‘నాకు కాదు!.. తనకే ఇవ్వాల్సింది.. సెమీస్‌ చేరడం బిగ్‌ రిలీఫ్‌’ | She deserved it as much as me: Mandhana surprised with POTM award vs NZ | Sakshi
Sakshi News home page

‘నాకు కాదు!.. తనకే ఇవ్వాల్సింది.. సెమీస్‌ చేరడం బిగ్‌ రిలీఫ్‌’

Oct 24 2025 12:24 PM | Updated on Oct 24 2025 1:00 PM

She deserved it as much as me: Mandhana surprised with POTM award vs NZ

ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌-2025 (ICC ODI WC 2025) టోర్నమెంట్లో భారత్‌ సెమీ ఫైనల్‌ చేరింది. న్యూజిలాండ్‌తో గురువారం నాటి మ్యాచ్‌లో 53 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీస్‌ బెర్తు ఖరారు చేసుకుంది. హ్యాట్రిక్‌ పరాజయాల తర్వాత ఈ మేరకు అద్భుత గెలుపుతో టైటిల్‌ దిశగా ప్రయాణం మొదలుపెట్టింది.

శతకాలతో చెలరేగిన ఓపెనర్లు
కాగా కివీస్‌ జట్టు (IND W vs NZ W)పై భారత్‌ విజయంలో భారత ఓపెనర్లు ప్రతికా రావల్‌ (134 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లు- 122), స్మృతి మంధాన (95 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లు- 109)లది కీలక పాత్ర. ఇద్దరూ శతకాలతో చెలరేగి జట్టుకు భారీ స్కోరు అందించారు. వీరికి తోడుగా వన్‌డౌన్‌ బ్యాటర్‌ జెమీమా రోడ్రిగ్స్‌ (55 బంతుల్లో 76 నాటౌట్‌) కూడా అద్భుత రీతిలో రాణించింది.

ఇక ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించిన కారణంగా.. ఇన్నింగ్స్‌ను 49 ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో భారత్‌ మూడు వికెట్ల నష్టానికి 340 పరుగులు స్కోరు చేయగా.. డక్‌వర్త్‌ లూయీస్‌ పద్ధతి ప్రకారం కివీస్‌ లక్ష్యాన్ని 44 ఓవర్లలో 325 పరుగులుగా నిర్దేశించారు.

271 పరుగులే చేసి.. కివీస్‌ అవుట్‌
అయితే, భారత బౌలర్ల ధాటికి తాళలేక నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయిన న్యూజిలాండ్‌ 271 పరుగుల వద్దే నిలిచిపోయింది. ఫలితంగా నవీ ముంబైలో హర్మన్‌సేన జయభేరి మోగించి సెమీస్‌లో అడుగుపెట్టింది.

సెమీస్‌ చేరడం బిగ్‌ రిలీఫ్‌
ఇక ఈ మ్యాచ్‌లో భారత మహిళా జట్టు వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధాన (Smriti Mandhana)ను ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు వరించింది. ఈ నేపథ్యంలో విజయానంతరం స్మృతి స్పందిస్తూ.. ‘‘నాకౌట్స్‌కు అర్హత సాధించడం ఉపశమనం కలిగించింది. గత మూడు మ్యాచ్‌లలో మేము ఓడిపోయాం. అది గడ్డు దశ. మంచిగానే ఆడినా.. ఆ మ్యాచ్‌లలో మేము పరాజయం పాలయ్యాము.

నాకు కాదు!.. తనకే ఇవ్వాల్సింది
అయితే, ఈరోజు మాత్రం అనుకూలా ఫలితాన్ని రాబట్టగలిగాము. అయితే, ఈ అవార్డు నాకు ఇచ్చే కంటే ప్రతికాకు ఇస్తే బాగుండేది. నాతో పాటు ప్రతికా ఇందుకు అర్హురాలు. నిజంగా నేనైతే ఈ విషయంలో ఆశ్చర్యపోయాను. ఆమెకే అవార్డు ఇస్తారనుకున్నా’’ అని తెలిపింది.

కాగా స్మృతి- ప్రతికా జోడీ ఈ ఏడాదిలో ఇప్పటికే 1557 పరుగులు సాధించింది. భారత పురుషుల క్రికెట్‌ దిగ్గజాలు సచిన్‌ టెండుల్కర్‌- సునిల్‌ గావస్కర్‌ జంట 1998లో 1635 పరుగులు చేయగా.. వారి రికార్డుకు స్మృతి- ప్రతికా ఇప్పుడు చేరువయ్యారు.

ఇక భారత్‌- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న వన్డే వరల్డ్‌కప్‌ టోర్నీలో నాలుగు సెమీస్‌ బెర్తులు ఖరారయ్యాయి. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, భారత్‌ టాప్‌-4లో అడుగుపెట్టగా.. న్యూజిలాండ్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌ ఎలిమినేట్‌ అయ్యాయి. 

చదవండి: IND vs AUS: భారత్‌తో టీ20 సిరీస్‌.. ఆసీస్‌ జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌! విధ్వంస‌క‌ర వీరుడు వ‌చ్చేశాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement