Asia Cup 2024: బంగ్లా బౌలర్ల విజృంభణ.. తొలి విజయం నమోదు | Womens Asia Cup 2024 BAN Vs THA: Bangladesh Beat Thailand By 7 Wickets, Check Score Details Inside | Sakshi
Sakshi News home page

Asia Cup 2024 BAN Vs THA: బంగ్లా బౌలర్ల విజృంభణ.. తొలి విజయం నమోదు

Jul 23 2024 7:00 AM | Updated on Jul 23 2024 10:51 AM

Womens Asia Cup 2024: Bangladesh Beat Thailand By 7 Wickets

మహిళల ఆసియా కప్‌ 2024లో బంగ్లాదేశ్‌ తొలి విజయం నమోదు చేసింది. థాయ్‌లాండ్‌తో నిన్న (జులై 22) జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వరుసగా 10 మ్యాచ్‌ల్లో ఓటమి అనంతరం బంగ్లాదేశ్‌కు లభించిన తొలి విజయం ఇది. ఈ గెలుపుతో బంగ్లాదేశ్‌ సెమీస్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.

బంగ్లా బౌలర్ల విజృంభణ
టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన థాయ్‌లాండ్‌.. బంగ్లా బౌలర్లు విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. రబేయా ఖాన్‌ పొదుపుగా బౌలింగ్‌ చేయడంతో పాటు నాలుగు వికెట్లు పడగొట్టగా.. రీతూ మోనీ, సబికున్‌ నహార్‌ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. థాయ్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ బూచాథమ్‌ (40), లవోమీ (17), రోస్నన్‌ కనో (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు.

స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌.. 17.3 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి అలవోకగా విజయం సాధించింది. ఓపెనర్‌ ముర్షిదా ఖాతూన్‌ (50) అర్ద సెంచరీతో రాణించగా.. దిలార అక్తెర్‌ 17, ఇష్మా తంజిమ్‌ 16 పరుగులు చేశారు. థాయ్‌ బౌలర్లలో పుత్తావాంగ్‌, ఫన్నిట మాయా తలో వికెట్‌ దక్కించుకున్నారు. బంగ్లా తమ తదుపరి మ్యాచ్‌లో మలేషియాతో తలపడనుంది. 

ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌.. శ్రీలంక చేతుల్లో ఓడింది. ప్రస్తుతం గ్రూప్‌-బి పాయింట్ల పట్టికలో శ్రీలంక, థాయ్‌లాండ్‌, బంగ్లాదేశ్‌, మలేషియా వరుస స్థానాల్లో ఉన్నాయి. గ్రూప్‌-ఏ విషయానికొస్తే.. భారత్‌ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి గ్రూప్‌ టాపర్‌గా కొనసాగుతుండగా.. పాకిస్తాన్‌, నేపాల్‌, యూఏఈ ఆతర్వాతి స్థానాల్లో ఉన్నాయి. టీమిండియా ఇవాళ (జులై 23) రాత్రి జరుగబోయే మ్యాచ్‌లో నేపాల్‌తో తలపడనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement