న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో గాయం కావడంతో సిరీస్ మొత్తానికే(మిగిలిన రెండు వన్డేలు) దూరమైన శ్రేయస్ అయ్యర్.. ఐపీఎల్‌లో సైతం ఆడేది అనుమానంగా మారింది. ఐపీఎల్‌లో గతేడాది రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న అయ్యర్.. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడడంతో మైదానాన్ని వీడాడు. వైద్య పరీక్షల కోసం అతనిని ఆస్పత్రికి తరలించగా, ఎడమ భుజానికి సర్జరీ చేయాల్సి ఉంటుందని డాక్టర్లు షాకింగ్ న్యూస్ చెప్పారు. ఇదే జరిగితే రాబోయే ఐపీఎల్ సీజన్ మొత్తానికి శ్రేయస్ దూరమయ్యే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం శ్రేయస్‌కు ప్రత్యామ్నాయాన్ని వెతకడంలో నిమగ్నమైంది.
కెప్టెన్సీ రేసులో ఐదుగురు ఆటగాళ్లు(పంత్, అశ్విన్, రహానే, స్టీవ్ స్మిత్, ధవన్) ఉన్నప్పటికీ.. ప్రస్తుత వైస్ కెప్టెన్ రిషబ్ పంత్‌కు తాత్కాలిక సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్టు ఫ్రాంచైజీ ప్రతినిధి ఒకరు అభిప్రాయపడ్డారు. లేనిపక్షంలో అనుభవజ్ఞులైన రవిచంద్రన్ అశ్విన్ లేదా అజింక్య రహానేల వైపు మొగ్గుచూపే అవకాశాలున్నట్టు ఆయన పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, గత సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్‌ను ఇటీవల వేలంలో ఢిల్లీ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ కెప్టెన్సీ రేసులో స్మిత్‌కు కూడా అవకాశాలు లేకపోలేదంటున్నారు విశ్లేషకులు. గత సీజన్‌లో పరుగుల వరద పారించిన ఆ జట్టు ఓపెనర్ శిఖర్ ధవన్‌కు కూడా జట్టును నడిపించే సత్తా ఉంది. కాగా, ఢిల్లీ క్యాపిటల్స్‌కు రికీ పాంటింగ్ ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఢిల్లీ తమ తొలి ఐపీఎల్ మ్యాచ్‌ను ఏప్రిల్ 10న ఆడనుంది. ముంబై వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో ఢిల్లీ.. చెన్నైతో తలపడనుంది.
చదవండి: నాన్నకు ప్రేమతో.. కృనాల్, హార్ధిక్ ఏం చేశారో తెలుసా..?
చదవండి: ముగ్గురు కెప్టెన్లకు గాయాలు.. ఆందోళనలో ఐపీఎల్ ఫ్రాంచైజీలు
Comments
Please login to add a commentAdd a comment