నెల్లూరు: ప్రేమ.. అదో మధురమైన అనుభూతి.. ఈ ప్రేమ కొందరి జీవితాల్లో సంతోషాల పంట. యువతీ యువకులు చదువుకునే రోజుల్లోనే ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకుంటారు. కొందరు తల్లిదండ్రులను ఒప్పించి ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటే.. మరికొందరు వారిని ఎదిరించి దంపతులవుతారు. ఎలాగైతేనేం నిండునూరేళ్లు ఆనందంగా జీవిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
స్కూల్ డేస్ నుంచే..
నెల్లూరు నగరంలోని 54వ డివిజన్ జనార్దన్‌రెడ్డి కాలనీకి చెందిన పిన్నమిరాజు శివరామప్రసాద్, 53వ డివిజన్ వెంకటేశ్వరపురం ప్రాంతానికి చెందిన కల్పనల మధ్య చదువుకునే రోజుల్లోనే స్నేహం చిగురించింది. కాలేజీ రోజుల్లో ఒకరినొకరు ఇష్టపడి ప్రేమలో పడ్డారు. వీరిద్దరి ప్రేమ విషయం తెలిసిన కల్పన తల్లిదండ్రులు అడ్డుచెప్పడంతో 2006 ఫిబ్రవరి 9వ తేదీన స్నేహితుల సహకారంతో ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి అరుణ్, హర్ష ఇద్దరు సంతానం. శివరామప్రసాద్ వార్డ్ నం.54, బకాసుర, బుల్లెట్ బాబు తదితర సినిమాల్లో హీరోగా నటిస్తూ వర్దమాన నటుడిగా ఎదుగుతున్నారు. కల్పన నెల్లూరు మెప్మాలో ఆర్పీగా కొనసాగుతున్నారు. వీరి జీవితం అన్యోన్యంగా సాగుతోంది. ఈ దంపతుల ప్రేమ ప్రయాణం నిండు నూరేళ్లు సాగాలని ఆశిద్దాం.
ప్రేమను నిలుపుకున్నాం
వీరు ఆత్మకూరు పట్టణానికి చెందిన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ సందాని – షేక్ ముజీబున్నీసా దంపతులు. 30 ఏళ్ల క్రితం సందాని అనంతసాగరం నుంచి ఆత్మకూరుకు చదువుకొనేందుకు వచ్చారు. మెడికల్ ల్యాబ్ శిక్షణ పొంది ఓ ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తున్నాడు. అప్పట్లో ఎల్‌ఆర్‌పల్లిలో నివాసం ఉంటున్న ఆయనకు అదే ప్రాంతానికి చెందిన షేక్ ముజీబున్నీసా పరిచయమయ్యారు. వారి పరిచయం ప్రేమగా మారింది. వీరి ప్రేమను ఇరు కుటుంబాల్లో తొలుత అంగీకరించలేదు. ఎట్టకేలకు పెద్దలను ఒప్పించి 1998లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. ఎంతో అన్యోన్యంగా కాపురం చేస్తున్న వీరు ప్రేమికులకు చెప్పేదేమిటంటే ‘ప్రేమించడం గొప్ప కాదు.. దానిని నిలుపుకోవాలి.. పెద్దలను ఒప్పించి వివాహం చేసుకోవాలి. ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంటే ఆ కాపురం కలకాలం సంతోషంగా ఉంటుందని’ చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment