టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ మరోసారి తన బ్యాటింగ్ విలువను చూపించాడు. ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్లో లార్డ్ శార్దూల్(#LordShardul) మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. టీమిండియా కష్టాల్లో ఉన్న ప్రతీసారి నేనున్నానంటూ భరోసా ఇస్తున్న శార్దూల్ మరోసారి దానిని నిలబెట్టుకున్నాడు.
2020లో ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరిగిన చారిత్రాత్మక టెస్టులో శార్దూల్ హాఫ్ సెంచరీని అంత తొందరగా ఎవరు మరిచిపోరు. ఆ మ్యాచ్‌లో ఆసీస్ బౌలర్ల ధాటికి టాపార్డర్, మిడిలార్డర్ కుప్పకూలిన వేళ వారిని సమర్థంగా ఎదుర్కొన్న శార్దూల్.. వాషింగ్టన్ సుందర్‌తో కలిసి ఏడో వికెట్‌కు వందకు పైగా పరుగులు జోడించారు.
ఈ క్రమంలో 115 బంతుల్లో 67 పరుగులతో బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో టీమిండియా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించడమే గాక 2-1తేడాతో ఆసీస్‌ను సొంత గడ్డపై ఓడించిన చారిత్రక సిరీస్ విజయాన్ని అందుకుంది. మరో విశేషమేమిటంటే ఈ సిరీస్ నుంచి కోహ్లి మధ్యలోనే తప్పుకోవడంతో రహానే కెప్టెన్సీలో టీమిండియా టెస్టు సిరీస్ సొంతం చేసుకుంది.
అంతేకాదు ఇంగ్లండ్‌తో 2021లో ఓవల్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లోనూ అర్థసెంచరీలు సాధించడమే గాక బౌలింగ్‌లోనూ వికెట్లు తీసి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు.
ఇక ఆసీస్‌తో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో మూడోరోజు ఆట ప్రారంభమైన కాసేపటికే ఐదు పరుగులు చేసిన కేఎస్ భరత్ స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. రహానే ఒంటరిపోరాటం చేస్తున్నా లాభం లేదు.. ఇంకేముంది.. మరో 40 లేదా 50 పరుగుల్లోపూ టీమిండియా ఆలౌట్ అయిపోతుంది.. ఆస్ట్రేలియా టీమిండియాను ఫాలోఆన్ ఆడించి భారీ విజయం నమోదు చేస్తుంది.. ఇదే మనం చూడబోతున్నాం అంటూ టీమిండియా ఫ్యాన్స్ నిట్టూర్చారు.
కానీ అప్పుడు క్రీజులోకి వచ్చాడు ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్. అయితే వచ్చీ రావడంతోనే కమిన్స్ బౌలింగ్‌లో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆసీస్ పేసర్ల జోరు చూస్తుంటే శార్దూల్‌ను ఔట్ చేయడం పెద్ద కష్టమేమి కాదనుకున్నారు. దీనికి తోడు కమిన్స్ బౌలింగ్‌లో వరుసగా రెండుసార్లు గాయపడ్డాడు. కమిన్స్ వేగంతో విసిరిన బంతులు శార్దూల్ చేతిని టార్గెట్ చేశాయి. అయితే నొప్పిని భరిస్తూనే ఆసీస్ బౌలింగ్‌ను ధీటుగా ఎదుర్కొంటున్నాడు.
శార్దూల్ చేసిన 36 పరుగులు టీమిండియా ఇన్నింగ్స్‌కు కొండంత ధైర్యాన్ని ఇచ్చాయి. ముఖ్యంగా ఒంటరిపోరాటం చేస్తున్న రహానేకు అండగా నిలబడేందుకు ఒక బ్యాటర్ కావాల్సిన సమయంలో శార్దూల్ ఆ బాధ్యతను తీసుకున్నాడు. ఎక్కువగా రహానేకు స్ట్రైక్ ఇస్తూ మధ్యమధ్యలో తాను పరుగులు చేశాడు. ఇద్దరు కలిసి ఏడో వికెట్‌కు 108 పరుగులు జోడించి అజేయంగా సాగుతున్నారు.
లంచ్ విరామ సమయానికి టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. రహానే 89 బ్యాటింగ్, శార్దూల్ 36 పరుగులు బ్యాటింగ్ క్రీజులో ఉన్నారు. అయితే శార్దూల్ ఆట ఇంకా ముగియలేదు.. మరోసారి హాఫ్ సెంచరీ చేస్తాడా.. లేదంటే ఏకంగా సెంచరీతో మెరుస్తాడా అనేది చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment