
న్యూఢిల్లీ: ‘‘తను అరంగేట్రం చేసిన నాటి నుంచే తనదైన శైలిని అలవర్చుకున్నాడు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని సద్వినియోగం చేసుకున్నాడు. 2011 ప్రపంచకప్ సమయంలో భారత జట్టులోని ఆటగాళ్లలో తను చాలా చిన్నవాడు. తనకు రోహిత్‌కు మధ్య పోటీ ఉండేది. అయితే, అప్పటికి కోహ్లి ఫాంలో ఉండటంతో తనకే అవకాశం వచ్చింది. అప్పటికీ ఇప్పటికీ తనలో చాలా మార్పులు. అయితే అతడి పరుగుల దాహం ఇంకా తీరలేదు’’ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్, ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లిపై ప్రశంసలు కురిపించాడు.
సాధారణంగా అందరూ రిటైర్ అయ్యే సమయానికి దిగ్గజాలుగా పిలవబడతారని, కానీ కోహ్లి మాత్రం ముప్పై ఏళ్లకే లెజెండ్ అయ్యాడంటూ కొనియాడాడు. టీమిండియా విదేశీ పర్యటనల నేపథ్యంలో టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడిన యువీ గత జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నాడు. అతడు మాట్లాడుతూ... ‘‘నా ముందే కోహ్లి పెరిగి పెద్దవాడయ్యాడు. ట్రెయినింగ్ సమయంలో ఎంతో నిబద్ధతతో, క్రమశిక్షణతో మెలిగేవాడు. కఠోరంగా శ్రమించేవాడు. తను పరుగులు తీయడం చూస్తుంటే.. ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ తనే అవ్వాలన్న కసి.. అందులో ప్రతిబింబిస్తుంది. అతడి ఆటిట్యూడ్ అలాంటిది’’ అని పేర్కొన్నాడు.
ఇక కోహ్లి రికార్డుల గురించి చెబుతూ.. ‘‘కెప్టెన్ అయిన తర్వాత తను ఎక్కువ పరుగులు నమోదు చేశాడు. ఎందుకంటే.. కెప్టెన్‌గా తనకు జట్టులో స్థానం సుస్థిరం.. నిలకడగా ఆడుతూ ఎన్నెన్నో విజయాలు సాధించాడు. 30 ఏళ్ల వయస్సులోనే కెరీర్‌లో ఎంతో ఎత్తుకు ఎదిగాడు. ఫినిషింగ్ కూడా అదే స్థాయిలో ఉంటుంది’’ అని యువరాజ్ సింగ్ ఆకాంక్షించాడు. కాగా 2008లో 20 ఏళ్ల వయస్సులో కోహ్లి అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
ఇక కోహ్లి సారథ్యంలో టీమిండియా టెస్టు సిరీస్ నిమిత్తం ఇంగ్లండ్‌లో ఉండగా.. శిఖర్ ధావన్ నేతృత్వంలోని భారత జట్టు పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్‌లు ఆడే క్రమంలో శ్రీలంక పర్యటనకు వెళ్లింది. తొలి వన్డేలో ధావన్ సేన 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment