న్యూఢిల్లీ: సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో రెండో రోజు భారత షూటర్లు అదరగొట్టారు. ఒక స్వర్ణం, రెండు రజతాలు, రెండు కాంస్యాలతో కలిపి మొత్తం ఐదు పతకాలను సొంతం చేసుకున్నారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో యశస్విని సింగ్ స్వర్ణం... మనూ భాకర్ రజతం గెల్చుకున్నారు. ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్స్‌లో యశస్విని 238.8 పాయింట్లు... మనూ 236.7 పాయింట్లు స్కోరు చేశారు. ఇప్పటికే వీరిద్దరు ఒలింపిక్స్‌కు అర్హత పొందారు.
భారత్‌కే చెందిన మరో షూటర్ నివేథా 193.5 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో సౌరభ్ చౌదరీ (243.2 పాయింట్లు) రజతం... అభిషేక్ వర్మ (221.8 పాయింట్లు) కాంస్యం దక్కించుకున్నారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో దివ్యాంశ్ సింగ్ పన్వర్ (228.1 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించాడు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అంజుమ్ మౌద్గిల్ 187.8 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. టోర్నీ ప్రారంభానికి ముందు ఇద్దరు భారత పిస్టల్ షూటర్లతో సహా మరొక విదేశీ షూటర్‌కు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దాంతో ఈ ముగ్గురు షూటర్లు టోర్నీ నుంచి వైదొలిగారు.
Comments
Please login to add a commentAdd a comment