PC: SLC
శ్రీలంక క్రికెట్ భవితవ్యంపై దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. క్రికెటర్లుగా కెరీర్ ఎంచుకునే వాళ్లను భయపెట్టే విధంగా ప్రస్తుత పరిణామాలు ఉన్నాయని వాపోయాడు. శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింగే ఈ విషయంలో చొరవ తీసుకొని లంక క్రికెట్ బోర్డును ప్రక్షాళన చేయాలని విజ్ఞప్తి చేశాడు.
భారత్ వేదికగా వన్డే ప్రపంచ కప్- 2023లో శ్రీలంక దారుణంగా వైఫల్యం చెందిన విషయం తెలిసిందే. వరుస పరాజయాలతో డీలాపడ్డ లంక పాయింట్ల పట్టికలో అట్టడుగు నుంచి రెండో స్థానంలో నిలిచింది. 1975, 1983, 1987, 1992 ఎడిషన్ల తర్వాత మరోసారి ఇలాంటి ఘోర పరాభవం మూటగట్టుకుంది
స్వర్ణ యుగం
కాగా... 1996లో ప్రపంచకప్ గెలిచిన శ్రీలంక 2007, 2011లో రన్నరప్‌గా నిలిచింది 2003లో సెమి ఫైనల్ వరకు చేరింది. అలాంటి జట్టు ఈసారి పూర్తిగా విఫలం కావడం తనను బాధించిందని మురళీధరన్ ఆవేదన వ్యక్తం చేశాడు. వరల్డ్ కప్ చరిత్రలో 1975 తర్వాత శ్రీలంకకు ఇదే అత్యంత చెత్త ఎడిషన్ అని విమర్శలు గుప్పించాడు.
నిబద్ధత, అంకితభావం లోపించినందువల్లే ఇలాంటి చేదు అనుభవం ఎదురైందని ముత్తయ్య మురళీధరన్ పేర్కొన్నాడు. వ్యక్తిగత అజెండాలను ఆటలపై రుద్దాలనుకోవడం సరికాదని బోర్డు సభ్యులను విమర్శించాడు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం క్రికెట్ను తాకట్టు పెట్టొద్దని చురకలు అంటించాడు.
వాళ్ల పరిస్థితి ఏం కావాలి?
ఇలాంటి పరిణామాల వల్ల యువ ఆటగాళ్ల భవిష్యత్తు ఆగమ్య గోచరంగా తయారవుతుందని పేర్కొన్నాడు. దేశం కోసం క్రికెట్ ఆడాలనుకునే వాళ్లను చిన్నబుచ్చుకునేలా చేయొద్దని ముత్తయ్య మురళీధరన్ విజ్ఞప్తి చేశాడు
కాగా వనిందు హసరంగ వంటి స్టార్ ఆల్ రౌండర్ ఫిట్‌గా ఉన్నప్పటికీ అతడిని పక్కన పెట్టారని లంక సెలక్షన్ బోర్డుపై విమర్శలు వచ్చాయి. అదే విధంగా.. క్రికెట్ బోర్డులో అవినీతిని నిర్మూలించే క్రమంలో తాను పాత కమిటీని రద్దు చేస్తున్నట్లు ఆదేశ క్రీడామంత్రి రోషన్ రణసింగి గతంలో ప్రకటించారు.
లంక బోర్డుపై నిషేధం
అయితే బోర్డు సభ్యులు కోర్టుకు వెళ్లగా అక్కడ వారికి సానుకూలంగా తీర్పు వచ్చింది. అయితే అంతర్జాతీయ క్రికెట్ మండలి మాత్రం ఈ విషయాలపై తీవ్రంగా స్పందించింది. లంక క్రికెట్ బోర్డులో ప్రభుత్వ జోక్యాన్ని నిరసిస్తూ నిషేధం విధించింది ఈ పరిణామాల నేపథ్యంలో లెజెండరీ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ న్యూస్ 18తో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment