ఐపీఎల్-2024లో ఏప్రిల్ 15న చిన్నస్వామి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సాధించిన స్కోరు 287/3. ఓపెనర్ ట్రావిస్ హెడ్ 41 బంతుల్లోనే 102 పరుగులతో చెలరేగగా.. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 34, వన్‌డౌన్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ 31 బంతుల్లో 67 పరుగులు రాబట్టారు.
ఇక నాలుగో స్థానంలో వచ్చిన వచ్చిన ఐడెన్ మార్క్రమ్ 17 బంతుల్లో 32, ఐదో నంబర్‌లో బ్యాటింగ్ చేసిన అబ్దుల్ సమద్ 10 బంతుల్లోనే 37 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచారు. వీరి అద్భుత ఇన్నింగ్స్ ఫలితమే 287. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు.
భారీ లక్ష్య ఛేదనలో ఆర్సీబీ ఆఖరి వరకు పట్టుదలగా పోరాడింది. కానీ 262 పరుగులకే పరిమితమై ఓటమిని ఆహ్వానించింది. చిన్నస్వామి స్టేడియాన్ని పరుగుల వరదతో ముంచెత్తిన సన్‌రైజర్స్ 25 పరుగుల తేడాతో గెలుపొంది సత్తా చాటింది.
ఇప్పుడు మళ్లీ ఏప్రిల్ 25న ఇరు జట్లు మరోసారి ముఖాముఖి తలపడనున్నాయి. ఏడింట ఐదు విజయాలతో మూడో స్థానంలో ఉన్న సన్‌రైజర్స్.. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు(ఎనిమిదికి ఒక్కటే విజయం) నుంచి దాదాపుగా నిష్క్రమించిన ఆర్సీబీకి మధ్య పోరు ఆసక్తికరంగా మారింది.
ప్లే ఆఫ్స్ అవకాశాలను మెరుగు పరచుకునేందుకు సన్‌రైజర్స్ మరో విజయానికి గురిపెట్టగా.. ఆర్సీబీ పరువు కోసం పాకులాడుతోంది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్- ఆర్సీబీ మధ్య గురువారం నాటి పోరు రసవత్తరంగా మారనుంది.
ఈ నేపథ్యంలో ఇప్పటికే రెండు జట్లు ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీస్ పూర్తి చేసుకోగా.. రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్- ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మధ్య ఈ సందర్భంగా ఆసక్తికర సంభాషణ జరిగింది.
కోహ్లి దగ్గరికి వచ్చిన కమిన్స్.. ‘‘వికెట్ ఫ్లాట్‌గా కనిపించేలా చేస్తానని కోచ్ చెప్తున్నాడు. నేనైతే ఆ విషయం విన్నాను మరి’’ అని టీజ్ చేశాడు. ఇందుకు స్పందనగా.. ‘‘నువ్వు చాలా మంచివాడివి ప్యాట్’’ అని కోహ్లి బదులిచ్చాడు.
ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో ఆర్సీబీ షేర్ చేయగా వైరల్ అవుతోంది. కాగా గత మ్యాచ్‌లో కోహ్లి 20 బంతుల్లో 42 పరుగులు చేయగా.. పేస్ బౌలర్ కమిన్స్ 4 ఓవర్లలో 43 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు.
Comments
Please login to add a commentAdd a comment