న్యూఢిల్లీ: వన్డే క్రికెట్‌లో డకౌట్ కాకుండా కెరీర్‌ను ముగించిన ఆటగాళ్లను క్రికెట్ చరిత్రలో చాలా అరుదుగా చూస్తాం. ఈ అరుదైన జాబితాలో భారత్ మాజీ క్రికెటర్, 1983 వన్డే ప్రపంచకప్‌లో కపిల్ డెవిల్స్ జట్టు సభ్యుడు దివంగత యశ్‌పాల్ శర్మ ఉండటం విశేషం. భారత్ తరఫున 42 అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లు ఆడిన యశ్‌పాల్.. 28.48 సగటుతో 4 అర్ధశతకాల సాయంతో 883 పరుగులు చేశాడు. అయితే ఈ క్రమంలో ఆయన ఒక్కటంటే ఒక్కసారి కూడా డకౌట్ కాలేదు. తన కెరీర్‌లో పాకిస్తాన్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంక, ఆస్ట్రేలియాకు చెందిన దిగ్గజ బౌలర్లను ఎదుర్కొన్న యశ్‌పాల్ ఒక్కసారి కూడా సున్నా పరుగులకు వెనుదిరగలేదు.
ఇలా డకౌట్ కాకుండా కనీసం 40కిపైగా వన్డే మ్యాచ్‌లు ఆడి కెరీర్‌ను ముగించిన క్రికెటర్లు వన్డే క్రికెట్ చరిత్రలో మరో ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు. వీరిలో దక్షిణాఫ్రికా, ఆసీస్ మాజీ ఆటగాడు కెప్లెర్ వెసెల్స్ 109 మ్యాచ్‌ల్లో ఒక్క డకౌట్ కూడా లేకుండా కెరీర్ ముగించగా, అతని తర్వాతి స్థానంలో స్కాట్లాండ్ ప్లేయర్ మాథ్యూ స్కాట్(54), ఆసీస్ ఆటగాడు నాథన్ హౌరిట్జ్(58 మ్యాచ్‌లు), పాక్ ఆటగాడు వసీం బారి(51), దక్షిణాఫ్రికాకు చెందిన జాక్ రుడాల్ఫ్(45), దక్షిణాఫ్రికా క్రిస్ మోరిస్(42), శ్రీలంక ప్లేయర్ డి డిసిల్వా(41), సౌతాఫ్రికా పీటర్ కిర్‌స్టెన్(40), ఇంగ్లండ్ రసెల్(40) వరుసగా ఉన్నారు. కాగా, ఈ అరుదైన ఘనత సాధించిన ఏకైక భారత ఆటగాడు కేవలం యశ్‌పాల్ శర్మనే కావడం మరో విశేషం.
ఇదిలా ఉంటే, ఇవాళ ఉదయం గుండెపోటు రావడంతో యశ్‌పాల్ శర్మ ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు. 1978లో పాకిస్తాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన యశ్‌పాల్.. 1983 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టులో ముఖ్యుడు. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో ఆయన 61 పరగులు చేసి జట్టును ఫైనల్స్‌కు చేర్చాడు. యశ్‌పాల్ టీమిండియా తరపున 1978- 83 మధ్య కాలంలో మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌గా కీలకపాత్ర పోషించాడు. అయితే, 1985లో తలకు గాయం కావడంతో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
Comments
Please login to add a commentAdd a comment