నేపాల్‌తో మ్యాచ్‌లో భారత మహిళా క్రికెటర్ షెఫాలీ వర్మ సూపర్ ఇన్నింగ్స్ ఆడింది. ఆది నుంచి ఆకాశమే హద్దుగా చెలరేగుతూ పరుగుల వరద పారించింది. ఈ క్రమంలో తన టీ20 కెరీర్‌లోనే అత్యుత్తమ స్కోరు సాధించింది.
కానీ శతకం చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. వుమెన్స్ ఆసియా కప్ టీ20- 2024లో భాగంగా భారత్- నేపాల్ మధ్య మంగళవారం మ్యాచ్ జరుగుతోంది. శ్రీలంకలోని డంబుల్లా వేదికగా సాగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది.
ఈ క్రమంలో ఓపెనర్ షెఫాలీ వర్మ టీమిండియాకు శుభారంభం అందించింది. కేవలం 48 బంతుల్లోనే 81 పరుగులు సాధించింది. ఆమె ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. మరో ఓపెనర్ హేమలత(42 బంతుల్లో 47) కలిసి షెఫాలీ తొలి వికెట్‌కు 122 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.
ఇక షెఫాలీ వర్మ అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో ఇదే అత్యధిక స్కోరు(81) కావడం విశేషం. అంతేకాదు వుమెన్స్ టీ20 ఆసియా కప్‌లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రెండో క్రికెటర్‌గా షెఫాలీ నిలిచింది. 2018 నాటి టోర్నీలో 69 బంతుల్లో 97 పరుగులతో అజేయంగా నిలిచిన మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ఈ జాబితాలో షెఫాలీ కంటే ముందు వరుసలో ఉంది.
ఓవరాల్‌గా శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు(119 నాటౌట్) స్థానాన్ని మిథాలీ రాజ్, షెఫాలీ వర్మ ఆక్రమించారు. ఇక భారత్ తరఫున టీ20లలో షెఫాలీ సాధించిన పదో అర్ధ శతకం ఇదే. అంతేకాదు టీమిండియా తరఫున అతిపిన్న వయసులో ఈ ఘనత సాధించిన క్రికెటర్ కూడా షఫాలీ వర్మనే కావడం విశేషం. ఇరవై ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఇప్పటి వరకు 79 అంతర్జాతీయ టీ20లు ఆడి 1906 పరుగులు చేసింది.
ఇక నేపాల్‌తో మ్యాచ్‌లో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 178 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన నేపాల్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. ఈ క్రమంలో సగం ఆట(10 ఓవర్లు) ముగిసేసరికి నేపాల్ మూడు వికెట్లు కోల్పోయి కేవలం 48 పరుగులు మాత్రమే చేసింది.
ఇదిలా ఉంటే.. ఆసియా టీ20 కప్-2024లో భారత్ ఇప్పటికే సెమీస్ బెర్తును దాదాపుగా ఖాయం చేసుకుంది. పాకిస్తాన్, యూఏఈలపై గెలుపొందిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేన.. ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే నేరుగా సెమీ ఫైనల్లో అడుగుపెడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment