నువ్వేమీ హెడెన్‌ కాదు.. జస్ట్‌ బంగ్లాదేశ్‌ ప్లేయర్‌వి: సెహ్వాగ్‌ | You Are Not Gilchrist, Just A Player from Bangladesh: Sehwag Rips Into Shakib | Sakshi
Sakshi News home page

నువ్వేమీ గిల్‌క్రిస్ట్‌ కాదు.. జస్ట్‌ బంగ్లాదేశ్‌ ప్లేయర్‌వి: సెహ్వాగ్‌

Published Tue, Jun 11 2024 12:06 PM | Last Updated on Tue, Jun 11 2024 12:28 PM

You Are Not Gilchrist, Just A Player from Bangladesh: Sehwag Rips Into Shakib

‘‘అనుభవమే ప్రాతిపదికగా అతడిని జట్టులోకి తీసుకుని ఉంటే మాత్రం.. అతడు అందుకు ఏమాత్రం న్యాయం చేయడం లేదు. కనీసం కొంతసేపైనా క్రీజులో నిలబడాలి కదా.

షార్ట్‌ బాల్‌ను కూడా పుల్‌ షాట్‌ ఆడటానికి నువ్వేమీ మాథ్యూ హెడెన్‌వో లేదంటే ఆడం గిల్‌క్రిస్ట్‌వో కాదు. కేవలం బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన ఆటగాడివి అంతే. నీ స్థాయి, ప్రమాణాలకు తగ్గట్లు ఆడాలి.

హుక్‌ లేదంటే పుల్‌ షాట్‌ ఆడే నైపుణ్యం నీకు లేనట్లయితే.. నీకు తెలిసిన షాట్లు మాత్రమే ఆడవచ్చు కదా!’’ అంటూ బంగ్లాదేశ్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ ఆట తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ విమర్శలు గుప్పించాడు.

టీ20 ప్రపంచకప్‌-2024లో భాగంగా సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో షకీబ్‌ పూర్తిగా విఫలం కావడంతో ఈ మేరకు ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా గ్రూప్‌-డిలో భాగమైన బంగ్లాదేశ్‌ సోమవారం నాటి మ్యాచ్‌లో ప్రొటిస్‌ జట్టు చేతిలో ఓటమిపాలైంది.

ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో నాలుగు పరుగుల స్వల్ప తేడాతో గెలుపునకు దూరమైంది. న్యూయార్క్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్‌ చేసి 113 పరుగులు చేసింది.

స్వల్ప లక్ష్య ఛేదనలో బంగ్లా ఆది నుంచే తడబడింది. టాపార్డర్‌ చేతులెత్తేయగా.. నాలుగో స్థానంలో వచ్చిన షకీబ్‌ అల్‌ హసన్‌ కేవలం మూడు పరుగులే చేశాడు. అనవసరపు షాట్‌కు యత్నించి అన్రిచ్‌ నోర్జే బౌలింగ్‌లో ఐడెన్‌ మార్క్రమ్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు.

జట్టులో సీనియర్‌ ఆటగాడైన ఈ స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ ఇలా పూర్తిగా నిరాశపరచడంతో సెహ్వాగ్‌ పైవిధంగా స్పందించాడు. ఆస్ట్రేలియా దిగ్గజాలు మాథ్యూ హెడెన్‌, ఆడం గిల్‌క్రిస్ట్‌ల పేర్లు ప్రస్తావిస్తూ విమర్శించాడు. తెలిసిన షాట్లు మాత్రమే ఆడుతూ తెలివిగా వ్యవహరించే బాగుండి ఉండేదని క్రిక్‌బజ్‌ షోలో షకీబ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు.

కాగా ఈ మ్యాచ్‌లో షకీబ్‌ అల్‌ హసన్‌ ఒక ఓవర్‌ బౌలింగ్‌ చేసి ఆరు పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. ఇక టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు టీ20 ప్రపంచకప్‌ మొదటి ఎడిషన్‌(2007) నుంచి ఇప్పటిదాకా ఈ మెగా టోర్నీలో ఆడుతున్న ప్లేయర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ మాత్రమే!  

ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్‌-2024 గ్రూప్‌-డిలో ఉన్న బంగ్లాదేశ్‌ ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడి.. ఒకటి మాత్రమే గెలిచింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మరోవైపు.. బంగ్లాపై విజయంతో మూడో గెలుపు నమోదు చేసిన సౌతాఫ్రికా సూపర్‌-8లో అడుగుపెట్టింది.
చదవండి: SA vs Ban: నరాలు తెగే ఉత్కంఠ: ఆ క్యాచ్‌ గనుక వదిలేసి ఉంటే..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement