కివీస్‌పై 53 పరుగులతో భారత మహిళల ఘనవిజయం
సెమీస్‌లో చోటు ఖాయం చేసుకున్న హర్మన్‌ప్రీత్ బృందం
సెంచరీలతో చెలరేగిన స్మృతి మంధాన, ప్రతీక రావల్
ఆదివారం బంగ్లాదేశ్‌తో చివరి లీగ్ మ్యాచ్
వరల్డ్ కప్‌లో వరుసగా మూడు పరాజయాలతో వెనుకబడి విమర్శలు ఎదుర్కొన్న భారత మహిళల జట్టు అసలు పోరులో చెలరేగింది. తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో సత్తా చాటి దర్జాగా సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. స్మృతి మంధాన, ప్రతీక రావల్ సెంచరీలతో పాటు జెమీమా మెరుపులు తోడవడంతో భారీ స్కోరుతో న్యూజిలాండ్ మహిళలకు సవాల్ విసిరిన టీమిండియా...ఆపై పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని కుప్పకూల్చి ఘన విజయాన్ని అందుకుంది. తాజా ఓటమితో మాజీ చాంపియన్ కివీస్ సెమీస్ అవకాశం కోల్పోయింది.
ముంబై: స్వదేశంలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్‌లో భారత మహిళల జట్టు సెమీఫైనల్‌కు చేరింది. ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ తర్వాత సెమీస్ చేరిన చివరి జట్టుగా హర్మన్ సేన నిలిచింది. గురువారం డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 53 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. భారత బ్యాటింగ్ చివర్లో వాన కారణంగా ఇన్నింగ్స్‌ను 49 ఓవర్లకు కుదించగా, టీమిండియా 3 వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసింది.
ఓపెనర్లు ప్రతీక రావల్ (134 బంతుల్లో 122; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ స్మృతి మంధాన (95 బంతుల్లో 109; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) శతకాలతో చెలరేగారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 33.2 ఓవర్లలో 212 పరుగులు జోడించడం విశేషం. జెమీమా రోడ్రిగ్స్ (55 బంతుల్లో 76 నాటౌట్; 11 ఫోర్లు) కూడా మెరుపు బ్యాటింగ్‌తో జట్టు భారీ స్కోరులో కీలక పాత్ర పోషించింది. అనంతరం వర్షం మళ్లీ అంతరాయం కలిగించడంతో న్యూజిలాండ్ లక్ష్యాన్ని డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 44 ఓవర్లలో 325 పరుగులుగా నిర్ణయించారు.
కివీస్ 44 ఓవర్లలో 8 వికెట్లకు 271 పరుగులు చేసింది. బ్రూక్ హ్యాలిడే (84 బంతుల్లో 81; 9 ఫోర్లు, 1 సిక్స్), ఇసబెల్లా గేజ్ (51 బంతుల్లో 65 నాటౌట్; 10 ఫోర్లు) రాణించారు. ఆదివారం జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో భారత్ తలపడుతుంది. నేడు కొలంబోలో జరిగే నామమాత్రమైన మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో శ్రీలంక తలపడుతుంది.
రికార్డు భాగస్వామ్యం...
ప్రతీక, స్మృతి జాగ్రత్తగా ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టడంతో తొలి 2 ఓవర్లు మెయిడిన్‌గా ముగియగా, 10 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 40/0కు చేరింది. ఆ తర్వాత బ్యాటర్లు నిలదొక్కుకొని పరుగులు రాబట్టడంతో తర్వాతి 46 బంతుల్లో 60 పరుగులు రాబట్టిన భారత్ 100 పరుగుల మార్క్‌ను అందుకుంది. ఇదే క్రమంలో ముందుగా స్మృతి 49 బంతుల్లో, ప్రతీక 75 బంతుల్లో హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు.
సగం ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్ 147/0 వద్ద నిలిచింది. 77 పరుగుల వద్ద స్మృతికి అదృష్టం కలిసొచ్చింది. అమేలియా బౌలింగ్‌లో షాట్‌కు ప్రయత్నించగా బంతి ప్యాడ్‌కు తగలడంతో బౌలర్ అప్పీల్ చేసింది. వెంటనే అంపైర్ అవుట్‌గా ప్రకటించడంతో స్మృతి రివ్యూ కోరింది. రీప్లేలో ముందుగా బంతి గమనాన్ని చూపించారు. అందులో బంతి స్టంప్స్‌ను తాకుతున్నట్లు అర్థం కావడంతో స్మృతి పెవిలియన్ వైపు సాగిపోయింది.
అయితే ఆ తర్వాత అల్ట్రా ఎడ్జ్‌లో బంతి బ్యాట్‌కు తగిలినట్లు రేఖ కనిపించడంతో ఆమె వెనక్కి వచ్చింది. కొద్ది సేపటికి 88 బంతుల్లో స్మృతి శతకం పూర్తి చేసుకుంది. ఎట్టకేలకు 34వ ఓవర్లో తొలి వికెట్ (స్మృతి) తీయడంలో కివీస్ సఫలమైంది. 122 బంతుల్లో ప్రతీక సెంచరీ పూర్తి కాగా, మూడో స్థానంలో వచ్చిన జెమీమా ఆరంభంనుంచే దూకుడును ప్రదర్శించింది. కార్స్ ఓవర్లో మూడు ఫోర్లు బాది 38 బంతుల్లోనే హాఫ్‌సెంచరీ చేసింది.
బ్యాటింగ్ వైఫల్యం...
భారీ లక్ష్య ఛేదనలో కివీస్ ఆరంభం నుంచే తడబడింది. ఓపెనర్ సుజీ బేట్స్ (1) తన వైఫల్యం కొనసాగించగా...ప్లిమ్మర్ (30; 5 ఫోర్లు, 1 సిక్స్), అమేలియా కెర్ (45; 4 ఫోర్లు) కొద్దిగా ప్రతిఘటించారు. టోర్నీలో జట్టు బెస్ట్ బ్యాటర్, కెప్టెన్ సోఫీ డివైన్ (6)ను రేణుక చక్కటి బంతితో బౌల్డ్ చేయడంతోనే భారత్‌కు పట్టు చిక్కింది.
59 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకొని ఒకవైపు నుంచి హ్యాలిడే పోరాడుతున్నా...మరో వైపు వరుసగా వికెట్లు తీసి భారత్ ఒత్తిడి పెంచింది. చివర్లో ఇసబెల్లా కూడా ప్రయత్నించినా, చేయాల్సిన రన్‌రేట్ పెరిగిపోవడంతో కివీస్ ఓటమి దిశగా పయనించింది.
340 వన్డే వరల్డ్‌కప్‌లో భారత్ అత్యధిక స్కోరు. ఇదే టోర్నీలో ఆసీస్‌పై సాధించిన 330 పరుగుల స్కోరును జట్టు అధిగమించింది.
212 స్మృతి, ప్రతీక జోడించిన పరుగులు. వరల్డ్ కప్‌లో ఏ వికెట్‌కైనా భారత్‌కు ఇదే అత్యధిక భాగస్వామ్యం.
14 స్మృతి వన్డే కెరీర్‌లో ఇది 14వ సెంచరీ. అత్యధిక సెంచరీల జాబితాలో మెగ్ లానింగ్ (15) తర్వాత రెండో స్థానంలో నిలిచింది.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: ప్రతీక (సి) (సబ్) రోవ్ (బి) అమేలియా 122; స్మృతి (సి) (సబ్) రోవ్ (బి) బేట్స్ 109; జెమీమా (నాటౌట్) 76; హర్మన్‌ప్రీత్ (సి) కార్సన్ (బి) రోజ్‌మేరీ 10; రిచా (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (49 ఓవర్లలో 3 వికెట్లకు) 340. వికెట్ల పతనం: 1–212, 2–288, 3–336. బౌలింగ్: రోజ్‌మేరీ 8–1–52–1, జెస్ కెర్ 8–1–51–0, డివైన్ 6–0–34–0, కార్సన్ 6–0–46–0, తహుహు 4–0–37–0, అమేలియా కెర్ 10–0–69–1, బేట్స్ 7–0–40–1.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: బేట్స్ (సి) ప్రతీక (బి) క్రాంతి 1; ప్లిమ్మర్ (బి) రేణుక 30; అమేలియా కెర్ (సి) స్మృతి (బి) స్నేహ్ 45; డివైన్ (బి) రేణుక 6; హ్యాలిడే (సి) స్నేహ్ (బి) చరణి 81; గ్రీన్ (సి) క్రాంతి (బి) ప్రతీక 18; ఇసబెల్లా (నాటౌట్) 65; జెస్ కెర్ (సి) స్మృతి (బి) క్రాంతి 18; రోజ్‌మేరీ (సి) స్మృతి (బి) దీప్తి 1; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (44 ఓవర్లలో 8 వికెట్లకు) 271. వికెట్ల పతనం: 1–1, 2–51, 3–59, 4–115, 5–154, 6–226, 7–266, 8–271. బౌలింగ్: రేణుక 6–0–25–2, క్రాంతి గౌడ్ 9–0–48–2, స్నేహ్ రాణా 8–0–60–1, శ్రీచరణి 9–0–58–1, దీప్తి శర్మ 8–0–57–1, ప్రతీక 4–0–19–1.


