ఐపీఎల్‌లో బ్యాటర్లు రాజ్యమేలే ఆనవాయితీ ఈ సీజన్‌లోనూ కొనసాగింది. ఫాస్ట్ బౌలర్, స్పిన్నర్ అన్న తేడా లేకుండా దాదాపు ప్రతి బౌలర్‌ను బ్యాటర్లు చితకబాదారు. షమీ, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ లాంటి బౌలర్లు వికెట్లయితే పడగొట్టారు కానీ, పరుగులు ధారాళంగా సమర్పించుకున్నారు. ముంబై పేసర్ ఆకాశ్ మధ్వాల్ లాంటి బౌలర్లు ఒక మ్యాచ్‌లో అత్యుత్తమ గణాంకాలు (5/5) నమోదు చేసి, ఆ మరుసటి మ్యాచ్‌లోనే (4-0-52-1) తేలిపోయారు. ఇలాంటి ఘటనలు 73 మ్యాచ్‌ల్లో చాలా సందర్భాల్లో రిపీటయ్యాయి.
ఐపీఎల్-2023లో కనీసం 20 ఓవర్లు బౌల్ చేసి, అత్యంత చెత్త ఎకానమీ నమోదు చేసిన బౌలర్లపై ఓ లుక్కేద్దాం..
- ఉమ్రాన్ మాలిక్.. 4 కోట్లు పెట్టి సన్‌రైజర్స్ తిరిగి దక్కించుకున్న ఈ కశ్మీర్ ఎక్స్‌ప్రెస్.. ఈ సీజన్‌లోకెల్లా అత్యంత చెత్త ఎకానమీ (8 మ్యాచ్‌ల్లో 10.85 ఎకానమీతో 5 వికెట్లు) కలిగిన బౌలర్‌గా నిలిచాడు.
- ఆ తర్వాతి స్థానంలో ముంబై పేసర్ క్రిస్ జోర్డాన్ (6 మ్యాచ్‌ల్లో 10.77 ఎకానమీతో 3 వికెట్లు) ఉన్నాడు. ఈ ముంబై పేసర్ ఆడిన ప్రతి మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకుని తన జట్టు ఓటములకు ప్రధాన కారకుడిగా నిలిచాడు.
- విజయ్‌కుమార్ వైశాక్.. ఈ ఏడాదే ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఈ ఆర్సీబీ పేసర్ 7 మ్యాచ్‌ల్లో 10.54 ఎకానమీతో 9 వికెట్లు పడగొట్టాడు.
- ముకేశ్ కుమార్.. ఈ ఏడాదే ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఈ ఢిల్లీ పేసర్ 10 మ్యాచ్‌ల్లో 10.52 ఎకానమీతో 7 వికెట్లు పడగొట్టాడు.
- శార్దూల్ ఠాకూర్.. ఈ ఏడాది వేలానికి ముందు భారీ ధరకు ట్రేడ్ అయిన ఈ కేకేఆర్ ఆల్‌రౌండర్ ఈ సీజన్‌లో 11 మ్యాచ్‌లు ఆడి 10.48 ఎకానమీతో 7 వికెట్లు పడగొట్టాడు.
ఐపీఎల్ 2023లో చెత్త ఎకానమీ కలిగిన టాప్-5 బౌలర్లంతా పేసర్లే కాగా.. బెస్ట్ ఎకానమీ కలిగిన టాప్-4 బౌలర్లు స్పిన్నర్లు కావడం విశేషం. కనీసం 20 ఓవర్లు బౌల్ చేసి ఐపీఎల్ 2023 బెస్ట్ ఎకానమీ కలిగిన బౌలర్ల జాబితాలో అక్షర్ పటేల్ (14 మ్యాచ్‌ల్లో 7.19 ఎకానమీతో 11 వికెట్లు) అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ (14 మ్యాచ్‌ల్లో 7.37 ఎకానమీతో 10 వికెట్లు), రవీంద్ర జడేజా (15 మ్యాచ్‌ల్లో 7.42 ఎకానమీతో 19 వికెట్లు), కృనాల్ పాండ్యా (15 మ్యాచ్‌ల్లో 7.45 ఎకానమీతో 9 వికెట్లు) టాప్-4లో ఉన్నారు.
ఇక ఈ ఏడాది ఐపీఎల్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టి, పర్పుల్ క్యాప్ దక్కించుకున్న బౌలర్‌గా గుజరాత్ పేసర్ మహ్మద్ షమీ (16 మ్యాచ్‌ల్లో 28 వికెట్లు) కొనసాగుతున్నాడు. ఇతని తర్వాత రషీద్ ఖాన్ (16 మ్యాచ్‌ల్లో 27 వికెట్లు), మోహిత్ శర్మ (13 మ్యాచ్‌ల్లో 24 వికెట్లు) టాప్-3 బౌలర్లుగా ఉన్నారు. ఐపీఎల్ 2023లో టాప్-3 బౌలర్లంతా గుజరాత్‌కు చెందిన వారే కావడం విశేషం. వీరి దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు.
Comments
Please login to add a commentAdd a comment