నెల్లూరు(పొగతోట): జిల్లాలో రేషన్ బియ్యం సరఫరాలో సమస్యలు నెలకొన్నాయి. చౌకదుకాణాలకు సరఫరా చేయాల్సిన దానికన్నా తక్కువ స్థాయిలో రేషన్‌ను అందించారు. రెండు నెలలుగా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రతి దుకాణానికి పది నుంచి 20 శాతం కోత విధించారని సమాచారం. ఈ క్రమంలో 20 శాతం మంది కార్డుదారులకు బియ్యం అందక ఎండీయూ వాహనాలు, చౌక దుకాణాల చుట్టూ తిరుగుతున్నారు.
ఆ విధానానికి స్వస్తి
జిల్లాలో 7.23 లక్షల రేషన్ కార్డులున్నాయి. ప్రతి నెలా 1,513 చౌక దుకాణాల ద్వారా 13 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎండీయూ వాహనాల ద్వారా పంపిణీ చేస్తున్నారు. చౌక దుకాణంలో మిగిలిన బియ్యం ఆధారంగా మరుసటి నెల్లో కేటాయింపులుంటాయి. అయితే రెండు నెలల నుంచి బ్యాక్ లాగ్ ఆధారంగా రేషన్ సరఫరా విధానానికి అధికారులు స్వస్తి పలికారు. ఇష్టానుసారంగా కోత విధించారు. దీంతో కార్డుదారులు అవస్థలు పడుతున్నారు. అందుబాటులో ఉన్న బియ్యాన్నే పంపిణీ చేశారు. ప్రస్తుతం 20 శాతం మందికి బియ్యం అందలేదని తెలుస్తోంది. బియ్యాన్ని తక్కువగా సరఫరా చేశారని డీలర్లు చెప్పడంతో ఆయా ప్రాంతాల సీఎస్డీటీలు ప్రతి దుకాణానికి మరో పది శాతాన్ని మంజూరు చేయాలంటూ ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా విన్నవించుకున్నారు. కాగా దీనిపై ఎలాంటి ఆదేశాలు ఇంతవరకు జారీ కాలేదు.
డీలర్లు ఏమంటున్నారంటే..
జిల్లాలో రేషన్ కొరత ఉన్నా, అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. అధికారులను సంప్రదిస్తే మా చేతుల్లో ఏమీ లేదంటూ చేతులెత్తేశారని డీలర్లు చెప్తున్నారు. కార్డుదారులు తమ చుట్టూ తిరుగుతున్నారని, వారికి సమాధానం చెప్పలేకపోతున్నామని డీలర్ల అసోసియేషన్ నేతలు వెల్లడిస్తున్నారు.
మాకు సంబంధం లేదు
రెండు నెలల నుంచి రేషన్‌లో కోత విధించారని డీలర్లు చెప్తున్నారు. అలాట్‌మెంట్ విషయం రాష్ట్ర స్థాయి అధికారుల చేతుల్లో ఉంటుంది. జిల్లా పౌరసరఫరాల శాఖకు సంబంధం లేదు. రేషన్ అలాట్‌మెంట్ తర్వాత కార్డుదారులకు పంపిణీ విషయమై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. మిగిలిన కార్డుదారులకు రేషన్ అందించేలా చర్యలు చేపడతాం.
– అంకయ్య, డీఎస్‌ఓ
చౌక దుకాణాలకు
పూర్తి స్థాయిలో జరగని సరఫరా
కార్డుదారుల ఇబ్బందులు
అయ్యప్పగుడి ప్రాంతానికి చెందిన 75 ఏళ్ల వృద్ధురాలు శాంతమ్మ బియ్యం కోసం నాలుగుసార్లు ఎండీయూ వాహనం, ఆ ప్రాంత చౌక దుకాణం చుట్టూ తిరిగారు. అయినా ఫలితం లేకుండా పోయింది.
కోవూరుకు చెందిన మస్తాన్ అనే వ్యక్తి బియ్యం కోసం వారం రోజులుగా తిరుగుతున్నారు. ఇంత వరకు అందలేదు.
నెల్లూరు రూరల్ మండలం పొట్టేపాళేనికి చెందిన వ్యవసాయ కార్మికుడు శ్రీనివాసరావు రేషన్ కోసం చౌక దుకాణం చుట్టూ తిరుగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment