ఆశ్చర్యం.. అనూహ్యం.. వారిపై కోట్ల వర్షం | WPL 2025 Auction: Player Who Became Costliest Remain Unsold, Check All Details About This Player In Telugu | Sakshi
Sakshi News home page

WPL 2025 Auction: ఆశ్చర్యం.. అనూహ్యం.. వారిపై కోట్ల వర్షం! వీరికి మొండిచేయి

Published Mon, Dec 16 2024 11:03 AM | Last Updated on Mon, Dec 16 2024 12:58 PM

WPL 2025 Auction Costliest Player Who Remain Unsold Check All Details

సిమ్రన్‌

షేక్‌ సిమ్రన్‌ బాను, కమిలిని, ప్రేమా రావత్‌ వీళ్ల పేర్లు మనకే కాదు... ప్రస్తుత భారత మహిళల జట్టు ప్లేయర్లకూ తెలియదు. ఎందుకంటే వీరెప్పుడు జాతీయ జట్టుకు ఆడలేదు. అసలు ఎంపికే కాలేదు. అలాగని జోనల్‌ ఈవెంట్లలో దంచేసిన రికార్డులేం లేవు. మైదానంలో పెద్దగా ఆడింది లేదు... ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’లో పాల్గొంది లేదు. 

అయినా సరే రెండు గంటల వేలంలో కోటీశ్వరులయ్యారు. మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) విశ్లేషకులు సైతం నివ్వెరపోయెలా వారి కొనుగోలు జరిగింది.  

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) మినీ వేలం ఒకింత ఆశ్చర్యంగా.. అనూహ్యంగా జరిగిపోయింది. జాతీయ స్థాయిలో భారత జట్టు తరఫున ఆడిన క్రికెటర్లను పట్టించుకోని ఫ్రాంచైజీలు కనీసం దేశవాళీ క్రికెట్లోనూ కనిపించని ప్లేయర్లపై భారీ మొత్తమే ఖర్చు చేశాయి. అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లను అందలం ఎక్కించాయి.

పేలవంగా ఆడిన ప్లేయర్‌కు భారీ ధర
బెంగళూరులో ఆదివారం జరిగిన ఈ వేలంలో 22 ఏళ్ల ముంబై బ్యాటర్‌ షేక్‌ సిమ్రన్‌ బానుకు ఏకంగా రూ. 1 కోటీ 90 లక్షలు లభించాయి. మినీ వేలంలో మేజర్‌ అమౌంట్‌ ఆమెకే దక్కింది. గుజరాత్‌ జెయింట్స్‌ ఆమె కోసం అంతమొత్తం వెచ్చించింది. అలాగనీ ఆమె ఒక మెరుపు బ్యాటర్‌గానీ, నిప్పులు చెరిగే బౌలర్‌ కానీ కాదు. 

రెండేళ్ల క్రితం 2022 సీజన్‌లో యూపీ వారియర్స్‌ తరఫున పేలవంగా ఆడి నిరాశపరిచింది. 9 మ్యాచ్‌ల్లో 29 పరుగులే చేసింది. దీంతో తర్వాత రెండు రెండు సీజన్లకు పక్కన బెట్టారు. ఇప్పుడేమో జెయింట్స్‌ పెద్దమొత్తానికి ఆమెను అక్కును చేర్చుకోవడం విశేషం.

టీనేజ్‌ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌కూ జాక్‌పాట్‌
ఇక ముంబై ఇండియన్స్‌ కూడా 16 ఏళ్ల టీనేజ్‌ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ జి.కమలినిని రూ. 1 కోటి 60 లక్షలతో కొనుగోలు చేసింది. తమిళనాడుకు చెందిన ఆమె భారత అండర్‌–19 జట్టు తరఫున అది కూడా వేలం జరిగిన రోజే (ఆదివారం కౌలాలంపూర్‌లో ఆసియా కప్‌ అండర్‌–19 టోర్నీ) ఒక మ్యాచ్‌ ఆడింది. 29 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో అజేయంగా 44 పరుగులు చేసింది.

మరోవైపు.. 23 ఏళ్ల ఉత్తరాఖండ్‌ లెగ్‌స్పిన్‌ ఆల్‌రౌండర్‌ ప్రేమా రావత్‌ను వేలంలో రూ. 1 కోటి 20 లక్షలకు పాడిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) దక్కించుకుంది. రూ. కోటి పైచిలుకు పలికిన ఈ ముగ్గురు క్రికెటర్ల బ్యాక్‌గ్రౌండ్‌ ఏమీ లేదు. కానీ మినీ వేలం వారి పాలిట మెగా జాక్‌పాట్‌గా మారింది.

వారి వైపు ఫ్రాంచైజీలు కన్నెత్తి చూడలేదు
ఇక వెస్టిండీస్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ డియాండ్రా డాటిన్‌ రూ. కోటి మార్క్‌ దాటిన ఏకైక విదేశీ ప్లేయర్‌. రూ. 1 కోటి 70 లక్షలకు ఆమెను గుజరాత్‌ జెయంట్స్‌ కొనుక్కుంది. 33 ఏళ్ల వెటరన్‌ కరీబియన్‌ క్రికెటర్‌ బేస్‌ ప్రైస్‌ రూ. 50 లక్షలు కాగా... యూపీ వారియర్స్, గుజరాత్‌లు పోటీపడ్డాయి.

గతంలో ఆమెను (2023 సీజన్‌) రూ. 60 లక్షలకు గుజరాత్‌ జెయింట్స్‌ దక్కించుకున్నప్పటికీ ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. టీమిండియా ప్లేయర్లు స్నేహ్‌ రాణా, పూనమ్‌ యాదవ్‌లపై ఐదు ఫ్రాంచైజీలు కన్నెత్తి చూడలేదు. కనీస ధరకైనా ఎవరూ తీసుకోకపోవడంతో వీరంతా అన్‌సోల్డ్‌ (అమ్ముడుపోని) క్రికెటర్లుగా మిగిలిపోయారు.  

వేలం తర్వాత  ఫ్రాంచైజీలకు మిగిలింది?
వేలానికి ముందు 15 మందిని అట్టిపెట్టుకున్న యూపీ వారియర్స్‌ ముగ్గురు ప్లేయర్లను తక్కువ ధరకే తీసుకొని మినీ వేలంలో మమ అనిపించింది. అలనా కింగ్‌ (రూ. 30 లక్షలు), క్రాంతి గౌడ్‌ (రూ. 10 లక్షలు), ఆరుషి గోయెల్‌ (రూ. 10 లక్షలు)... ఈ ముగ్గురికి కలిపి రూ. అరకోటి మాత్రమే ఖర్చు చేసింది.

 మొత్తం పర్సు రూ. 15 కోట్లు కాగా... అందరికంటే తక్కువగా రూ. 11 కోట్ల 60 లక్షలు ఖర్చు చేసిన ఈ ఫ్రాంచైజీ అందరికంటే ఎక్కువ (రూ.3 కోట్ల 40 లక్షలు) మొత్తాన్ని మిగుల్చుకుంది. గుజరాత్‌ (రూ.14 కోట్ల 60 లక్షలు) ఎక్కువగా ఖర్చు చేసింది. ఆ ఫ్రాంచైజీ వద్ద కేవలం రూ. 40 లక్షలే మిగిలున్నాయి. 

ఇక ఆర్‌సీబీ రూ. 13 కోట్ల 25 లక్షలు వెచ్చించి రూ. 1 కోటి 75 లక్షలు మిగుల్చుకుంది. రూ. 13 కోట్ల 35 లక్షలు ఖర్చు చేసిన ఢిల్లీ ఖాతాలో  రూ. 1 కోటి 65 లక్షలు మిగిలున్నాయి. ముంబై రూ. 14 కోట్ల 55 లక్షలు ఖర్చు పెట్టింది. కేవలం రూ. 45 లక్షలే ఆ ఫ్రాంచైజీ వద్ద ఉన్నాయి. ప్రతీ ఫ్రాంచైజీ కూడా గరిష్ట సభ్యుల సంఖ్య (18)ను భర్తీచేసుకున్నాయి.

మూడు ముక్కల్లో... 
ఇది వచ్చే 2025 సీజన్‌కు ముందు మినీ వేలం. 91 మంది భారతీయులు, 29 మంది విదేశీయులు కలిపి మొత్తం 124 మంది వేలానికి వచ్చారు. ఇందులో ఐదుగురు విదేశీ ప్లేయర్లు సహా 19 మంది క్రికెటర్లను ఫ్రాంచైజీలు రూ. 9.05 కోట్లకు కొనుక్కున్నాయి.  

అమ్ముడైన క్రికెటర్లు వీరే... (గరిష్టం నుంచి కనిష్ట వరుసలో) 
సిమ్రన్‌ బాను (రూ. 1.90 కోట్లు; గుజరాత్‌) 
డియాండ్రా డాటిన్‌ (రూ. 1.70 కోట్లు; గుజరాత్‌) 
కమలిని (రూ. 1.60 కోట్లు; ముంబై) 
ప్రేమా రావత్‌ (రూ. 1.20 కోట్లు; బెంగళూరు) 
శ్రీచరణి (రూ. 55 లక్షలు; ఢిల్లీ) 
నడిన్‌ డిక్లెర్క్‌ (రూ. 30 లక్షలు; ముంబై) 
డానియెల్లె గిబ్సన్‌ (రూ. 30 లక్షలు; గుజరాత్‌) 
అలానా కింగ్‌ (రూ. 30 లక్షలు; యూపీ) 
అక్షిత (రూ.20 లక్షలు; ముంబై) 
రాఘవి బిస్త్‌ (రూ. 10 లక్షలు; బెంగళూరు) 
జాగ్రవి పవార్‌ (రూ. 10 లక్షలు, బెంగళూరు) 
సంస్కృతి (రూ. 10 లక్షలు; ముంబై) 
క్రాంతి గౌడ్‌ (రూ. 10 లక్షలు; యూపీ) 
ఆరుషి గోయెల్‌ (రూ. 10 లక్షలు; యూపీ) 
నందిన్‌ కశ్యప్‌ (రూ. 10 లక్షలు; ఢిల్లీ) 
నికీ ప్రసాద్‌ (రూ. 10 లక్షలు; ఢిల్లీ) 
సారా బ్రిస్‌ (రూ.10 లక్షలు; ఢిల్లీ) 
ప్రకాశిక నాయక్‌ (రూ. 10 లక్షలు; గుజరాత్‌) 
జోషిత (రూ. 10 లక్షలు; బెంగళూరు) 

చదవండి: WPL 2025: ఏ జట్టులో ఎవరు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement