పోర్టు సెక్యూరిటీ అధికారికి వేలు చూపుతూ బెదిరిస్తున్న సోమిరెడ్డి
ఆదివారం సెలవని తెలిసీ ఆందోళన
కంటైనర్ టెర్మినల్ పేరుతో పోర్టులోకి వెళ్లేందుకు యత్నం
అడ్డుకుని భగ్నం చేసిన పోర్టు సెక్యూరిటీ
నెల్లూరు: అదాని కృష్ణపట్నంపోర్టులో ఆదివారం అధికారులు ఎవరూ ఉండరు. పోలీసు సిబ్బంది మొత్తం మేదరమెట్ల సిద్ధం సభ విధులకు వెళ్లారు. ఇదే అదనుగా రాజకీయ మైలేజీ సాధించవచ్చని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తలపెట్టిన కుట్ర భగ్నమైంది. కంటైనర్ టెర్మినల్ పరిరక్షణ సాకుతో చేసిన హైడ్రామా నవ్వులపాలైంది. కృష్ణపట్నంపోర్టు కంటైనర్ టెర్మినల్ పరిరక్షణ పేరుతో సోమిరెడ్డి ముత్తుకూరు, తోటపల్లిగూడూరు మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలను వెంటేసుకుని పోర్టు వద్దకు ప్రదర్శనగా వచ్చారు. కొంతమందిని ముందుంచి గోపాలపురం వద్దకు చేరుకున్నారు.
పోర్టులోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పోర్టులో ఉన్నతాధికారులు ఎవ్వరూ లేరని, ముందస్తు సమాచారం లేకుండా, వారి అనుమతి లేకుండా లోపలకు వెళ్లనిచ్చేది లేదని సెక్యూరిటీ అధికారులు అభ్యంతరం తెలిపారు. దీంతో సోమిరెడ్డి వర్గీయులు రెచ్చిపోగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. టీడీపీ శ్రేణులు పోర్టు సెక్యూరిటీపై విరుచుకుపడడంతో తోపులాట జరిగింది.
కొద్దిసేపు గందరగోళం నెలకొంది. సెలవు రోజు ఆందోళన చేయడం ఏమిటంటూ సెక్యూరిటీ సిబ్బంది ప్రశ్నిస్తూ వారి హైడ్రామాను భగ్నం చేశారు. దీంతో సోమిరెడ్డి చేసేది లేక పోర్టు సీఈఓ జీజే రావుకు ఫోన్ చేశారు. ఇచ్చిన గడువు ప్రకారం కంటైనర్ టెర్మినల్‌ను చూసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే కంటైనర్ టెర్మినల్‌కు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని, ఆదివారం కనుక తనతో పాటు అధికారులు ఎవరూ ఉండరని, పరిశీలనకు మరో మారు రావాలని సీఈఓ బదులు ఇచ్చారు. దీంతో ఎటూ పాలుపోని సోమిరెడ్డి తన కార్యకర్తలతో కొద్ది దూరం నడిచి, మీడియా ఎదుట అధికార పార్టీ నేతలపై ఆరోపణలు చేసి వెనుదిరిగారు.
Comments
Please login to add a commentAdd a comment