‘అతడిని ఎనిమిదో స్థానంలో ఆడిస్తారా?.. ఇలాంటి వింత చూడలేదు’ | Will You Play Him At No 8: Aakash Chopra questions RR Batting Order Vs KKR | Sakshi
Sakshi News home page

‘అతడిని ఎనిమిదో స్థానంలో ఆడిస్తారా? ప్రపంచంలో ఎక్కడా ఇలా జరగదు’

Published Thu, Mar 27 2025 12:41 PM | Last Updated on Thu, Mar 27 2025 2:03 PM

Will You Play Him At No 8: Aakash Chopra questions RR Batting Order Vs KKR

రాయల్స్‌ కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ (Photo Courtesy: BCCI)

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL)-2025లో రాజస్తాన్‌ రాయల్స్‌ పరాజయాలు కొనసాగుతున్నాయి. తమ ఆరంభ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ చేతిలో చిత్తుగా ఓడిన పింక్‌ జట్టు.. రెండో మ్యాచ్‌లోనూ ఓటమిని చవిచూసింది. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో ఎనిమిది వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.

ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా.. రాజస్తాన్‌ రాయల్స్‌ మేనేజ్‌మెంట్‌ తీరును విమర్శించాడు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో చేసిన మార్పుల వల్లే రాయల్స్‌కు భంగపాటు ఎదురైందని అభిప్రాయపడ్డాడు. టీ20 ఫార్మాట్లో ప్యూర్‌ బ్యాటర్‌ను ఎనిమిదో స్థానంలో పంపే ఏకైక జట్టు రాయల్స్‌ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.

బ్యాటింగ్ ఆర్డరే ఓ డిజార్డర్‌
ఈ మేరకు.. ‘‘కోల్‌కతాతో మ్యాచ్‌లో రాజస్తాన్‌ బ్యాటింగ్ ఆర్డరే ఓ డిజార్డర్‌. మీరు తొలుత బ్యాటింగ్‌ చేయాల్సి ఉంది. కానీ గత మ్యాచ్‌లో 11 లేదా 12 బంతుల్లోనే 35 పరుగులు సాధించిన బ్యాటర్‌ శుభమ్‌ దూబేకు.. మీరు తుదిజట్టులో స్థానం ఇవ్వలేదు.

ఆల్‌రౌండర్‌ వనిందు హసరంగను ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు పంపించారు. అతడు పట్టుమని పది పరుగులు చేయకుండా అవుటయ్యాడు. ఆ తర్వాతైనా మీరు సరైన నిర్ణయం తీసుకున్నారా అంటే అదీ లేదు. శుభమ్‌ను ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా బరిలోకి దించారు.

పవర్‌ హిట్టర్‌ షిమ్రన్‌ హెట్‌మెయిర్‌ను కాదని శుభమ్‌ను ఏడో స్థానంలో పంపించారు. అతడు విఫలమయ్యాడు. మరోవైపు.. ఎనిమిదో స్థానంలో వచ్చిన హెట్‌మెయిర్‌ కూడా చేతులెత్తేశాడు.

ఇలాంటి వింత చూడలేదు
స్పెషలిస్టు బ్యాటర్‌.. అదీ టీ20 క్రికెట్‌లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌ చేయడం ప్రపంచంలో ఎక్కడైనా చూశారా? నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. రాయల్స్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌పై ఏమని స్పందించాలో కూడా తెలియడం లేదు. వాళ్ల వింత నిర్ణయాలు ఎవరికీ అంతుపట్టడం లేదు’’ అని ఆకాశ్‌ చోప్రా రాజస్తాన్‌ నాయకత్వ బృందంపై ఘాటు విమర్శలు చేశాడు.

కాగా రాయల్స్‌ రెగ్యులర్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ గాయం వల్ల గత కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఐపీఎల్‌-2025తో రీఎంట్రీ ఇచ్చినప్పటికీ.. ఆరంభ మ్యాచ్‌లలో సారథ్య బాధ్యతలకు అతడు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో అతడి స్థానంలో యువ ఆల్‌రౌండర్‌ రియాన్‌ పరాగ్‌ రాయల్స్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

బ్యాటర్ల వైఫల్యం
పరాగ్‌ నాయకత్వంలో తొలుత రైజర్స్‌చేతిలో ఓడిన రాయల్స్‌.. రెండో మ్యాచ్‌లో కేకేఆర్‌తో తలపడింది. గువాహతి వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడిన రాయల్స్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ (29), సంజూ శాంసన్‌ (13) నిరాశపరచగా.. పరాగ్‌ (15 బంతుల్లో 25) కాసేపు అలరించాడు.

ఇక, నితీశ్‌ రాణా(8) పూర్తిగా విఫలం కాగా... రాయల్స్‌ తరఫున అరంగేట్రం చేసిన హసరంగ ఐదో స్థానంలో వచ్చి 4 పరుగులకే నిష్క్రమించాడు. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ధ్రువ్‌ జురెల్‌(28 బంతుల్లో 33) నిలదొక్కుకునే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు.

అయితే, గత మ్యాచ్‌లో అదరగొట్టిన శుభమ్‌ దూబేకు ప్లేయింగ్‌ ఎలెవన్‌లో చోటివ్వని రాయల్స్‌.. ఇంపాక్ట్‌ప్లేయర్‌గా ఏడో స్థానంలో ఆడించింది. అతడు 12 బంతులు ఎదుర్కొని కేవలం 9 పరుగులే చేసి అవుటయ్యాడు. 

మరోవైపు.. హెట్‌మెయిర్‌ 8 బంతుల్లో 7 రన్స్‌ చేయగా.. ఆఖర్లో టెయిలెండర్‌ జోఫ్రా ఆర్చర్‌ (7 బంతుల్లో 16) కాస్త వేగంగా ఆడాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో రాజస్తాన్‌ తొమ్మిది వికెట్ల నష్టానికి 151 పరుగులు చేయగలిగింది.

డికాక్‌ వన్‌మ్యాన్‌ షో
ఇక లక్ష్య ఛేదనలో కేకేఆర్‌ అదరగొట్టింది. ఆరంభంలోనే ఓపెనర్‌ మొయిన్‌ అలీ(5) వికెట్‌ కోల్పోయినా.. మరో ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ దుమ్ములేపాడు. 61 బంతుల్లో 97 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. 

మిగతా వాళ్లలో కెప్టెన్‌ అజింక్య రహానే 18, అంగ్‌క్రిష్‌ రఘువన్షీ 22 (నాటౌట్‌) పరుగులు సాధించారు. ఈ క్రమంలో 17.3 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసిన కేకేఆర్‌.. ఈ సీజన్‌లో తొలి విజయం నమోదు చేసింది. అంతకు ముందు కోల్‌కతా.. ఆర్సీబీ చేతిలో ఓటమిపాలైంది. 

చదవండి: శ్రేయస్‌ కాదు!.. అతడే ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: అశ్విన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement