సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్వాన్న పనితీరుకు మరో నిదర్శనం! దేశవాళీ టి20 టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీ కోసం హెచ్‌సీఏ శనివారం 20 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. అయితే గత మంగళవారమే జట్టు కోచ్‌గా రంజీ మాజీ ప్లేయర్ అనిరుధ్ సింగ్‌ను ఎంపిక చేసిన హెచ్‌సీఏ ఇంతలోనే అతడిని తొలగించింది. అసిస్టెంట్ కోచ్‌గా ఉన్న జాకీర్ హుస్సేన్‌ను కొత్త కోచ్‌గా ప్రకటించింది. టీమ్‌ను ఎంపిక చేసే క్రమంలో హెచ్‌సీఏ నిర్వహిస్తున్న అంతర్గత టోర్నీ మ్యాచ్‌లకు అనిరుధ్ హాజరయ్యాడు కూడా. కానీ హెచ్‌సీఏ పెద్దల ప్రాధాన్యాలు మారిపోయాయి.
అనిరుధ్ కోచ్‌గా పనికి రాడంటూ అతడిని పక్కన పెట్టేశారు. జట్టు ఎంపికలో తన అభిప్రాయం చెప్పే ప్రయత్నం చేయడమే కోచ్‌గా అనిరుధ్ చేసిన తప్పని తెలుస్తోంది! గత సీజన్‌లో కూడా అండర్–19 కోచ్‌గా వ్యవహరించిన అనిరుధ్‌ను సీజన్ మధ్యలోనే తప్పించింది. మరోవైపు కెప్టెన్‌గా మళ్లీ తన్మయ్ అగర్వాల్‌నే హెచ్‌సీఏ నియమించింది. గత రంజీ ట్రోఫీ సీజన్‌లో అతని సారథ్యంలో ఆడిన 8 మ్యాచ్‌లలో 6 మ్యాచ్‌లు చిత్తుగా ఓడినా ‘తమవాడు’ కాబట్టి మరోసారి కెప్టెన్సీని అప్పగించింది.
జట్టు వివరాలు: తన్మయ్ (కెప్టెన్), తిలక్ వర్మ, అభిరథ్ రెడ్డి, హిమాలయ్, సందీప్, రాహుల్ బుద్ధి, సాయి ప్రజ్ఞయ్ రెడ్డి, సుమంత్, మిలింద్, టి.రవితేజ, అజయ్‌దేవ్ గౌడ్, యుధ్‌వీర్ సింగ్, తనయ్ త్యాగరాజన్, మికిల్ జైస్వాల్, హితేశ్ యాదవ్, రాకేశ్ యాదవ్, ప్రతీక్ రెడ్డి, రక్షణ్, కార్తికేయ, ఎంఎస్‌ఆర్ చరణ్.
Comments
Please login to add a commentAdd a comment