తానూ డిప్రెషన్ బాధితుడేనన్న టీమిండియా మాజీ క్రికెటర్
ఒకానొక దశలో తాను కూడా తీవ్రమైన ఒత్తిడితో సతమతమయ్యానని టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప తెలిపాడు. నిరాశ నిస్పృహలో కూరుకుపోయి.. అసలు ఎందుకు బతికి ఉన్నానో తెలియని మానసిక స్థితిలోకి వెళ్లిపోయానన్నాడు. దాదాపు ఏడాది పాటు తన ముఖాన్ని అద్దంలో చూసుకునేందుకు కూడా భయపడిపోయానంటూ 2011 నాటి తన దుస్థితిని వివరించాడు.
కాగా ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ గ్రాహమ్ థోర్ప్ ఇటీవల హఠాన్మరణం చెందిన విషయం విదితమే. అయితే, అతడిది సహజ మరణం కాదని.. బలవన్మరణానికి పాల్పడ్డాడని గ్రాహమ్ భార్య అమెండా వెల్లడించారు. ఒత్తిడిని తట్టుకోలేకే ప్రాణాలు తీసుకున్నాడంటూ ఉద్వేగానికి లోనయ్యారు.
డిప్రెషన్.. నరకప్రాయం
ఈ నేపథ్యంలో రాబిన్ ఊతప్ప తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. డిప్రెషన్, దాని వల్ల ఎదురయ్యే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో వివరించే ప్రయత్నం చేశాడు. కారణం లేకుండానే తీవ్రమైన ఒత్తిడికి లోనుకావడం నరకప్రాయంగా ఉంటుందని తెలిపాడు. అంతబాగానే ఉన్నా మనల్ని ప్రేమిస్తున్న వారికి భారంగా మారామనే ఆలోచన కుంగిపోయేలా చేస్తుందని వాపోయాడు.
అయితే, ఇలాంటి సమయంలో బలహీనపడకుండా కాస్త స్థిమితంగా ఉంటే.. మనల్ని మనం కాపాడుకోవడంతో పాటు.. మనల్ని ప్రేమించే వాళ్లకూ గుండెకోత లేకుండా చేయగలమని ఊతప్ప పేర్కొన్నాడు. తన జీవితంలోని చేదు అనుభవాలు గుర్తు చేసుకుంటూ.. ‘‘2011... అసలు నేను ఎందుకు మనిషి జన్మ ఎత్తానా? అనే భావనలో ఉండిపోయేవాడిని. నన్ను నేను అద్దంలో చూసుకోవడానికి కూడా ఇష్టపడే వాడిని కాదు.
అద్దం చూడలేదు
ఆ ఏడాదంతా అస్సలు అద్దం వైపే చూడలేదు. నా ఉనికి నా చుట్టూ ఉన్నవాళ్లకు భరించలేనిదిగా మారిందేమోనని సతమతమయ్యేవాడిని. నాకసలు విలువ లేదని అనిపించేది. నిస్సహాయత, నిరాశలో కూరుకుపోయాను. వారాలు.. నెలల.. సంవత్సరాల పాటు నా గదికే పరిమితమైతే బాగుంటుందని అనుకునేవాడిని.
త్వరలోనే కష్టకాలం ముగిసిపోతుంది
అయినా.. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. బాధ ఒక్కరోజు ఉంటుందేమో!.. ఆ మరుసటి రోజు బాగుండవచ్చు కదా!.. మనం సాగుతున్న దారిలో చివరికంటా వెలుగు ఉండాలని ఆశించకూడదు. మరో అడుగు ముందుకు వేయడానికి దారి కనిపిస్తే చాలనుకుంటే ప్రశాంతంగా ఉంటుంది.
అలాగే.. గడ్డుకాలం ఎల్లకాలం ఉండదు. త్వరలోనే కష్టకాలం ముగిసిపోతుంది అని అనుకుంటూ ముందుకు సాగితే మంచిది’’ అని రాబిన్ ఊతప్ప ఒత్తిడిని అధిగమించే మార్గం కూడా చెప్పాడు. కాగా 2006లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. వన్డేలు, టీ20లకే పరిమితమయ్యాడు.
టీమిండియాలో రాని అవకాశాలు
టీమిండియా తరఫున 46 వన్డేలు ఆడి 934, 13 టీ20లు ఆడి 249 పరుగులు చేసిన ఊతప్ప.. మొట్టమొదటి టీ20 ప్రపంచకప్-2007 గెలిచిన భారత జట్టులో సభ్యుడు. ఇంటర్నేషనల్ కెరీర్ ఆరంభించిన రెండేళ్లపాటు వరుస అవకాశాలు అందుకున్న ఈ కర్ణాటక క్రికెటర్.. 2009 నుంచి గడ్డుపరిస్థితులు ఎదుర్కొన్నాడు. జట్టులో చోటు కరువుకాగా.. 2015లో భారత్ తరఫున తన ఆఖరి మ్యాచ్ ఆడేశాడు. అయితే, ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడిన ఊతప్ప రెండుసార్లు టైటిల్ గెలిచిన జట్టులో సభ్యుడు.
చదవండి: ఇప్పట్లో రిటైర్ అయ్యే ఆలోచనే లేదు.. ఒలింపిక్స్‌లో ఆడతా: స్మిత్
Comments
Please login to add a commentAdd a comment