నెల్లూరు: బోగోలు మండలం కొండబిట్రగుంటలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఒకే ఇంట్లో ముగ్గురు కుటుంబసభ్యులను దారుణంగా హతమార్చిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. గుండెపోటుతో మృతిచెందిన కుమారుడి చావుకు కోడలే కారణమనే అనుమానం, ఆవేశంతోపాటు పాతగొడవల నేపథ్యంలో విచక్షణ కోల్పోయిన కుటుంబసభ్యులు కోడలిపైన, ఆమె తండ్రి, అమ్మమ్మలపై ఆదివారం వేకువజామున దాడికి తెగబడి హతమార్చిన ఘటన గ్రామస్తులను ఉలిక్కిపడేలా చేసింది.
స్థానికులు, పోలీసుల కథనం మేరకు కొండబిట్రగుంటకు చెందిన రైల్వే ఉద్యోగి మందాటి మధుసూదన్‌కు, బుచ్చిరెడ్డిపాళెంకు చెందిన మౌనికకు(32) తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఎనిమిదేళ్ల వయసున్న కుమారుడు మన్విత్ ఉన్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో నాలుగేళ్ల నుంచి భార్యాభర్తలు విడిగా ఉంటున్నారు. మధుసూదన్ బిట్రగుంట రైల్వేస్టేషన్ టెలికాం విభాగంలో పనిచేస్తూ కొండబిట్రగుంటలో తల్లిదండ్రులతో కలిసి ఉంటుండగా, మౌనిక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తూ బెంగళూరులో ఉంటున్నారు. వీరి కుమారుడు మన్విత్ బుచ్చిరెడ్డిపాళెంలోని అమ్మమ్మ వద్ద ఉంటున్నాడు.
ఈ క్రమంలో పది రోజుల క్రితం మధుసూదన్(35) గుండెపోటుతో మృతిచెందగా మౌనిక తన తండ్రి కృష్ణయ్య, అమ్మమ్మ శాంతమ్మ, కుమారుడు మన్విత్‌తో కొండబిట్రగుంటకు వచ్చి అక్కడే ఉంటున్నారు. ఈక్రమంలో ఏం జరిగిందో ఏమో కానీ ఆదివారం వేకువజామున మౌనిక(32), ఆమె తండ్రి కృష్ణయ్య(65), అమ్మమ్మ శాంతమ్మ(75) ఇంట్లోనే దారుణహత్యకు గురయ్యారు. మౌనిక అత్త, మామ, మరిది ఇంటికి తాళాలు వేసి మన్విత్‌ను తీసుకుని పరారయ్యారు. ఆదివారం ఉదయం బుచ్చిరెడ్డిపాళెం నుంచి మౌనిక తల్లి ఎన్నిసార్లు ఫోన్‌చేసినా ఎవరూ ఫోన్ తీయకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు.
పోలీసులు గ్రామానికి చేరుకుని పరిశీలించగా మౌనిక, ఆమె తండ్రి, అమ్మమ్మ మృతదేహాలు రక్తపు మడుగుల్లో పడి ఉన్నాయి. మౌనిక మామ(మధుసూదన్ తండ్రి) మాల్యాద్రి, మరిది చంద్రమౌళి, అత్త ధనమ్మ కనిపించకపోవడంతో వారే ఈ హత్యలు చేసినట్లుగా అనుమానిస్తున్నారు. ఎస్పీ తిరుమలేశ్వర్‌రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌టీం, డాగ్ స్క్వాడ్ బృందాలు ఆధారాలు సేకరిస్తున్నాయి. మరోవైపు ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. కాగా మౌనిక అత్త ధనమ్మను గ్రామంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలిసింది.
పూర్తిస్థాయి విచారణ
ఒకే ఇంట్లో మూడు హత్యలపై పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. హత్యలకు కారణాలతోపాటు బయటి వ్యక్తులు ఎవరైనా సహకరించారా, హత్యల అనంతరం నిందితులు ఎక్కడికి పారిపోయారు, మౌనిక కుమారుడు మన్విత్ ఎక్కడ ఉన్నాడు, ఒకే ఇంట్లో మూడు హత్యలు జరిగినా చుట్టుపక్కల వాళ్లకు అనుమానం రాకపోవడం, ఎలాంటి అరుపులు వినిపించకపోవడం తదితర అంశాలపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. అలాగే క్లూస్ టీం సాయంతో సాక్ష్యాధారాలు కూడా పక్కాగా సేకరిస్తున్నారు.
చిదిమేసిన మనస్పర్థలు
చిన్నచిన్న మనస్పర్థలు, మాట పట్టింపులు రెండు కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపాయి. మనుషుల మధ్య బంధాలు సన్నగిల్లడం, తమ మాటే నెగ్గాలనే పట్టుదలే కొండబిట్రగుంటలో జరిగిన హత్యలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. మందాటి మధుసూదన్ – మౌనిక దంపతులు అన్యోన్యంగానే ఉండేవారని అని తెలిసింది. మధుసూదన్ ఫేస్‌బుక్ పేజీలో కూడా భార్య, కుమారుడితో దిగిన ఫొటోలే ఎక్కువగా ఉన్నాయి. చిన్నచిన్న మనస్పర్థలతో మౌనిక వేరే కాపురం పెడదామని అడగడం, మధుసూదన్ అందుకు అంగీకరించకపోవడంతో నాలుగేళ్లుగా వారు విడిగా ఉంటున్నారు.
ఈక్రమంలోనే తరచూ మానసిక ఒత్తిడికి గురవుతున్న మధుసూదన్ పది రోజుల క్రితం గుండెపోటుతో మృతిచెందాడు. ఈ విషయం తెలుసుకున్న మౌనిక కొండబిట్రగుంటకు రాగా, ఆమెకు తోడుగా తండ్రి, అమ్మమ్మ కూడా వచ్చారు. కుమారుడిని కోల్పోయి విషాదంలో ఉన్న కుటుంబసభ్యులు క్షణికావేశంలోనో, కుమారుడి ఉద్యోగం, ఆస్తి కోడలికి దక్కకూడదనే ఉద్దేశంతోనే కోడలిని, ఆమె తండ్రిని, అమ్మమ్మని కూడా హతమార్చారు. కూతురిని, భర్తను, అమ్మను ఒకేసారి కోల్పోయిన మౌనిక తల్లి ఘటనా స్థలంలో కుప్పకూలిపోయింది. ఈమెను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment