Hyderabad Cricket Association: హైదరాబాద్ మహిళా క్రికెటర్లకు చేదు అనుభవం ఎదురైంది. కోచ్ జై సింహా అసభ్య ప్రవర్తన కారణంగా వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తమ పట్ల అనుచితంగా ప్రవర్తించిన జై సింహా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు మహిళా క్రికెటర్లు ఫిర్యాదు చేశారు. కాగా మ్యాచ్ ఆడే నిమిత్తం ఉమెన్ టీమ్ హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లింది.
తిరుగు ప్రయాణంలో విమానంలో రావాల్సి ఉండగా.. కోచ్ జై సింహా ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేశాడు. ఫ్లైట్ మిస్ అవడంతో టీమ్‌తో సహా బస్‌లో హైదరాబాద్‌కు బయల్దేరాడు. ఈ క్రమంలో బస్‌లో మహిళా క్రికెటర్ల ముందే జై సింహా మద్యం సేవించగా.. వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కోపోద్రిక్తుడైన జై సింహా మహిళా క్రికెటర్లను బూతులు తిట్టాడు.
ఆ సమయంలో సెలక్షన్ కమిటీ మెంబర్ పూర్ణిమరావు జై సింహాకు అడ్డు చెప్పలేదు. పైగా అతడిని ఎంకరేజ్ చేశారు. ఈ మేరకు ఆరోపణలు చేస్తూ.. జై సింహా, పూర్ణిమరావుపై చర్యలు తీసుకోవాలని మహిళా క్రికెటర్లు నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)కి ఫిర్యాదు చేశారు.
వేటు పడింది
ఈ నేపథ్యంలో.. తమను జట్టు నుంచి తప్పిస్తామని కోచ్ బెదిరింపులకు గురిచేస్తున్నాడంటు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వార్తలు మీడియాలో ప్రచారం కావడంతో హెచ్‌సీఏ చర్యలకు పూనుకుంది. మహిళల హెడ్‌కోచ్‌గా జై సింహాను తప్పిస్తూ వేటు వేసింది. ఈ విషయంపై హెచ్‌సీఏ అధ్యక్షుడు స్పందిస్తూ.. ‘‘కోచ్ జై సింహ మీద వచ్చిన ఆరోపణలపై విచారణ చేస్తున్నాము. విచారణ ముగిసే వరకు అతడిని సస్పెండ్ చేస్తున్నాం’’ అని తెలిపారు,
Comments
Please login to add a commentAdd a comment