ముంబై వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 13) జరుగుతున్న తొట్టతొలి మహిళల ఐపీఎల్ (WPL) మెగా వేలంలో టీమిండియా క్రికెటర్లు అనూహ్య ధరలు దక్కించుకున్నారు. తొలి రౌండ్ వేలం పూర్తయ్యే సరికి అత్యధిక ధర దక్కించుకున్న ప్లేయర్‌గా స్మృతి మంధాన ఉంది. స్టార్ ఓపెనర్ అయిన స్మృతిని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ 3.4 కోట్లకు ధర వెచ్చింది సొంతం చేసుకుంది.
ఈమె తర్వాత దీప్తి శర్మ (యూపీ వారియర్జ్, 2.6 కోట్లు), జెమీమా రోడ్రిగెజ్ (ఢిల్లీ క్యాపిటల్స్, 2.2 కోట్లు), షెఫాలీ వర్మ (ఢిల్లీ క్యాపిటల్స్, 2 కోట్లు), రిచా ఘోష్ (ఆర్సీబీ, 1.9 కోట్లు), పూజా వస్త్రాకర్ (ముంబై ఇండియన్స్, 1.9 కోట్లు), టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (ముంబై ఇండియన్స్, 1.8 కోట్లు), రేణుకా సింగ్ (ఆర్సీబీ, 1.5 కోట్లు), యస్తికా భాటియా (ముంబై ఇండియన్స్, 1.5 కోట్లు) భారీ ధర పలికిన వారిలో ఉన్నారు.
మెగా వేలంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ప్లేయర్లు ఇప్పటివరకు లిస్టింగ్‌లోకి రాగా.. కర్నూలుకు చెందిన కేశవరాజుగారి అంజలి శర్వాణిని యూపీ వారియర్జ్ 55 లక్షలకు దక్కించుకుంది. తెలంగాణ బిడ్డ గొంగడి త్రిష 10 లక్షల బేస్‌ప్రైజ్ విభాగంలో లిస్టింగ్‌కు వచ్చినప్పటికీ ఏ ఫ్రాంచైజీ ఆసక్తి కనబర్చ లేదు. వేలం ట్రెండ్‌ను బట్టి త్రిషకు భారీ ధర దక్కుతుందని అంతా ఊహించారు.
అయితే, ఈ అమ్మాయిని జట్టులో చేర్చుకునేందుకు ఏ జట్టు ఆసక్తి కనబర్చకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. వేలంలో మరో దఫా లిస్టింగ్ అయ్యే ఛాన్స్ ఉండటంతో చివర్లో అయినా ఏదో ఒక జట్టు ఈ అమ్మాయిని దక్కించుకోవచ్చు. 17 ఏళ్ల స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన త్రిష ఇటీవల జరిగిన అండర్-19 టీ20 వరల్డ్‌కప్‌లో సత్తా చాటడం ద్వారా వెలుగులోకి వచ్చింది.
సీనియర్ జట్టుకు ఆడకపోవడం ఈ అమ్మాయికి మైనస్ అయ్యుండవచ్చని క్రికెట్ ఫాలోవర్స్ అనుకుంటున్నారు. తెలంగాణలోని భద్రాచలానికి చెందిన త్రిష.. అండర్-19 వరల్డ్‌కప్-2023 ఫైనల్లో కీలక ఇన్నింగ్స్ (24 నాటౌట్) ఆడి టీమిండియాను జగజ్జేతగా నిలపడంలో కీలకపాత్ర పోషించింది. రైట్ హ్యాండ్ బ్యాటింగ్, లెగ్ బ్రేక్ బౌలింగ్ చేసే త్రిష.. ఫీల్డింగ్‌లోనూ అదరగొడుతుంది. వేలం ప్రక్రియ ఇవాళ రాత్రి వరకు సాగనుండటంతో ఏదో ఒక జట్టు త్రిషను సొంతం చేసుకోవాలని ఆశిద్దాం.
కాగా, వేలంలో తొలి రౌండ్ పూర్తయ్యే సరికి త్రిషతో పాటు భారత్‌కు చెందిన క్రికెటర్లు తాన్యా భాటియా, సుష్మ వర్మ, పూనమ్ యాదవ్, హ్రిషిత బసు, సౌమ్య తివారి, అర్చనా దేవి, మన్నత్ కశ్యప్, నజ్లా సీఎంసీ, సోనమ్ యాదవ్, షబ్నమ్ షకీల్, ఫలక్ నాజ్, సోనియా మెందియా, శిఖా షాలోట్, హర్లీ గాలా అన్ సోల్డ్‌గా మిగిలిపోయారు. ఇప్పటివరకు కేవలం 78 మాత్రమే వేలానికి రాగా.. ఇంకా 412 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment