జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో గురువారం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృత్యువాత పడ్డారు. బుచ్చిరెడ్డి పాళెం మండలంలో ముంబై హైవేపై ట్యాంకర్‌ను ట్రావెల్ బస్సు ఢీకొనడంతో రెండు వాహనాల కేబిన్లలో చిక్కుకుని డ్రైవర్లు మృతి చెందారు. కొడవలూరు మండలంలో ఇఫ్కో కిసాన్ సెజ్ వద్ద జాతీయ రహదారిపై ఆగిఉన్న ట్రాలీని యాసిడ్ ట్యాంకర్ ఢీకొనడంతో ట్రాలీ డ్రైవర్ ప్రాణాలు విడిచాడు. మనుబోలు మండలంలో లారీ ఢీకొనడంతో ఓ అర్చకుడు దుర్మరణం పాలయ్యాడు.
నెల్లూరు: మండలంలోని ఆర్‌ఆర్‌నగర్, మఠం గ్రామాల మధ్యన ముంబై జాతీయ రహదారిపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టైర్ పేలడంతో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో కేబిన్‌లలో చిక్కుకుని ఇద్దరు డ్రైవర్లు మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు..హైదరాబాద్‌కు చెందిన రాజేశ్వరి ప్రైవేట్ ట్రావెల్స్ రోజూలాగే బుధవారం రాత్రి హైదరాబాద్ నుంచి బుచ్చిరెడ్డిపాళేనికి ప్రయాణికులతో బయలుదేరింది.
గురువారం ఉదయం నెల్లూరుకు చేరుకుంది. అక్కడ నెల్లూరు ప్రయాణికులను దించివేసింది. అనంతరం ముగ్గురు ప్రయాణికులతో బుచ్చిరెడ్డిపాళేనికి బయలుదేరింది. దగదర్తి మండలం యలమంచిపాడు గ్రామానికి చెందిన షేక్ చాంద్‌బాషా (39) ట్రావెల్స్ బస్సుకు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. భార్య ఆరోగ్యం సరిగా లేదని ఇంటి నుంచి ఫోన్ రావడంతో ఆయన గంటకు 90 కిలోమీటర్ల వేగంతో బస్సును నడపసాగాడు. ఉదయం 8 గంటలకు ఆర్‌ఆర్‌నగర్, మఠం గ్రామాల మధ్యకు బస్సు చేరుకోగానే కుడి వైపు ముందు టైర్ పేలిపోయింది.
దీంతో బస్సు పూర్తిగా అదుపు తప్పి రాంగ్‌రూట్‌లోకి వెళ్లింది. అదే సమయంలో బళ్లారి నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్‌ను బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ట్యాంకర్, బస్సు కేబిన్లు నుజ్జునుజ్జు అయ్యాయి. డ్రైవర్లు అందులో చిక్కుకుపోయారు. ముంబైకి చెందిన ట్యాంకర్ డ్రైవర్ అహ్మద్‌బాషా (44) తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సు డ్రైవర్ తీవ్రగాయాలతో కేబిన్‌లో చిక్కుకుపోగా, మరో ముగ్గురు ప్రయాణికులు, క్లీనర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
ప్రమాద సమయంలో వచ్చిన పెద్ద శబ్దం విని సమీప గ్రామాల ప్రజలు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు, 108 వాహనానికి సమాచారం అందించారు. వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 108 వాహన సిబ్బంది బస్సులోకి వెళ్లి కొన ఊపరితో ఉన్న డ్రైవర్‌కు ప్రథమ చికిత్స అందిస్తుండగా, పోలీసులు అరగంట సేపు శ్రమించి కేబిన్ నుంచి డ్రైవర్‌ను బయటకుతీశారు. అయినప్పటికీ ఫలితం లేదు. అరగంట పాటు కేబిన్‌లో నరకయాతన అనుభవించిన డ్రైవర్ ప్రాణాలు విడిచాడు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించినట్లు ఎస్సై వీరప్రతాప్ తెలిపారు.
స్తంభించిన ట్రాఫిక్
ముంబయి రోడ్డుపై ప్రమాదం జరగడంతో ట్రాఫిక్ స్తంభించింది. ఇరువైపులా దాదాపు గంట పాటు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎస్సై వీరప్రతాప్ తన సిబ్బందితో ముందుగా బుచ్చిరెడ్డిపాళెం నుంచి నెల్లూరు వెళ్లే వాహనాలను జొన్నవాడ మీదుగా మళ్లించారు. ట్రాక్టర్, క్రేన్ సాయంతో ప్రమాదానికి గురైన వాహనాలను రోడ్డు పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment