హ్యాట్రిక్‌ తీసిన బౌలర్‌నే వదిలేసిన ముంబై ఇండియన్స్‌ | WPL 2025: Mumbai Indians Released Issy Wong, Who Has Taken First Hat Trick Of The Tourney | Sakshi
Sakshi News home page

హ్యాట్రిక్‌ తీసిన బౌలర్‌నే వదిలేసిన ముంబై ఇండియన్స్‌

Published Thu, Nov 7 2024 8:03 PM | Last Updated on Thu, Nov 7 2024 8:19 PM

WPL 2025: Mumbai Indians Released Issy Wong, Who Has Taken First Hat Trick Of The Tourney

మహిళల ఐపీఎల్‌ (WPL) 2025 సీజన్‌ వేలానికి ముందు ఐదు ఫ్రాంచైజీలు (ఆర్సీబీ, ముంబై ఇండియన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌, గుజరాత్‌ జెయింట్స్‌, యూపీ వారియర్జ్‌) ఇవాళ రిటెన్షన్‌ జాబితాలను విడుదల చేశాయి. దాదాపుగా అన్ని ఫ్రాంచైజీలు నలుగురి నుంచి ఆరుగురిని వేలానికి వదిలేసి మిగతా ప్లేయర్లను అలాగే అట్టిపెట్టుకున్నాయి. డబ్ల్యూపీఎల్‌ తొలి సీజన్‌ ఛాంపియన్‌ అయిన ముంబై ఇండియన్స్‌ సైతం నలుగురిని వేలానికి వదిలేసి, 14 మంది ప్లేయర్లను రీటైన్‌ చేసుకుంది. ముంబై ఇండియన్స్‌ వదిలేసిన ప్లేయర్స్‌లో ముగ్గురు భారత అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లు కాగా.. ఓ విదేశీ స్టార్‌ ప్లేయర్‌ ఉంది. 

వచ్చే సీజన్‌ వేలానికి ముందు ముంబై ఇండియన్స్‌ ఇంగ్లండ్‌ స్టార్‌ ఫాస్ట్‌ బౌలర్‌ ఇస్సీ వాంగ్‌ను అనూహ్యంగా వేలానికి వదిలేసింది. 22 ఏళ్ల ఇస్సీ డబ్ల్యూపీఎల్‌ డెబ్యూ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ తరఫున హ్యాట్రిక్‌ తీసింది. మహిళల ఐపీఎల్‌లో హ్యాట్రిక్‌ తీసిన తొలి క్రికెటర్ ఇస్సీనే కావడం విశేషం. 2023 సీజన్‌లో యూపీ వారియర్జ్‌తో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఇస్సీ ఈ ఘనత సాధించింది. హ్యాట్రిక్‌ తీయడంతో పాటు తొలి సీజన్‌లో ఓ వెలుగు వెలిగిన ఇస్సీ 2024 సీజన్‌లో మరో స్టార్‌ విదేశీ పేసర్‌ (షబ్నిమ్ ఇస్మాయిల్‌) రావడంతో మరుగున పడిపోయింది. 

షబ్నిమ్‌ ఎంట్రీతో ఇస్సీకి అవకాశాలు కరువయ్యాయి. షబ్నిమ్‌ అద్భుతమైన ప్రదర్శనలతో రాణించడంతో ఈ ఏడాది వేలానికి ముందు ఇస్సీని వదిలేసింది ముంబై ఇండియన్స్‌ యాజమాన్యం. తుది జట్టులో నలుగురు విదేశీ ప్లేయర్లకు మాత్రమే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎంఐ మేనేజ్‌మెంట్‌ ఇస్సీని వదులుకోక తప్పలేదు. ముంబై ఇండియన్స్‌ యాజమాన్యం ఇస్సీతో పాటు స్వదేశీ అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లు ప్రియాంక బాలా, హుమైరా ఖాజీ, ఫాతిమా జాఫర్‌లను కూడా వేలానికి వదిలేసింది. 

ముంబై ఇండియన్స్‌ ఈసారి కూడా హర్మన్‌ప్రీత్‌ను కెప్టెన్‌గా కొనసాగించింది. ఎంఐ రీటైన్‌ చేసుకున్న ప్లేయర్స్‌లో యస్తికా భాటియా, అమెలియా కెర్‌, క్లో టైరాన్‌, హేలీ మాథ్యూస్‌, నాట్‌ సీవర్‌ బ్రంట్‌, పూజా వస్త్రాకర్‌, షబ్నిమ్‌ ఇస్మాయిల్‌ లాంటి స్వదేశీ, విదేశీ స్టార్లు ఉన్నారు. వేలంలో పాల్గొనేందుకు ముంబై ఇండియన్స్‌ పర్స్‌లో ఇంకా 2.65 కోట్ల బ్యాలెన్స్‌ ఉంది. ఈ మొత్తంతో ముంబై ఇండియన్స్‌ మరో నలుగురు ప్లేయర్స్‌ను కొనుగోలు చేయవచ్చు. 

డబ్ల్యూపీఎల్‌ రూల్స్‌ ప్రకారం ఒక్కో ఫ్రాంచైజీ గరిష్ఠంగా 18 మంది ప్లేయర్లను ఎంపిక చేసుకోవచ్చన్న విషయం తెలిసిందే. ఇందులో ఆరుగురు విదేశీ ప్లేయర్స్‌కు అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే, తొలి సీజన్‌లో అద్భుత ప్రదర్శనతో ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌.. రెండో సీజన్‌లో ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో ఓటమిపాలైంది. ఈ సీజన్‌లో ముంబైని ఇంటికి పంపించిన ఆర్సీబీనే ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది.

ముంబై ఇండియన్స్‌ రిటైన్‌ చేసుకున్న ప్లేయర్స్‌ వీళ్లే..
హార్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), యస్తికా భాటియా, అమెలియా కెర్‌, క్లో టైరాన్‌, హేలీ మాథ్యూస్‌, జింటిమణి కలిత, నాట్‌ సీవర్‌ బ్రంట్‌, పూజా వస్త్రాకర్‌, సంజీవన్‌ సంజనా, షబ్నిమ్‌ ఇస్మాయిల్‌, సైకా ఇషాఖీ, అమన్‌జోత్‌ కౌర్‌, అమన్‌దీప్‌ కౌర్‌, కీర్తన

ముంబై ఇండియన్స్‌ వదిలేసిన ప్లేయర్స్‌ వీళ్లే..
ప్రియాంక బాలా, హుమైరా ఖాజీ, ఫాతిమా జాఫర్‌, ఇస్సీ వాంగ్‌

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement