సౌథాంప్టన్: కనీసం టాస్ కుడా పడకుండానే భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ తొలి రోజు ఆట రద్దైంది. ఉదయం నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తుండటంతో టీ విరామం అనంతరం రిఫరీ తొలి రోజు ఆటను రద్దు చేస్తుననట్లు ప్రకటించాడు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో వరుణుడు కాస్త కరుణించినట్లు కనిపించినా, ఆతర్వాత మళ్లీ జల్లులు మొదలుకావడంతో తొలి రోజు ఆటను పూర్తిగా రద్దు చేశారు. మైదానమంతా వర్షం నీరుతో నిండు కుండలా మారిపోయింది. దీంతో రేపటి ఆట సాధ్యాసాధ్యాలపై కూడా అనుమానం నెలకొంది.
మరోవైపు సౌథాంప్టన్‌లో వచ్చే ఆరు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని బ్రిటన్ మెట్రలాజికల్ డిపార్ట్‌మెంట్ హెచ్చరించింది. ఈ మేరకు ఎల్లో వెదర్ వార్నింగ్‌ను జారీ చేసింది. ఎల్లో వెదర్ వార్నింగ్ అంటే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవడం అని అర్ధం. ఈ మ్యాచ్ జరిగాల్సినన్ని రోజులు ఓ మోస్తరు నుంచి భారీ, అతిభారీ వర్షాలు కురుస్తాయని బీఎండీ పేర్కొంది. ప్రస్తుతం అక్కడ 16 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వడంతో పాటు.. చిరుజల్లులు పడుతున్నాయని తెలిపింది.
ఇదిలా ఉంటే, నిన్నటి నుంచి కురుస్తున్న వర్షం కారణంగా ఏజియస్ బౌల్ స్టేడియం మొత్తం చిత్తడిగా మారింది. పిచ్ డ్యామేజ్ కాకుండా గ్రౌండ్ స్టాఫ్ దాన్ని కవర్లతో కప్పి ఉంచారు. వర్షం పూర్తిగా ఎడతెరిపినిస్తే కానీ, గ్రౌండ్‌లో కి ఎంటర్ కాలేని పరిస్థితి. కాగా, ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉన్నప్పటికీ.. మరో వారం రోజుల పాటు వర్షాలు కురువనున్న నేపథ్యంలో ఏ రోజు ఎన్ని ఓవర్ల ఆట సాధ్యమయ్యే అవకాశం ఉందన్న విషయాన్ని విశ్లేషకులు పరిశీలిస్తున్నారు.
చదవండి: కోహ్లీ మాటతప్పాడు.. సిరాజ్ అభిమానుల ఆగ్రహావేశాలు
Comments
Please login to add a commentAdd a comment