కందుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి చుక్కాని లేని నావలా తయారైంది. ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం అటుంచి ముందు పార్టీలో నెలకొన్న గ్రూపు తగాదాలతో నిండా మునిగి తేలుతోంది. పార్టీలో ఉన్న నాయకులు ఎవరి బలాన్ని వాళ్లు పెంచుకునే పనిలో పడడంలో ఆ పార్టీ కార్యకర్తలు పూర్తిగా అయోమయ స్థితిలో ఉన్నారు.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ప్రస్తుతం కందుకూరులో టీడీపీ నేతలైన ఇంటూరి బ్రదర్స్ మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు పార్టీకి తలనొప్పిగా మారింది. పార్టీ ఇన్‌చార్జిగా ఉన్న ఇంటూరి నాగేశ్వరరావును వరుసకు సోదరుడైన ఇంటూరి రాజేష్ వ్యతిరేకిస్తుండడమే ఇందుకు కారణం. వీరిద్దరి ఆధిపత్య పోరుతో నియోజకవర్గంలోని పార్టీ నాయకులు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఈ పరిస్థితుల్లో సీనియర్ నాయకుడు దివి శివరాం, మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు అడపాదడపా నియోజకవర్గంలో పర్యటిస్తూ తమ ఉనికిని చాటుకునే పనిలో ఉన్నారు. దీంతో అసలు పార్టీలో ఏం జరుగుతుందో సామాన్య కార్యకర్త అర్థం కాని పరిస్థితి.
టీడీపీ ఉనికి ప్రశ్నార్థకం
ఇంటూరి నాగేశ్వరరావు, ఇంటూరి రాజేష్ ఇద్దరూ ఒకే గ్రామానికి చెందినవారు. ఇద్దరి మధ్య సోదర బంధుత్వం ఉన్నా రాజకీయంగా మాత్రం పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. దీనికి ప్రధాన కారణం ఆధిపత్య పోరు అని తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో ఓటమి తరువాత నియోజకవర్గంలో టీడీపీ ఉనికి ప్రశ్నార్థకమైంది. ఈ పరిస్థితుల్లో సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే దివి శివరాం అండతో వలేటివారిపాళెం బడేవారిపాళెం గ్రామానికి చెందిన రియల్టర్ ఇంటూరి నాగేశ్వరరావు పార్టీ ఇన్‌చార్జిగా నియమితులయ్యారు.
అయితే అంతకుముందు నుంచే అదే గ్రామానికి చెందిన నాగేశ్వరరావు సోదరుడు రాజేష్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉండడంతోపాటు ఆర్థికంగా ఖర్చు పెడుతున్నాడు. ఈ నేపథ్యంలో తనను మోసం చేసి నాగేశ్వరరావు దొడ్డిదారిలో ఇన్‌చార్జి పదవి తెచ్చుకున్నాడని రాజేష్ రగిలిపోయాడు. ఈ వైరం ప్రస్తుతం తారస్థాయికి చేరింది. స్వయంగా పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇద్దరూ కలిసి పనిచేయాలని ఆదేశించినా ససేమిరా అంటున్నారు. పార్టీ అధికారిక కార్యక్రమాలను నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహిస్తుండగా, వాటిలో పాల్గొనేందుకు రాజేష్ ఇష్టపడడం లేదు. తాను సొంతంగా నియోజకవర్గంలో పర్యటిస్తూ తన వర్గాన్ని పెంచుకునే పనిలో రాజేష్ ఉన్నాడు.
అగమ్యగోచరం
నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతున్నా నాయకుల మధ్య ఆధిపత్య పోరు మాత్రం తగ్గడం లేదు. పార్టీ అధిష్టానం నాగేశ్వరరావుకు టికెట్ ఇస్తే ఓడించేందుకు కూడా వెనుకాడేది లేదని రాజేష్ తన వర్గం నాయకులతో స్పష్టం చేస్తున్నారు. వీరి మధ్య పోరు ఇలా ఉంటే 2019 ఎన్నికల ఓటమి తరువాత నియోజకవర్గానికి దూరమైన మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు అప్పుడప్పుడూ నియోజకవర్గంలో పర్యటిస్తూ అధిష్టానం టికెట్ ఇస్తే మరోసారి పోటీ చేసేందుకు సిద్ధమేనని తనవర్గం నాయకుల వద్ద చెప్పుకుంటున్నారు. దీంతో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment