కస్టమర్‌కు టీ రెడీ చేస్తూ..
నెల్లూరువాసులు ఆహార ప్రియులు.. కొత్త రుచులను స్వాగతించడంలో వీరికి సాటి లేరు. నిద్ర లేచింది మొదలు రాత్రి భోజనం పూర్తి చేసిన తరువాత కూడా టీ తాగందే నిద్రపోని వ్యక్తులు ఉన్నారు. స్నేహితులతో ముచ్చట్లు పెట్టాలన్నా.. తోటి ఉద్యోగులతో పిచ్చాపాటి మాట్లాడాలన్నా.. వ్యాపారులు తమ లావాదేవీలపై.. నాయకులు రాజకీయాలపై చర్చించాలన్నా చాయ్ కేఫ్‌లు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. అలాగే మహా నగరాలకే పరిమితమైన ఇరానీ చాయ్ కేఫ్‌లు ఇప్పుడు నెల్లూరు వాసులను తమ రుచితో ఆకర్షిస్తున్నాయి.
నెల్లూరు సిటీ: ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అనే తేడా లేకుండా చాయ్ సెంటర్లు నిత్యం కిటకిటలాడుతుంటాయి. ప్రతి ప్రాంతంలో కనీసం రెండు నుంచి మూడు కేఫ్‌లు ఉంటున్నాయి. జిల్లావ్యాప్తంగా సుమారు 5 వేల చాయ్ సెంటర్‌లు, కేఫ్‌లు ఉంటాయని అంచనా. మహా నగరాల్లో ఉండే వివిధ రకాల చాయ్ సెంటర్లు ప్రస్తుతం నెల్లూరులో వెలుస్తున్నాయి. ఆయా కంపెనీల ఫ్రాంచైజీలను నగరవాసులు కొంత మొత్తం చెల్లించి నెల్లూరులో ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మహా నగరాలకు మాత్రమే పరిమితమైన ఇరానీ చాయ్ ఇప్పుడు నెల్లూరు వాసులను తన రుచితో కట్టిపడేస్తోంది. అయితే కొందరు టీ తాగితే కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయంటుంటారు. అలాంటి వారి కోసం లెమన్ టీ, బ్లూ టీ, గ్రీన్ టీ, బాదం టీ లాంటి వాటిని కూడా కేఫ్ నిర్వాహకులు అందిస్తున్నారు. ఉద్యోగులు, వ్యాపారులు, రాజకీయ నాయకులు.. ఇలా చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ గరమ్ చాయ్‌ని ఇష్టపడుతూ చాయ్ కేఫ్‌లను ఆదరిస్తున్నారు.
క్వాలిటీలో తగ్గేదేలే..
నెల్లూరు వాసులు రుచికి, క్వాలిటీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. రుచి బాగుంటే అమితంగా ఆదరిస్తారు. దీంతో ఆ వ్యాపారం సైతం అంతే స్థాయిలో అభివృద్ధి చెందుతుంది. అయితే రుచిలో, నాణ్యతలో ఎలాంటి తేడా జరిగినా నగరవాసులు అటువైపు కూడా చూడరు. ఇలాంటి పరిస్థితులు చాలా మంది వ్యాపారులు ఎదుర్కొన్నారు కూడా. గ్రాండ్‌గా సెలబ్రిటీలతో ప్రారంభించినా, ఆఫర్లు ఇచ్చినా, పెద్దగా పట్టించుకోరు. కేవలం రుచికి, నాణ్యతకే ప్రాధాన్యం ఇస్తారు. షుగర్ వ్యాధిగ్రస్తులకు సైతం షుగర్ లెస్ ఇరానీ చాయ్ సైతం పలు చాయ్ కేఫ్‌లలో అందుబాటులో ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
పోటాపోటీగా..
గతంలో నెల్లూరు నగరంలోని ప్రధాన సెంటర్లలో మాత్రమే టీ కేఫ్‌లు ఉండేవి. జనాభా పెరుగుదలతోపాటు ప్రజలు టీ, కాఫీలకు బాగా అలవాటు పడడంతో చాయ్ సెంటర్లకు ఆదరణ పెరిగిందని చెప్పవచ్చు. కొందరు చాయ్ సెంటర్ల నిర్వాహకులు పోటాపోటీగా ఇతర రాష్ట్రాల్లో మాత్రమే అందుబాటులో ఉండే చాయ్ రుచులను సైతం నెల్లూరు వాసులకు పరిచయం చేస్తున్నారు. నగరంలోని రామలింగాపురం, అన్నమయ్య సర్కిల్, మాగుంటలేఅవుట్, వీఆర్సీ సెంటర్, ట్రంకురోడ్డు, గాంధీబొమ్మ సెంటర్, వేదాయపాళెం, మూలాపేట, సంతపేట, కేవీఆర్ పెట్రోల్ బంక్ తదితర ప్రాంతాల్లో కొత్త రుచులతో టీ కేఫ్‌లు, ఇరానీ చాయ్ సెంటర్లు నూతనంగా వెలిశాయి. అయితే వాటిలో కొన్ని కేఫ్‌లు మాత్రమే రుచితో, నాణ్యతతో చాయ్ అందిస్తున్నాయని వినియోగదారులు చెబుతున్నారు.
ఎన్ని టెన్షన్లు ఉన్నా ఒక్క టీ చాలు
నేను ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాను. నాకు ఎన్ని టెన్షన్లు ఉన్నా వెంటనే చాయ్ సెంటర్‌కు వెళ్లి ఒక్క చాయ్ తాగితే చాలు మనసు ప్రశాంతంగా ఉంటుంది. రోజుకు కనీసం నాలుగు టీలు తాగుతాను. ధమ్ టీ, ఇరానీ చాయ్ నాకు చాలా ఇష్టం.
– భాను, రామలింగాపురం
స్నేహితులతో కలిసి..
రోజూ చిల్డ్రన్స్ పార్క్‌లో వాకింగ్‌కు వస్తుంటాను. వాకింగ్ పూర్తయ్యాక స్నేహితులతో కలిసి చాయ్ సెంటర్‌కు చేరుకుంటాం. రుచికరమైన చాయ్‌ని ఆస్వాదిస్తూ మాట్లాడుకుంటాం. స్నేహితులతో అలా కూర్చొని చాయ్ తాగుతూ మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. – రాము, చిల్డ్రన్స్ పార్క్ సెంటర్
ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉద్యోగులు తీవ్ర పని ఒత్తిడికి గురవుతుంటారు. ఈ క్రమంలో మైండ్‌ను ఫ్రెష్ చేసుకునేందుకు సహచర ఉద్యోగులతో కలిసి ఓ టీ తాగుదామని చాయ్ కేఫ్‌లకు వస్తున్నారు. అలాగే స్నేహితులు వివిధ రకాల వృత్తుల్లో ఉన్నప్పటికీ సాయంత్రం అయిందంటే చాయ్ సెంటర్ల వద్ద క్యూ కడుతున్నారు. స్నేహితులతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ చాయ్‌ని సిప్ చేస్తూ తమ టెన్షన్‌లను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక్కో వ్యక్తి ఒక్కో రకమైన టీని ఆస్వాదిస్తుంటారు. ఈ క్రమంలో చాయ్ సెంటర్ల నిర్వాహకులు కొత్త రుచులను పరిచయం చేస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment