IPL 2025: పంత్‌ ఏ జట్టుకు ఆడనున్నాడో తెలిసిపోయింది! | He Will Definitely Be Retained: DC Co-Owner Parth Jindal Reveals Who Would Be Retained In IPL 2025 | Sakshi
Sakshi News home page

IPL 2025: పంత్‌ ఏ జట్టుకు ఆడనున్నాడో తెలిసిపోయింది!

Published Wed, Oct 2 2024 9:27 PM | Last Updated on Thu, Oct 3 2024 10:40 AM

Will Definitely Be Retained: DC Owner Reveals Who Would be Retained IPL 2025

PC: DC/BCCI

ఐపీఎల్‌-2025లో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ ఏ జట్టుకు ఆడనున్నాడో తెలిసిపోయింది. వచ్చే ఏడాది కూడా అతడు ఢిల్లీ క్యాపిటల్స్‌కే ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఈ విషయాన్ని ఢిల్లీ ఫ్రాంఛైజీ సహ యజమాని పార్థ్‌ జిందాల్‌ స్వయంగా వెల్లడించాడు. ఈ సందర్భంగా తమ జట్టులోని ఇతర ఆటగాళ్ల గురించి కూడా ప్రస్తావించాడు.

త్వరలోనే ఐపీఎల్‌ మెగా వేలం జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి ఇప్పటికే రిటెన్షన్‌ పాలసీకి సంబంధించిన విధివిధానాలు ఖరారు చేసింది. ఫ్రాంఛైజీల పర్సు వాల్యూను 120 కోట్ల రూపాయలకు పెంచడంతో పాటు రైట్‌ టు మ్యాచ్‌ ఆప్షన్‌ను తిరిగి ప్రవేశపెట్టింది.

రిషభ్‌ పంత్‌ను కచ్చితంగా రిటైన్‌ చేసుకుంటాం
ఈసారి.. ఒక ఫ్రాంఛైజీ అత్యధికంగా ఆరుగురు ప్లేయర్లను రిటైన్‌ చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో పార్థ్‌ జిందాల్‌ తాజాగా హర్యానాలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నిబంధనలకు అనుగుణంగా మేము ప్లేయర్లను రిటైన్‌ చేసుకోవాలి. సహ యజమాని జీఎంఆర్‌ గ్రూపుతో పాటు మా క్రికెట్‌ డైరెక్టర్‌ సౌరవ్‌ గంగూలీతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటాం.

మా జట్టులో చాలా మంది అద్భుతంగా ఆడతారు. రిషభ్‌ పంత్‌ను మాత్రం కచ్చితంగా రిటైన్‌ చేసుకుంటాం. అక్షర్‌ పటేల్‌ కూడా గొప్ప నైపుణ్యాలున్న క్రికెటర్‌. అలాగే ట్రిస్టన్‌ స్టబ్స్‌, జేక్‌ ఫ్రేజర్‌-మెగర్క్‌, కుల్దీప్‌ యాదవ్‌, అభిషేక్‌ పోరెల్‌, ముకేశ్‌ కుమార్‌, ఖలీల్‌ అహ్మద్‌.. అంతా బాగా ఆడతారు. అయితే, వేలం నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేము.

ఆరుగురు ప్లేయర్లను రిటైన్‌ చేసుకునే వీలుంది. అందరితో చర్చించిన తర్వాతే తుదినిర్ణయం తీసుకుంటాం’’ అని పేర్కొన్నాడు. కాగా 2022లో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన రిషభ్‌ పంత్‌.. ఐపీఎల్‌-2023 మొత్తానికి దూరమయ్యాడు. అయితే, ఈ ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా తిరిగి క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో అడుగుపెట్టాడు.

వికెట్‌ కీపింగ్‌ స్కిల్స్‌తో ఆకట్టుకోవడంతో పాటు.. ఈ లెఫ్టాండర్ బ్యాటర్‌ ఈ సీజన్‌లో‌ 446 పరుగులు సాధించాడు. అయితే, జట్టును టాప్‌-4లో నిలపలేకపోయాడు. దీంతో సారథిగా మాత్రం విఫలమయ్యాడనే విమర్శలు మూటగట్టుకున్నాడు. కాగా ఈ ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్‌ పద్నాలుగింట ఏడు మాత్రమే గెలిచి.. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. కాగా పంత్‌ వచ్చే సీజన్‌లో ఆర్సీబీ లేదంటే సీఎస్‌కేకు ఆడతాడనే ఊహాగానాలు వినిపించిన విషయం తెలిసిందే.

చదవండి: కోహ్లి, రవిశాస్త్రి వల్లే ఇదంతా.. నాకది పునర్జన్మ: రోహిత్‌ శర్మ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement