
మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఢాకా వేదికగా బంగ్లాదేశ్ మహిళా జట్టుతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మహిళల టీమ్ 118 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన బంగ్లాదేశ్ 36 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలింది. అలానా కింగ్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టి ఆసీస్ గెలుపులో ప్రధానపాత్ర పోషించింది.
రాణించిన సదర్‌ల్యాండ్.. విరుచుకుపడిన అలానా
146 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి 200 పరుగుల మార్కును కూడా దాటలేదనుకున్న ఆస్ట్రేలియాను సదర్‌ల్యాండ్ (76 బంతుల్లో 58 నాటౌట్; 5 ఫోర్లు), అలానా కింగ్ (31 బంతుల్లో 46 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆదుకున్నారు. ఆఖర్లో అలానా కింగ్ బంగ్లా బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడింది.
ఫలితంగా ఆసీస్ 200 పరుగుల మార్కును దాటింది. సదర్‌ల్యాండ్, అలానాతో పాటు ఆసీస్ ఇన్నింగ్స్‌లో హీలీ (24), మూనీ (25), గార్డ్‌నర్ (32), వేర్హమ్ (12) రెండంకెల స్కోర్లు చేశారు. బంగ్లా బౌలర్లలో సుల్తానా ఖాతూన్, నహిద అక్తెర్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. మరుఫా అక్తెర్, ఫహీమా ఖాతూన్, షోర్ణా అక్తెర్ తలో వికెట్ పడగొట్టారు.
గార్డ్‌నర్, కింగ్ మాయాజాలం.. కుప్పకూలిన బంగ్లాదేశ్
214 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. గార్డ్‌నర్ (5-1-22-3), కిమ్ గార్త్ (7-1-26-2), అలానా కింగ్ (10-3-12-1), మెగాన్ షట్ (6-1-5-1) ధాటికి 95 పరుగులకే చాపచుట్టేసింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో సోభన (17), ముర్షిదా ఖాతూన్ (10), నిగర్ సుల్తాన్ (27) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే మార్చి 24న జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment