మహిళల క్రికెట్‌లో ఆస్ట్రేలియా జైత్రయాత్ర కొనసాగుతుంది. ఆసీస్ మహిళా టీమ్ ఇంటాబయటా అన్న తేడా లేకుండా, ఫార్మాట్లకతీతంగా వరుస విజయాలతో దూసుకుపోతుంది. తాజాగా ఆసీస్ ఖాతాలో మరో రెండు సిరీస్‌లు చేరాయి. ఆసీస్.. బంగ్లాదేశ్‌ను వారి సొంత దేశంలో మట్టికరిపించి వన్డే, టీ20 సిరీస్‌లను క్లీన్ స్వీప్ చేసింది.
3 వన్డేలు, 3 టీ20ల సిరీస్‌ల కోసం బంగ్లాదేశ్‌లో పర్యటించిన ఆస్ట్రేలియా.. తొలుత వన్డే సిరీస్‌ను, తాజాగా టీ20 సిరీస్‌ను 3-0 తేడాతో ఊడ్చేసింది. టీ20 సిరీస్‌లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 4) జరిగిన మూడో మ్యాచ్‌లో ఆసీస్ 77 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది.
ఇదివరకే సిరీస్ కైవసం చేసుకోవడంతో నామమాత్రంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఆల్‌రౌండ్ షో చేసి గ్రాండ్ విక్టరీని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. హీలీ (45), మెక్‌గ్రాత్ (44 నాటౌట్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో నహీద అక్తర్ 3 వికెట్లతో సత్తా చాటింది.
ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. తైలా వ్లేమ్నిక్ (3/12), జార్జియా వేర్హమ్ (2/1), సోఫీ మోలినెక్స్ (1/15) ధాటికి 18.1 ఓవర్లలో78 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. బంగ్లా ఇన్నింగ్స్‌లో నిగార్ సుల్తాన్ (32) టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆసీస్ భారీ విజయాలు సాధించింది. దీనికి ముందు జరిగిన వన్డే సిరీస్‌ను సైతం ఆస్ట్రేలియా 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment