
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పోరులో తలపడేందుకు భారత్, న్యూజిలాండ్ సంసిద్ధంగా ఉన్నాయి. ఈ రెండు జట్లు ఈ టోర్నమెంట్ ఫైనల్‌లో తలపడటం ఇది రెండోసారి. ఈ ఫైనల్ కి ముందు రెండు జట్లూ సమఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. ఈ టోర్నమెంట్ గ్రూప్ దశ మ్యాచ్‌లోభారత్ ఇప్పటికే కివీస్‌ను 44 పరుగుల తేడాతో ఓడించి కొద్దిగా పైచేయి తో ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ మ్యాచ్ లో శ్రేయాస్ అయ్యర్ 79 పరుగులు సాధించగా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 5 వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్ ని అద్భుతంగా నిలువరించడం తో భారత్ విజయం సాధించింది.
పాతికేళ్ల క్రితం... భారత్ ని దెబ్బతీసిన న్యూజిలాండ్
అయితే భారత్, న్యూజిలాండ్ జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో తలపడటం ఇది రెండోసారి. గతంలో అక్టోబర్ 15, 2000న కెన్యా రాజధాని నైరోబిలోని జింఖానా క్లబ్ గ్రౌండ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో కివీస్ జట్టు భారత్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి ట్రోఫీ ని ఎగరేసుకుపోయింది. కెప్టెన్ సౌరవ్ గంగూలీ అద్భుతమైన సెంచరీ చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ ఆరు వికెట్లకు 264 పరుగులు చేసింది.
గంగూలీ మరియు సచిన్ టెండూల్కర్ 26.3 ఓవర్లలో తొలి వికెట్‌కు 141 పరుగుల భాగస్వామ్యంతో పునాది వేశారు. టెండూల్కర్ 69 పరుగుల వద్ద రనౌట్ కావడంతో ఈ భాగస్వామ్యం తెగిపోయింది. అయితే, గంగూలీ తన ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు, 130 బంతుల్లో 117 పరుగులు చేసి భారత్ కి ఆశలు రేకెత్తించాడు. అయితే అల్ రౌండర్ క్రిస్ కైర్న్స్ విజృంభించి 113 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 102 పరుగులు చేసి అజేయంగా నిలిచి కివీస్ కి విజయాన్ని చేకూర్చాడు.
రోహిత్ కి కలిసిరాని టాస్
భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ కి మాత్రం ప్రస్తుతం టాస్ కలిసి రావట్లేదు. రోహిత్ వరుసగా గత 14 వన్డే మ్యాచ్ లలో టాస్ గెలవలేక పోయాడు. 2023 నవంబర్ 19న అహ్మదాబాద్‌లో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్‌తో ప్రారంభమైన ఈ టాస్ పరాజయాల పరంపర ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే భారత్ మాత్రం ఈ 14 మ్యాచ్‌లలో తొమ్మిది విజయాలు సాధించింది, నాలుగింటిలో ఓటమి పాలయింది ఒక మ్యాచ్ (శ్రీలంకతో)తో టై గా ముగిసింది.
ప్రస్తుత దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదిక గా ఆడుతున్న భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లోని ఇంతవరకూ జరిగిన నాలుగు మ్యాచ్ ల లో టాస్ ఓడిపోయింది, అయినప్పటికీ అన్ని మ్యాచ్ లలో విజయం సాధించింది. అందువల్ల టాస్ భారత్ విజయావకాశాల పై ప్రభావం చూపించలేదన్నది వాస్తవం. అయితే ఇక్కడి వాతావరణ పరిస్థితులు రెండవ స్థానంలో బ్యాటింగ్ చేసే జట్టుకు అనుకూలంగా ఉండే అవకాశం ఉందని తొలుత భావించారు.
కానీ అలాంటిదేమీ ఈసారి కనిపించలేదు. భారత్ మొదట బ్యాటింగ్ చేసినప్పుడు ఒకసారి ఛేజింగ్ చేస్తూ మూడు మ్యాచ్‌లు గెలిచింది. ఇక్కడి వాతావరణం లో మంచు ఎక్కువగా లేకపోవడం ఇందుకు కారణంగా చెబుతున్నారు. రాత్రులు వాతావరణం చల్లగా ఉండటంతో, టోర్నమెంట్‌లో మంచు పెద్ద పాత్ర పోషిస్తుందని భావించారు. అదృష్టవశాత్తూ అది జరగలేదు.
వరుణ్ చక్రవర్తి కీలకం
"ఈ సమయంలో ఈ మైదానంలో కొంచెం ఎక్కువ మంచు ఉంటుందని నేను అనుకున్నాను. అదృష్టవశాత్తూ అలా జరగలేదు. కాబట్టి టాస్ నిజానికి పెద్ద అంశం కాదని నేను భావిస్తున్నాను" అని న్యూజిలాండ్ మాజీ కోచ్ మైక్ హెస్సన్ అన్నాడు. "ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు వెళుతున్నప్పుడు ఎవరు టాస్ గెలుస్తారనే దాని గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక భారత్ అభిమానులైతే రోహిత్ శర్మ వరుసగా 14 మ్యాచ్‌ల లో టాస్ ఓడిపోయాడని నిద్ర మానుకోవాల్సి పని లేదు." అని హెస్సన్ వ్యాఖ్యానించాడు.
ఫైనల్ ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా?
సరిగ్గా పాతికేళ్ల క్రితం క్రితం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పరాజయం చవిచూసిన భారత్ ఇప్పుడు న్యూజిలాండ్ పై ప్రతీకారం తీర్చుకుంటుందా? 25 సంవత్సరాల క్రితం జరిగిన ఈ ఘోర పరాజయాన్నిభారత్ అభిమానులు ఇప్పటికీ మర్చిపోలేదు. ఇన్నేళ్లకు ఈ పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవడానికి రోహిత్ శర్మ బృందానికి అవకాశం కలిగింది. భారత్ జట్టు ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉంది మరియు టోర్నమెంట్‌లోని అన్ని మ్యాచ్‌లలో విజయం సాధించింది. రోహిత్ బృందం ఈ విజయ్ బాటను కొనసాగించాలన్న దృఢ సంకల్పంతో ఉంది. మరి ఈ ఫైనల్లో ఏమి జరుగుతుందో చూద్దాం.!
చదవండి: భారత తుదిజట్టులో ఓ మార్పు.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వారికే: రవిశాస్త్రి