బుచ్చిరెడ్డిపాళెం బస్టాండ్ నుంచి చెన్నూరు రోడ్డు వరకు ఆక్రమణలు అత్యంత సమస్యాత్మకంగా మారాయి. ఈ క్రమంలో ఇటీవల కమిషనర్ చంద్రశేఖరరెడ్డి పట్టణాభివృద్ధిని కాంక్షించి రోడ్డును ఆక్రమించిన వ్యాపారులను తొలగించేందుకు నడుం బిగించారు. ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒకరు లోకాయుక్తను ఆశ్రయించారు. లోకాయుక్త ఇచ్చిన నోటీసులను కొంత మంది రియల్టర్లకు కమిషర్ జారీ చేసినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచే కమిషనర్ బదిలీ అంటూ ప్రచారం జరిగినప్పటికీ పలు ఆక్రమణల తొలగింపు ప్రక్రి య కొనసాగింది. నూతనంగా నిర్మిస్తున్న కూరగాయల మార్కెట్‌కు వెళ్లే రోడ్డులో నీటిపారుదల శాఖకు చెందిన స్థలాన్ని ఆక్రమించి కొందరు వ్యాపారులు పక్కాగా షాపులు నిర్మించి నిర్వహిస్తున్నారు. వాటిని కూడా తొలగిస్తే చెన్నూరు రోడ్డు నుంచి మార్కెట్‌కు, బైపాస్ రోడ్డు వరకు రహదారి విశాలంగా ఉంటుందనే ఆలోచనతో కమిషనర్ కొంత మేర కొలతలు కూడా తీశారు. ఆ స్థలం నీటిపారుదల శాఖకు చెందినది కావడంతో ఆ శాఖ జిల్లా ఎస్‌ఈ, ఈఈలకు కమిషనర్ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. రూ.కోట్ల విలువైన ఆ స్థలాలను వదులు కునేందుకు ఇష్టపడని వ్యాపారులు పైరవీలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి ఆకస్మికంగా కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డిని రాష్ట్ర పురపాలక శాఖా కార్యాలయంలో రిపోర్టు చేసుకోవాల్సిందిగా ఉత్తర్వులు అందాయి. ఆ స్థానంలో నెల్లూరు కార్పొరేషన్‌లో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న డబ్బుగుంట బాలకృష్టను నియమిస్తూ ఆదేశాలు సైతం వచ్చా యి. ఆరు నెలల్లో ఉద్యోగ విరమణ చేయనున్న ఉద్యోగులను బదిలీలు చేయకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ ఆయన బదిలీ జరగడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా ఆయన బదిలీ వెనుక ఎమ్మెల్యే కోటరీ శక్తులు బలంగా పని చేసినట్లు సమాచారం. కమిషనర్ బదిలీ విషయం తెలుసుకుని కలకలం రేగడంతో, నష్ట నివారణ చర్యల్లో భాగంగా బుధవారం బుచ్చిరెడ్డిపాళెం వచ్చిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి రోడ్డు మార్జిన్ నుంచి తొలగించిన చిరు వ్యాపారులకు భరోసా ఇచ్చారు. ఆక్రమణలను తొలగింపును అడ్డుకునేందుకు చర్యలు తాత్కాలికంగా ఉపశమనం కలిగించవచ్చు కానీ, బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ అభివృద్ధికి ఆదిలోనే హంసపాదు పడినట్లుగా అయింది.
Comments
Please login to add a commentAdd a comment