మహిళల ఐపీఎల్ 2024లో భాగంగా ఇవాళ (మార్చి 11) గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్జ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు లారా వాల్వార్డ్ట్ (30 బంతుల్లో 43; 8 ఫోర్లు, సిక్స్), బెత్ మూనీ (42 బంతుల్లో 74 నాటౌట్; 10 ఫోర్లు, సిక్స్) రాణించగా.. మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేశారు.
దయాలన్ హేమలత 0, ఫోబ్ లిచ్‌ఫీల్డ్ 4, ఆష్లే గార్డ్‌నర్ 15, భారతి ఫుల్మలి 1, కేథరీన్ బ్రైస్ 11, తనుజా కన్వర్ 1, షబ్నమ్ 0 పరుగులకు ఔటయ్యారు. వారియర్జ్ బౌలర్లలో సోఫీ ఎక్లెస్టోన్ 3 వికెట్లతో విజృంభించగా.. దీప్తి శర్మ 2, రాజేశ్వరీ గైక్వాడ్, చమారీ ఆటపట్టు తలో వికెట్ పడగొట్టారు.
పట్టపగ్గాల్లేకుండా విరుచుకుపడిన మూనీ..
గుజరాత్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన మూనీ తొలుత ఆచితూచి ఆడినప్పటికీ.. ఆఖర్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. చివరి 12 బంతుల్ని ఎదుర్కొన్న మూనీ.. ఏకంగా 7 ఫోర్లతో విరుచుకుపడింది. 19వ ఓవర్‌లో రెండు ఫోర్ల సాయంతో 11 పరుగులు రాబట్టిన మూనీ.. చివరి ఓవర్‌లో ఏకంగా ఐదు బౌండరీలు బాది 21 పరుగులు పిండుకుంది.
మూనీ ఆఖరి రెండు ఓవర్లలో జూలు విదల్చడంతో గుజరాత్ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. కాగా, ప్రస్తుత ఎడిషన్‌లో ఢిల్లీ, ముంబై జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించగా.. గుజరాత్ జెయింట్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతుంది. ఆర్సీబీ, యూపీ వారియర్జ్ మూడు, నాలుగు స్థానాల్లో నిలిచి ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం పోటీపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment