YSR District: Billa Raju Selected For Rajasthan Royals Of Deaf IPL - Sakshi
Sakshi News home page

Deaf IPL: జాలిచూపులు.. హేళనలు.. అన్నీ దాటి రాజస్తాన్‌ రాయల్స్‌కు ఎంపికైన బిల్లా రాజు

Published Thu, Apr 13 2023 1:49 PM | Last Updated on Thu, Apr 13 2023 2:36 PM

YSR District: Billa Raju Selected For Rajasthan Royals Of Deaf IPL - Sakshi

పుట్టుకతో మూగ, చెవుడు.. చుట్టూ ఉన్నవారి హేళనలు.. జాలిచూపులు.. వీటన్నింటినీ దాటుకుని తనకంటూ ప్రత్యేకతను చాటిచెబుతూ ఓ వైపు క్రికెట్‌లో మరోవైపు వాలీబాల్‌ పోటీల్లో కడప నగరానికి చెందిన బిల్లా రాజు రాణిస్తున్నాడు.

ఇండియన్‌ డెఫ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఐడీసీఏ 4వ టీ–20 డెఫ్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ టోర్నమెంట్‌లో పాల్గొనే రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టుకు ఎంపికయ్యాడు. దీంతో ఈయన ఈనెల 23 నుంచి 27వ తేదీ వరకు కోల్‌కతాలో నిర్వహించే టీ–20 టోర్నమెంట్‌లో పాల్గొననున్న నేపథ్యంలో రాజు క్రీడాప్రస్థానంపై ప్రత్యేక కథనం. - కడప స్పోర్ట్స్‌

కడప నగరం మరియాపురంనకు చెందిన కుమారి (గృహిణి), సుబ్బరాయుడు (మున్సిపల్‌ వాటర్‌ విభాగంలో పంప్‌ ఆపరేటర్‌) దంపతుల కుమారుడైన బిల్లా రాజుకు పుట్టుకతోనే మూగ, చెవుడు. దీంతో వారి తల్లిదండ్రులకు కొద్దిరోజుల పాటు ఇబ్బందులు తప్పలేదు.

తొమ్మిదో తరగతిలో
చుట్టూ ఉన్నవారి జాలిచూపులు, హేళనలు బాధించినా రాజును ఉన్నతంగా చూడాలన్న తల్లిదండ్రులు.. కడప నగరంలోని హెలెన్‌కెల్లెర్స్‌ బధిరుల పాఠశాలలో చేర్పించారు. రాజు సోదరుడు రవి క్రికెట్‌ ఆడుతున్న సమయంలో అతనితో పాటు వెళ్తూ మెల్లగా క్రికెట్‌ సాధన చేయడం ప్రారంభించాడు రాజు.

తమ్మునిలోని క్రికెట్‌ నైపుణ్యాన్ని గుర్తించి ప్రోత్సహించాడు. దీంతో 9వ తరగతికి వచ్చేనాటికి క్రికెట్‌, వాలీబాల్‌ క్రీడలపై అభిమానం పెంచుకున్నాడు. దీంతో కడప నగరంలోని డీఎస్‌ఏ క్రికెట్‌ స్టేడియంలో క్రికెట్‌కు, వాలీబాల్‌ క్రీడల్లో శిక్షణకు వచ్చేవాడు. వాలీబాల్‌ పోటీల్లో పలుమార్లు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నాడు.

తొలుత హైదరాబాద్‌ కెప్టెన్‌.. ఇప్పుడు రాజస్తాన్‌కు
క్రికెట్‌ కోచ్‌ ప్రసాద్‌, ఇలియాస్‌లు ప్రోత్సహించడంతో ప్రొఫెషనల్‌ క్రికెటర్‌గా మారాలని భావించాడు. పదోతరగతి అనంతరం ఇంటర్మీడియట్‌ హైదరాబాద్‌లోని స్వీకార్‌ ఉపకార్‌ కళాశాలలో చేరాడు. అక్కడే ఆయన క్రికెట్‌ జీవితం మలుపుతిరిగింది.

హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ అకాడమీలో శిక్షణ పొందుతూ డెఫ్‌ క్రికెట్‌లో పాల్గొనడం ప్రారంభించాడు. అనతి కాలంలోనే హైదరాబాద్‌ డెఫ్‌ జట్టుకు కెప్టెన్‌గా రాణించాడు. ఎడమచేతి వాటం గల రాజు బ్యాటింగ్‌, బౌలింగ్‌లో రాణిస్తూ ఆల్‌రౌండర్‌గా హైదరాబాద్‌ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. గత సీజన్‌లో హైదరాబాద్‌ డెఫ్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ఈయన తాజాగా రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టుకు ఎంపికయ్యాడు.

అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడమే లక్ష్యంగా
ఇండియన్‌ డెఫ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈనెల 23 నుంచి 27వ తేదీ వరకు కోల్‌కతాలో నిర్వహించనున్న ఐడీసీఏ 4వ డెఫ్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ పోటీల్లో పాల్గొనే రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టుకు ఈయన ప్రాతినిథ్యం వహించనున్నాడు.

ఇప్పటి వరకు సౌత్‌జోన్‌ టీ–20, రాష్ట్రస్థాయి పోటీల్లో రాణిస్తూ వస్తున్న ఈయన అంతర్జాతీయ పోటీల్లో భారత డెఫ్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు.

యువతకు ఆదర్శం
రాజు ఓవైపు క్రికెట్‌లో రాణిస్తూ కుటుంబపోషణ కోసం కడప నగరంలోని ఓ ప్రైవేట్‌ ఫొటోస్టూడియోలో గ్రాఫిక్‌ డిజైనర్‌గా పనిచేస్తూ నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. జిల్లాకు చెందిన రాజు రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టుకు ఎంపికవడం పట్ల జిల్లా క్రికెట్‌ సంఘం ప్రతినిధులు అభినందనలు తెలిపారు.

చదవండి: IPL 2023: నీ తప్పిదం వల్ల భారీ మూల్యం! అమ్మో ఈ ‘మహానుభావుడు’ ఉంటేనా..
చెన్నై సూపర్‌ కింగ్స్‌కు దెబ్బ మీద దెబ్బ.. మరో స్టార్‌ ప్లేయర్‌ ఔట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement