జింబాబ్వే టీ10 లీగ్‌లో ఆ దేశ స్టార్ ఆల్‌రౌండర్ సికందర్ రజా చెలరేగిపోయాడు. హరారే హరికేన్స్‌తో నిన్న (జులై 24) జరిగిన మ్యాచ్‌లో శివాలెత్తిపోయిన రజా (బులవాయో బ్రేవ్స్ కెప్టెన్).. లీగ్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ (15 బంతుల్లో) కొట్టాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 21 బంతులను ఎదుర్కొన్న రజా.. 5 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 70 పరుగులు చేశాడు. రజాకు కోబ్ హెఫ్ట్ (23 బంతుల్లో 41; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) తోడవ్వడంతో బులవాయో బ్రేవ్స్ 135 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 5 బంతులు మిగిలుండగానే ఊదేసింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హరికేన్స్.. భారత వెటరన్ రాబిన్ ఉతప్ప (15 బంతుల్లో 32; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), విండీస్ వీరుడు ఎవిన్ లివిస్ (19 బంతుల్లో 49; 2 ఫోర్లు, 6 సిక్సర్లు), ఫెరియెరా (21 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు), ఇర్ఫాన్ పఠాన్ (9 బంతుల్లో 18 నాటౌట్; 4 ఫోర్లు) చెలరేగిపోవడంతో నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 134 పరుగుల భారీ స్కోర్ చేసింది. బ్యాట్‌తో విధ్వంసం సృష్టించిన సికందర్ రజా ఓ వికెట్ పడగొట్టగా.. ప్యాట్రిక్ డూలీ 2, తిస్కిన్ అహ్మద్ ఓ వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం 135 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బ్రేవ్స్.. సికందర్ రజా, కోబ్ హెఫ్ట్, వెబ్‌స్టర్ (12 నాటౌట్; ఫోర్, సిక్స్) విజృంభించడంతో 9.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. బ్రేవ్స్ ఇన్నింగ్స్‌లో బెన్ మెక్‌డెర్మాట్ (8) నిరాశపరచగా.. హరికేన్స్ బౌలర్లలో మహ్మద్ నబీ, నండ్రే బర్గర్ తలో వికెట్ పడగొట్టారు.
ఫాస్టెస్ట్ ఫిఫ్టి రికార్డు యూనివర్సల్ బాస్‌దే..
టీ10 క్రికెట్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టి రికార్డు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉంది. అబుదాబీ టీ10 లీగ్ 2021 సీజన్‌లో బాస్ 12 బంతుల్లో 50 కొట్టాడు. అంతకుముందు ఇదే లీగ్ 2018 సీజన్‌లో ఆఫ్ఘన్ క్రికెటర్ మహ్మద్ షెహజాద్ కూడా 12 బంతుల్లోనే ఈ ఫీట్ సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment