హ్యాట్రిక్‌తో చెలరేగిన బంగ్లాదేశ్‌ బౌలర్‌.. కెరీర్‌లో రెండోది | Womens Cricket: Bangladesh Bowler Fariha Trisna Picks Up Hat Trick Against Australia In 2nd T20I | Sakshi
Sakshi News home page

హ్యాట్రిక్‌తో చెలరేగిన బంగ్లాదేశ్‌ బౌలర్‌.. కెరీర్‌లో రెండోది

Published Tue, Apr 2 2024 2:03 PM | Last Updated on Tue, Apr 2 2024 3:06 PM

Womens Cricket: Bangladesh Bowler Fariha Trisna Picks Up Hat Trick Against Australia In 2nd T20I - Sakshi

మహిళల క్రికెట్‌లో ఇవాళ (ఏప్రిల్‌ 2) బంగ్లాదేశ్‌, ఆస్ట్రేలియా జట్లు టీ20 మ్యాచ్‌ ఆడుతున్నాయి. పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా.. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇవాళ రెండో టీ20 ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో బంగ్లా బౌలర్‌ ఫరిహా త్రిస్న హ్యాట్రిక్‌తో చెలరేగింది. త్రిస్నకు టీ20ల్లో ఇది రెండో హ్యాట్రిక్‌. 2022లో త్రిస్న తన టీ20లో అరంగేట్రంలోనే హ్యాట్రిక్‌ వికెట్లు పడగొట్టింది.

త్రిస్న దెబ్బకు నేటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 161 పరుగులకే పరిమితమైంది. ఆసీస్‌ ఇన్నింగ్స్‌ ఆఖరి మూడు బంతులకు త్రిస్న.. ఎల్లిస్‌ పెర్రీ, మోలినెక్స్‌, బెత్‌ మూనీలను ఔట్‌ చేసింది. తన కోటా నాలుగు ఓవర్లు వేసిన త్రిస్న.. 19 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టింది. ఇందులో ఓ మెయిడిన్‌ ఓవర్‌ కూడా ఉంది.

బంగ్లా బౌలర్లలో త్రిస్నతో పాటు నహీద అక్తర్‌ (4-0-21-2), ఫహీమా ఖాతూన్‌ (4-0-34-2) కూడా వికెట్లు పడగొట్టారు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో వేర్హమ్‌ (57), గ్రేస్‌ హ్యరీస్‌ (47) మాత్రమే రాణించారు. ఆఖర్లో పెర్రీ (29) వేగంగా పరుగులు చేసే ప్రయత్నం చేయగా.. తహిల మెక్‌గ్రాత్‌ (19) రెండంకెల స్కోర్‌ చేయగలిగింది. మిగతా ప్లేయర్స్‌ అంతా సింగిల్‌ డిజిట్‌ స్కోర్‌కే పరిమతమయ్యారు.

162 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌.. 9.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది. మెగాన్‌ షట్‌, ఆష్లే గార్డ్‌నర్‌, మోలినెక్స్‌ తలో వికెట్‌ పడగొట్టి బంగ్లాదేశ్‌ను కష్టాల్లోకి నెట్టారు. ముర్షిదా ఖాతూన్‌ (8), శోభన మోస్తరీ (5), నిగార్‌ సుల్తాన్‌ (1) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే ఔటయ్యారు. దిలారా అక్తర్‌ (27), ఫహీమా ఖాతూన్‌ (3) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ గెలవాలంటే 65 బంతుల్లో 115 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో మరో 7 వికెట్లు ఉన్నాయి. ఈ సిరీస్‌లో ఆసీస్‌ తొలి మ్యాచ్‌లో గెలిచి ఆధిక్యంలో కొనసాగుతుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement