కోహ్లి, రవిశాస్త్రి వల్లే ఇదంతా.. నాకది పునర్జన్మ: రోహిత్‌ శర్మ | Like 2nd Birth: Rohit Sharma Reveals How Kohli Ravi Shastri Revived His Test Career | Sakshi
Sakshi News home page

కోహ్లి, రవిశాస్త్రి వల్లే ఇదంతా.. నాకది పునర్జన్మ: రోహిత్‌ శర్మ

Published Wed, Oct 2 2024 5:28 PM | Last Updated on Wed, Oct 2 2024 6:14 PM

Like 2nd Birth: Rohit Sharma Reveals How Kohli Ravi Shastri Revived His Test Career

టెస్టు క్రికెట్‌లో విరాట్‌ కోహ్లి, రవిశాస్త్రి తనకు పునర్జన్మను ప్రసాదించారని టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. వారిద్దరి వల్లే తన రెండో ఇన్నింగ్స్‌ మొదలైందని.. తనను టాపార్డర్‌కు ప్రమోట్‌ చేసి ఓపెనర్‌గా అవకాశమిచ్చింది కూడా వారేనంటూ కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. కాగా 2013లో కోల్‌కతా వేదికగా వెస్టిండీస్‌తో సిరీస్‌ సందర్భంగా ముంబై బ్యాటర్‌ రోహిత్‌ శర్మ టెస్టుల్లో అడుగుపెట్టాడు.

అరంగేట్రంలోనే అద్భుత శతకం
తొలి మ్యాచ్‌లో ఆరో స్థానంలో బరిలోకి దిగి అరంగేట్రంలోనే అద్భుత శతకం(177)తో ఆకట్టుకున్నాడు. విండీస్‌తో నాటి సిరీస్‌లో జరిగిన ఈ తొలి టెస్టులో ధోని సేన ఏకంగా ఇన్నింగ్స్‌ 51 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు గెలుచుకున్నాడు. తన రెండో టెస్టులోనూ శతక్కొట్టి వారెవ్వా అనిపించాడు. కానీ టెస్టు జట్టులో స్థానం సుస్థిరం చేసుకోలేకపోయాడు.

దాదాపు ఆరేళ్ల పాటు చోటే కరువు
అరంగేట్రం తర్వాత దాదాపు ఆరేళ్ల పాటు భారత టెస్టు తుదిజట్టులో రోహిత్‌ శర్మకు స్థానమే కరువైంది. అయితే, 2018-19లో విరాట్‌ కోహ్లి కెప్టెన్సీలో ఆస్ట్రేలియాతో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ ఆడిన జట్టులో రోహిత్‌ చోటు దక్కించుకోగలిగాడు. ఈ సిరీస్‌లోనూ అతడు ఆరో స్థానంలోనే బరిలోకి దిగాడు.

అలా రీఎంట్రీ
ఇక ఆ తర్వాత వన్డే వరల్డ్‌కప్‌-2019లో వరుసగా ఐదు సెంచరీలు బాదినా.. టెస్టుల్లో మాత్రం రోహిత్‌ రాత పెద్దగా మారలేదు. ఈ ఐసీసీ టోర్నీ తర్వాత వెస్టిండీస్‌తో ఆడిన టెస్టు సిరీస్‌లో అతడిని బెంచ్‌కే పరిమితం చేసింది మేనేజ్‌మెంట్‌. అయితే, నాడు ఓపెనర్‌గా ఉన్న కేఎల్‌ రాహుల్‌ పరుగులు రాబట్టడంలో విఫలం కావడంతో.. అప్పటి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి రోహిత​ శర్మను ఓపెనర్‌గా బరిలోకి దించారు.

 ఓపెనర్‌గా జట్టులో పాతుకుపోయిన హిట్‌మ్యాన్‌
అప్పటి నుంచి రోహిత్‌కు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. టీమిండియా ఓపెనర్‌గా జట్టులో పాతుకుపోయిన హిట్‌మ్యాన్‌ కెప్టెన్‌గా ఎదగడమే గాకుండా.. భారత్‌ను ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌(డబ్ల్యూటీసీ)కు చేర్చిన సారథిగానూ ఘనత సాధించాడు. తాజాగా బంగ్లాదేశ్‌తో సొంతగడ్డపై టీమిండియాను గెలిపించి.. మరోసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌ వేటలో జట్టును నిలిపాడు.

వాళ్లిద్దరు నాపై నమ్మకం ఉంచారు
ఈ నేపథ్యంలో కామెంటేటర్‌ జతిన్‌ సప్రూనకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్‌ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘టెస్టు కెరీర్‌ రెండో ఇన్నింగ్స్‌లో రవిశాస్త్రి, విరాట్‌ కోహ్లిలకు నేను చాలా రుణపడిపోయాను. నన్ను టాపార్డర్‌కు ప్రమోట్‌ చేసింది వాళ్లే. టెస్టుల్లో నన్ను ఓపెనర్‌గా పంపడం అంత సులువు కాదు. అయినా, వాళ్లిద్దరు నాపై నమ్మకం ఉంచారు.

తొలి బంతికే అవుటయ్యాను
నా ఆటను పరిశీలించేందుకు ఓ ప్రాక్టీస్‌మ్యాచ్‌ ఆడమని చెప్పారు. అయితే, అప్పుడు నేను తొలి బంతికే అవుటయ్యాను. ఇక నాకు ఓపెనర్‌గా ఎలాంటి అవకాశం లేదని నిరాశచెందాను. టెస్టుల్లో ఐదు లేదంటే ఆరో స్థానంలోనైనా.. లేదంటే లోయర్‌ఆర్డర్‌లోనైనా బ్యాటింగ్‌కు వెళ్లాల్సిందేనని ఫిక్సయ్యాను.

నమ్మకం నిలబెట్టుకుంటూ
కానీ రవి భాయ్‌ టెస్టుల్లో నన్ను ఓపెనర్‌గా పంపాలని భావించాడు. 2015లోనే నాకు ఈ అవకాశం వస్తే బాగుంటుందని చెప్పాడు. అయితే, అప్పుడు అది సాధ్యం కాలేదు. కానీ తర్వాత రవిభాయ్‌, కోహ్లి వల్ల టెస్టుల్లో ఓపెనర్‌గా ప్రమోట్‌ అయ్యాను’’ అని రోహిత్‌ శర్మ పేర్కొన్నాడు. రవిశాస్త్రి, విరాట్‌ కోహ్లి పట్ల ఈ సందర్భంగా కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. కాగా రోహిత్‌ తదుపరి స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌తో బిజీ కానున్నాడు.   

చదవండి: రిస్క్‌ అని తెలిసినా తప్పలేదు.. అతడొక అద్భుతం: రోహిత్‌ శర్మ
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement