కేప్‌టౌన్: మహిళల టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో జరిగే సమరంపైనే తాము దృష్టి పెట్టామని, మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) కోసం నిర్వహించే వేలంపై ఆలోచించడం లేదని భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పేర్కొంది. దక్షిణాఫ్రికా గడ్డపై అండర్–19 అమ్మాయిల జట్టు సాధించిన వరల్డ్‌కప్ స్ఫూర్తితో తమ ప్రపంచకప్ వేట సాగుతుందని చెప్పింది. మెగా ఈవెంట్‌లో హర్మన్ సేన 12న జరిగే తమ తొలి మ్యాచ్‌లో పాక్‌లో తలపడుతుంది. మరుసటి రోజే ముంబైలో మహిళా క్రికెటర్ల వేలం కార్యక్రమం జరుగుతుంది.
ఆదివారం జట్టు కెప్టెన్లతో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హర్మన్ మాట్లాడుతూ ‘ప్రపంచకప్పే అన్నింటికంటే ముఖ్యమైంది. దాని తర్వాతే ఏదైనా..! ఐసీసీ మెగా ఈవెంట్‌పైనే మేం దృష్టి సారించాం. మిగతావి ఎప్పుడూ ఉండేవే. ఓ క్రికెటర్‌గా ఏది ప్రధానమో ఏది అప్రధానమో నాకు బాగా తెలుసు. దేనిపై దృష్టి సారించాలో కూడా తెలుసు. గత నెల షఫాలీ వర్మ నేతృత్వంలోని అండర్–19 మహిళల జట్టు సాధించిన వరల్డ్‌కప్‌ను మేమంతా చూశాం.
జూనియర్ టీమ్ స్ఫూర్తితో మేం కూడా ప్రపంచకప్ సాధించాలనే పట్టుదలతో ఉన్నాం’ అని వివరించింది. అలాగే దేశంలో జరిగే మహిళల లీగ్‌లతో జాతీయ జట్లకు చాలా మేలు జరుగుతుందని చెప్పింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ దేశాల్లో జరుగుతున్న లీగ్‌లతో ఆ జట్లు ఏ స్థాయిలో ఉన్నాయో... అలాగే డబ్ల్యూపీఎల్‌తో మన జాతీయ జట్టు, అమ్మాయిలకు ఎంతో ప్రయోజనం ఉంటుందని, నాణ్యమైన విదేశీ క్రికెటర్లతో కలిసి ఆడటం వల్ల నైపుణ్యం పెరుగుతుందని భారత కెప్టెన్ తెలిపింది.
వేలం ఇబ్బందికరమే
న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సారథులు ప్రపంచకప్ సమయంలోనే క్రికెటర్ల వేలం జరగనుండటం ఇబ్బందికరమని అభిప్రాయపడ్డారు. ‘కొందరు క్రికెటర్లు వేలంలో అమ్ముడుపోతారు. మరికొందరేమో మిగిలిపోతారు. ఇంకొందరికి ఎక్కువ ధర, కొందరికి తక్కువ ధర లభిస్తుంది. ఇది క్రికెటర్ల మానసిక స్థితిపై ప్రభావం చూపిస్తుంది’ అని న్యూజిలాండ్ కెప్టెన్ సోఫీ డివైన్ పేర్కొంది. ఆసీస్ కెప్టెన్ మెగ్ లానింగ్ మాట్లాడుతూ ‘నిజంగా ఇది (వేలం) ఇబ్బందికర పరిణామమే. ప్రపంచకప్‌లో ఆడేందుకు వచ్చిన అమ్మాయిలను తప్పకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కొందరు జీర్ణించుకుంటారు. ఇంకొందరు జీర్జించుకోలేరు. ఇది కాస్త ఆటపై ప్రభావం చూపుతుంది’ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment