
న్యూఢిల్లీ: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు సంబంధించిన అఫిషియల్స్ జాబితాను అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) మంగళవారం ప్రకటించింది. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య సౌతాంప్టన్ వేదికగా జూన్ 18 నుంచి 22 వరకు జరగనున్న చారిత్రక పోరులో ఫీల్డ్ అంపైర్లుగా రిచర్డ్ ఇల్లింగ్ వర్త్, మైకేల్ గాఫ్.. నాలుగో అంపైర్‌గా అలెక్స్ వార్ఫ్, మ్యాచ్ రిఫరీగా క్రిస్ బ్రాడ్ వ్యవహరించనున్నట్లు ఐసీసీ ప్రకటించింది. అయితే ఈ జాబితాలో భారత అభిమానులు ఐరెన్ లెగ్‌గా పరిగణించే రిచర్డ్ కెటిల్ బరోకు కూడా స్థానం లభించింది. కెటిల్ బరోను థర్డ్ అంపైర్‌గా నియమిస్తూ ఐసీసీ ప్రకటన విడుదల చేయడంతో భారత అభిమానులు ఒకింత ఆందోళనకు గురవుతున్నారు.
వివరాల్లోకి వెళితే.. రిచర్డ్ కెటిల్బరో అంపైరింగ్ చేసిన అన్ని ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో భారత్ ఓడింది. దీంతో అతన్ని అంపైర్‌గా తీసుకోవద్దని భారత అభిమానులు ఐసీసీని రిక్వెస్ట్ చేశారు. 2014 టీ20 ప్రపంచకప్ నుంచి 2019 వన్డే ప్రపంచకప్ సెమీస్ వరకు.. ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో భారత్ ఓటమి పరంపర కొనసాగింది. బంగ్లాదేశ్ వేదికగా జరిగిన 2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో రిచర్డ్ కెటిల్ బరో అంపైరింగ్ చేయగా.. ఈ మ్యాచ్‌లో ధోనీ నేతృత్వంలోని భారత జట్టు శ్రీలంక చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఆ తర్వాత 2015 వన్డే ప్రపంచ కప్‌లోనూ భారత్‌కు ఇదే పరిస్థితి ఎదురైంది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో 95 పరుగుల తేడాతో చిత్తుగా ఓడి ఇంటి దారిపట్టింది.
అలాగే, 2016 టీ20 ప్రపంచకప్‌లోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. టోర్నీ ఆసాంతం దూకుడుగా ఆడిన టీమిండియా.. సెమీస్‌లో వెస్టిండీస్ చేతిలో ఓటమిపాలైంది. ఆతర్వాత 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్లో పాక్ చేతిలో 180 పరుగుల తేడాతో ఓడి టైటిల్ చేజార్చుకుంది. చివరిసారిగా ఆయన అంపైరింగ్ చేసిన 2019 వన్డే ప్రపంచ కప్ సెమీస్‌లోనూ భారత్.. న్యూజిలాండ్ చేతిలో ఓడింది. ఈ మ్యాచ్‌లో ధోనీ రనౌట్ అయినప్పుడు లెగ్ అంపైర్‌గా ఉన్న కెటిల్బరో.. ‘అయ్యో' అని ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌ను భారత అభిమానులు ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నారు. కాగా, భారత అభిమానులకు సానుకూలాంశం ఏంటంటే, డబ్ల్యూటీసీ ఫైనల్లో కెటిల్ బరో టీవీ అంపైర్‌గా వ్యవహరిస్తుండటం.
చదవండి: టీమిండియా క్రికెటర్లు లేకుండానే ఐసీసీ అవార్డులు
Comments
Please login to add a commentAdd a comment