
విదర్భతో మ్యాచ్‌లో పాల్గొనే ముంబై జట్టులో ఎంపిక
ముంబై: భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో ముంబై జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. ఇటీవల ఇంగ్లండ్‌పై అంతర్జాతీయ వన్డే అరంగేట్రం చేసిన యశస్వి జైస్వాల్‌కు చాంపియన్స్ ట్రోఫీలో బరిలోకి దిగే భారత జట్టులో చోటు దక్కలేదు. ప్రాథమిక జట్టులో జైస్వాల్‌ను ఎంపిక చేసినా... అనంతరం స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కోసం 15 మందితో కూడిన జట్టు నుంచి అతడిని తప్పించారు.
ప్రస్తుతానికి జైస్వాల్‌తో పాటు పేస్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి నాన్ ట్రావెలింగ్ రిజర్వ్‌లుగా ఉన్నారు. అత్యవసమైతేనే వీరు దుబాయ్‌కు వెళ్లనున్నారు. దీంతో రంజీ ట్రోఫీ సెమీఫైనల్ కోసం జైస్వాల్ ముంబై సెలెక్టర్లు ఎంపిక చేశారు. విదర్భతో ఈనెల 17 నుంచి జరగనున్న సెమీఫైనల్ పోరులో యశస్వి, సూర్యకుమార్, శివమ్ దూబే, అజింక్య రహానే, శార్దుల్ ఠాకూర్ వంటి భారత ఆటగాళ్లు ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు.
ఈ సీజన్‌లో జమ్మూకశ్మీర్‌తో ఆడిన ఏకైక రంజీ మ్యాచ్‌లో జైస్వాల్ ఆకట్టుకోలేకపోయాడు. రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగినా... భారీ ఇన్నింగ్స్‌లు ఆడలేకపోయాడు. గతేడాది రంజీ ట్రోఫీ ఫైనల్లో విదర్భను చిత్తు చేసిన ముంబై జట్టు 42వసారి టైటిల్ చేజిక్కించుకుంది.
ముంబై జట్టు: అజింక్య రహానే (కెప్టెన్ ), ఆయుశ్ మాత్రే, అంగ్‌క్రిష్ రఘువంశీ, అమోఘ్ భక్తల్, సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్, సిద్ధేశ్ లాడ్, శివమ్ దూబే, ఆకాశ్ ఆనంద్, హార్దిక్ తమోర్, సూర్యాన్ష్ షెడ్గే, శార్దుల్ ఠాకూర్, షమ్స్ ములానీ, తనుశ్ కొటియాన్, మోహిత్ అవస్థి, సెల్వెస్టర్ డిసౌజ, రోస్టన్ డియాస్, అథర్వ అంకొలేకర్, హర్ష్ తన్నా.
Comments
Please login to add a commentAdd a comment