టీమిండియా ఆలౌట్.. 209 పరుగుల తేడాతో ఆసీస్ విజయం
డబ్ల్యూటీసీ ఫైనల్ 2021-23 విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. టీమిండియాతో జరిగిన ఫైనల్లో ఆసీస్ జట్టు 209 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 444 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఐదోరోజు లంచ్ సెషన్‌లోపే 234 పరుగులకే కుప్పకూలింది.
161/3 క్రితం రోజు స్కోరుతో ఐదోరోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు కోహ్లి రూపంలో కాసేపటికే షాక్ తగిలింది. ఆ వెంటనే జడేజా కూడా డకౌట్ కావడంతో టీమిండియా ఓటమి దాదాపు ఖరారైంది. అయితే రహానే, శార్దూల్‌లు తొలి ఇన్నింగ్స్‌లో లాగా ఏదైనా అద్బుతం చేసి డ్రా దిశగా నడిపిస్తారేమోనని ఆశించారు. కానీ ఆసీస్ బౌలర్లు ఆ అవకాశం ఇవ్వలేదు. రహానే, శార్దూల్‌లు స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో.. టెయిలెండర్డను ఔట్ చేయడం ఎంతో సేపు పట్టలేదు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లియోన్ నాలుగు వికెట్లు తీయగా.. స్కాట్ బోలాండ్ మూడు, స్టార్క్ రెండు, కమిన్స్ ఒక వికెట్ తీశాడు.
సంక్షిప్త స్కోర్లు:
ఆస్ట్రేలియా: 469& 270/8
టీమిండియా: 296 ఆలౌట్& 234 ఆలౌట్
ఫలితం: 209 పరుగుల తేడాతో విజయం సాధించిన ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ 2021-23 ఛాంపియన్‌గా అవతరించింది.
ఓటమికి రెండు వికెట్ల దూరంలో
డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓటమికి మరింత దగ్గరైంది. ప్రధాన బ్యాటర్లంతా ఇప్పటికే వెనుదిరగడంతో ఆసీస్ బౌలర్లు టెయిలెండర్ల వికెట్లు తీసే పనిలో పడ్డారు. మిచెల్ స్టార్క్ ఉమేశ్ యాదవ్‌ను ఔట్ చేయడం ద్వారా టీమిండియా 220 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది.
► తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న శార్దూల్ ఠాకూర్ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం డకౌట్‌గా వెనుదిరిగాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో శార్దూల్ ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా ఓటమి దిశగా పయనిస్తోంది. ఏదైనా అద్బుతం జరిగితే తప్ప ఆసీస్ విజయం సాధించడం తథ్యం.
రహానే(46) ఔట్.. ఆరో వికెట్ డౌన్
డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా కష్టాల్లో పడింది. తొలి ఇన్నింగ్స్ మాదిరి ఆదుకుంటాడనుకున్న రహానే(46) మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో అలెక్స్ కేరీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో టీమిండియా 212 పరుగుల వద్ద ఆరో వికెట్ నష్టపోయింది. మరో 232 పరుగులు చేయాల్సిన టీమిండియా ఓటమి నుంచి తప్పించుకోవడం అసాధ్యంగా కనిపిస్తుంది.
జడేజా డకౌట్.. ఐదో వికెట్ డౌన్
ఆసీస్ బౌలర్ స్కాట్ బోలాండ్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి టీమిండియాను దెబ్బ కొట్టాడు. కోహ్లి ఔటైన రెండు బంతుల వ్యవధిలోనే జడేజా కూడా డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.
కోహ్లి(49)ఔట్.. టీమిండియా 179/4
భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియాకు కోహ్లి రూపంలో షాక్ తగిలింది. 49 పరుగులు చేసిన కోహ్లి స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో టీమిండియా 179 పరుగులు వద్ద నాలుగో వికెట్ నష్టపోయింది. కాగా భారత్ విజయానికి ఇంకా 265 పరుగులు చేయాల్సి ఉంది.
ఐదోరోజు మొదలైన ఆట..
టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ ఆట ఆఖరి రోజుకు చేరుకుంది. క్రితం రోజు స్కోరు ఆటను ఆరంభించిన టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. కోహ్లి 46, రహానే 29 పరుగులతో క్రీజులో ఉన్నారు. చేయాల్సినవి 280 పరుగులు.. చేతిలో ఉన్నవి ఏడు వికెట్లు. మరి టీమిండియా 444 పరుగుల టార్గెట్‌ను చేధించి చరిత్ర సృష్టిస్తుందా లేక డ్రాకు మొగ్గుచూపుతుందా అనేది చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment