం విశేషం. ఈ నేపథ్యంలో కామెంటేటర్‌ సునిల్‌ గావస్కర్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ సెంచరీ అతడి కెరీర్‌ను మలుపు తిప్పుతుంది.

నిజానికి సంజూ ఎంతటి ప్రతిభావంతుడో అందరికీ తెలిసిందే. అయితే.. తనను తాను నిరూపించుకోవడంలో ఇన్నాళ్లు విఫలమయ్యాడు. సరైన సమయంలో తనలోని నైపుణ్యాలను బయటకు తీసి అద్భుతం చేశాడు. ఇతరులతో పాటు తనకు తానేంటో కూడా చూపించుకోగలిగాడు’’ అని సంజూను కొనియాడాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement